కబళించిన రైలు: వారం క్రితమే ఈ-పాస్ కోసం ఆప్లై, స్పందించని ఎంపీ సర్కార్.. కాలినడకన బయల్దేరి...
ఔరంగబాద్ రైలు ప్రమాదానికి ఒక రకంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వమే కారణం. కూలీలు దరఖాస్తు చేసిన ఈ పాస్‌లు పెండింగ్‌లో ఉండటం వల్ల వారు కాలినడకన బయల్దేరారు. మహారాష్ట్ర జల్నాలో గల ఐరన్ ఫ్యాక్టరీలో కూలీ పనిచేసుకుంటున్న వారు.. సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ వెళ్లేందుకు అనుమతి కోసం దరఖాస్తు (ఈ-పాస్) చేసుకున్నారు. అయితే వారి అభ్యర్థనపై శివరాజ్ సింగ్ సర్కార్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కాలినడకన ఇంటికి బయల్దేరుదామని.. వెళ్లగా మధ్యలోనే మృత్యువు కబళించింది.
కరోనా లాక్ డౌన్: 100 మంది సీపీఎం మహిళలపై ఖాకీల లాఠీచార్జీ, ఎక్కడో, ఎందుకో తెలుసా...?

దూరంగా పడుకోవడంతో..
కూలీలు జల్నా నుంచి ఔరంగబాద్ వరకు 45 కిలోమీటర్లు నడిచారు. అక్కడే పట్టాలపై సేద తీరడంతో సమస్య వచ్చింది. మరో 120 కిలోమీటర్లు అయితే భూసవాల్ చేరుకునేవారు. తమకు కొంచెం పెండింగ్ పని ఉందని.. కానీ తమ వారు రాష్ట్రానికి వెళదామని అనడంతో బయల్దేరామని ధీరేంద్ర సింగ్ అనే వ్యక్తి మీడియాకు చెప్పారు. ఉమారియా జిల్లా మామన్కు చెందిన సింగ్.. సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు వారం క్రితం ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. 16 మంది పట్టాలపై పడుకోగా.. సింగ్ మాత్రం కాస్త దూరంగా పడుకొన్నారు. దీంతో గాయాలతో బయటపడ్డారు.
12 మంది..
రైలు కూత విని, తనతో పాటు మరొ ఇద్దరు ట్రాక్ పై పడుకొన్న వారికి కేక వేశామని చెప్పారు. చనిపోయిన వారిలో 12 మంది శాడొల్ జిల్లాకు చెందినవారేనని సింగ్ తెలిపారు. ట్రాక్‌పై కూలీలు పడుకోవడంతో వారి వస్తువులు, రొట్టేలు, పాదరక్షలు చెల్లాచెదురుగా పడిపోయి కనిపించాయి. వాస్తవానికి శ్రామిక్ పేరుతో రైళ్లను నడుపుతామని తెలిపింది. కానీ రైళ్లు నడపడంలో మాత్రం ఇబ్బందులు రావడంతో వలస కూలీలు కాలినడకన వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

3,400 దరఖాస్తులు తిరస్కరణ
ఈ పాస్ పోర్టల్‌లో శుక్రవారం సాంకేతిక సమస్య తలెత్తింది. గత కొద్దిరోజుల నుంచి సర్వర్ సమస్య ఉంది అని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 1.79 లక్షల మంది ఆప్లై చేసుకున్నారని.. 99 వేల మందికి పాసులు జారీచేశామని అధికారులు చెబుతున్నారు. మొత్తం 2.21 లక్షల మంది ఆప్లై చేశారని పేర్కొన్నది. వీరిలో 3 వేల 400 మందివి మాత్రం దరఖాస్తులు తిరస్కరించామని వివరించారు. వారిలో ఈ కూలీలు ఉండొచ్చు అనే అనుమానం వ్యక్తమవుతోంది.