• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎన్కటి కాలం వచ్చెనా.. కరోనా తరుముతుంటే.. అరిగోస పడుతున్న వలసజీవులు

|

మానవాళికి పెనుముప్పుగా పరిణమించిన కరోనా వైరస్ జనజీవాన్ని స్తంభింపజేసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు లాక్ డౌన్ ప్రకటించడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. దీంతో వలసజీవులు అరిగోస పడుతున్నారు. బతుకుదెరువు కోసం వలసొచ్చిన చోట.. ఇప్పుడు పని లేక,గూడు లేక తల్లడిల్లిపోతున్నారు. పోనీ.. ఊరికి తిరిగి వెళ్లిపోదామంటే కాలినడక తప్ప మరో మార్గం లేదు. అయినా సరే.. ధైర్యం కూడదీసుకుని వేలాది కి.మీ నడుస్తూ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఆధునిక రవాణా సౌకర్యాలేవీ లేని మన తాతల,తండ్రుల కాలంలో ఎంత దూరమైనా కాలి నడకనే వెళ్లేవాళ్లని మనమంతా వినే ఉంటాం. ఇప్పుడు కరోనా మహమ్మారి తరుముతుంటే.. బతుకుని భారంగా భుజానికేసుకుని బైలెల్లిన ఎంతోమంది కూలీ జనం కళ్లముందు కనిపిస్తున్నారు..

హైదరాబాద్ టు ఉత్తరాంధ్ర.. కాలినడకనే..

హైదరాబాద్ టు ఉత్తరాంధ్ర.. కాలినడకనే..

మార్చి 24వ తేదీ రాత్రి ప్రధాని మోదీ దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించకముందే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 31 వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు ఏపీలోనూ మార్చి 31 వరకు సీఎం జగన్ లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో చాలామంది కూలీ జనాలకు అప్పుడే అనుమానం మొదలైంది. లాక్ డౌన్ మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని పసిగట్టినవారు స్వస్థలాలకు బయలుదేరారు. అలా మార్చి 24వ తేదీ రాత్రి ఉత్తరాంధ్రకి చెందిన ఆరుగురు వ్యక్తుల బృందం హైదరాబాద్ నుంచి కాలినడక ఉత్తరాంధ్ర బయలుదేరింది. మూడు,నాలుగు రోజుల తర్వాత ఆ బృందం శుక్రవారం(మార్చి 27) అర్థరాత్రి ఎట్టకేలకు విశాఖ జిల్లాలో అడుగుపెట్టింది. రేపటి లోగా వీరంతా తమ స్వస్థలాలకు చేరుకోనున్నారు. దాదాపు 650కి.మీ పాటు సాగిన ఈ మొత్తం ప్రయాణంలో చాలాచోట్ల జర్నలిస్టు మిత్రులు వారికి తిండి పెట్టి ఆదరించారు. సీనియర్ జర్నలిస్ట్ ఒమ్మి రమేష్ బాబు ఈ బృందం ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. వారికి ఆహారం,మంచినీళ్లు అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ బృందం కాలి నడక ప్రయాణం గురించి తన ఫేస్‌బుక్‌లో పోస్టు ద్వారా వెల్లడించారు.

వరంగల్ టు మంచిర్యాల..

వరంగల్ టు మంచిర్యాల..

వరంగల్‌లో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే ఓ పెద్దాయన లాక్ డౌన్ కారణంగా కాలినడకనే అక్కడి నుంచి మంచిర్యాలకు చేరుకున్నాడు. వరంగల్‌లో కూలీ పని చేసుకుని బతకడం తప్ప అతనికంటూ గూడు లేదు. రోడ్లపై తిరిగినా.. రైల్వే స్టేషన్లు,బస్టాండ్లలో పడుకున్నా పోలీసులు కొడుతుండటంతో.. గత్యంతరం లేక రైల్వే పట్టాల వెంబడి నడుచుకుంటూ మంచిర్యాలకు బయలుదేరాడు. అలా మూడు రోజుల పాటు ఏకధాటిగా నడిచి మంచిర్యాలకు చేరుకున్నాడు. మధ్య మధ్యలో కొన్ని గ్రామాల్లో నిద్రచేస్తూ.. ఎవరైనా ఏదైనా పెడితే తింటూ ముందుకు కదిలాడు. ఆ పెద్దాయన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దేశవ్యాప్తంగా వందలాది వలసజీవులు..

దేశవ్యాప్తంగా వందలాది వలసజీవులు..

హైదరాబాద్‌లో మరో కుటుంబం నగరం నుంచి కాలినడకనే కర్ణాటక సరిహద్దులోని నారాయణఖేడ్‌కి బయలుదేరింది. మరో కుటుంబం శనివారం తెల్లవారుజామున టాటా ఏస్ వాహనంలో కర్ణాటకలోని రాయచూర్ వెళ్తుండగా.. రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కండ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. లారీ వెనుక నుంచి ఢీకొట్టిన ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు.. బతుకుదెరువు కోసం వలస వెళ్లిన ఎంతోమంది ఇప్పుడు కాలినడకన పల్లెబాట పడుతున్న దృశ్యాలు దేశమంతటా కనిపిస్తున్నాయి. ఢిల్లీలోని ఫిరోజాబాద్‌లో పనిచేసే ఓ కూలీ మహిళ.. లాక్ డౌన్ కారణంగా కాలినడకన 220కి.మీ దూరంలోని ఉత్తరప్రదేశ్‌లో ఉన్న తన స్వస్థలం అబకర్‌పూర్‌కు బయలుదేరారు. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నా.. సొంత ఇళ్లు లేకపోవడం.. ఏ క్షణం ఏమవుతుందోనన్న ఆందోళన వారిని నగరాల నుంచి గ్రామాలకు తరుముతోంది.

English summary
With the effect of coronavirus lock down across the country till April 14th,country's migrant laboures are suffering more. They are going to their villages by walking hundreds of kilometers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more