veerappa moily congress evm remarks chidambaram opposition వీరప్ప మొయిలీ కాంగ్రెస్ ఈవీఎం చిదంబరం ప్రతిపక్షం
కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన వీరప్ప మొయిలీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ ఆ పార్టీకి షాకిచ్చారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) వాడకంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నవారితో కాంగ్రెస్ కలవడంపట్ల మొయిలీ ఘాటుగా స్పందించారు. నిరాశావాదులే ఇటువంటి ప్రయత్నాలు చేస్తారన్నారు.
ఈవీఎంలు సందేహాలకు అతీతమైనవని స్పష్టం చేశారు. వీటిని వ్యతిరేకిస్తున్నవారితో గొంతు కలిపేందుకు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని నిరాశావాద ఆలోచనా ధోరణిగా అభివర్ణించారు. తాను కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా పని చేసిన కాలంలో ఈవీఎంలను ప్రవేశపెట్టారని, వాటిపై ఫిర్యాదులు కూడా వచ్చాయని చెప్పారు. వాటిని తనిఖీ చేయించామన్నారు.
ఈవీఎంలకు వ్యతిరేకంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన ప్రతిపక్షాలతో కాంగ్రెస్ కలవడం గురించి మీడియా ప్రశ్నించగా.. వీరప్ప మొయిలీ పై విధంగా స్పందించారు. ఈ విషయంపై తమలో చాలా మందిని సంప్రదించలేదన్నారు. ఈవీఎంల గురించి తమకు బాగా తెలుసునని చెప్పారు. యూపీఏ హయాంలో కూడా వాటిని పరీక్షించి చూశామన్నారు. ఓటమికి కారణం ఈవీఎంలు కాదని స్పష్టం చేశారు.

నిరాశావాదులే ఈవీఎంలను నిందిస్తారని, అందులో పస లేదని కుండబద్దలుకొట్టారు.
స్థానికంగా కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉందని, వాటిని పరిష్కరించే వ్యవస్థ ఉందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేసే అవకాశానికి స్థానిక పొరపాట్లకు తేడా ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం గురించి మాట్లాడటం సరికాదని వివరించారు. ఆ విషయంలోకి తాను పోదల్చుకోలేదన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత ఈవీఎంలకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడంతో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ నేతలకు చెంపపెట్టులా మారింది. ఈవీఎంలపై తీవ్రంగా విరుచుకుపడుతున్న పార్టీలకు ఇది ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను వ్యతిరేకించిన విషయం తెలిసిందే.