తెగబడ్డ మిలిటెంట్లు .. పుల్వామా పీఎస్‌పై దాడి, 8 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
శ్రీనగర్ : సరిహద్దులో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. వరుసగా దాడులు చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నిన్న ఆర్మీ మేజర్ చనిపోగా .. ఇవాళ పోలీసు స్టేషన్ లక్ష్యంగా గ్రేనెడ్ విసిరారు. ఉగ్రవాదుల చర్యలకు భద్రతా బలగాలు ధీటుగా స్పందిస్తున్నాయి. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహిస్తూ .. ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాయి.
పీఎస్ లక్ష్యంగా ..
పుల్వామా పోలీసుస్టేషన్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి చేశారు. ఇవాళ స్టేషన్‌పై గ్రేనెడ్ విసిరారు. దీంతో అక్కడే ఉన్న ఎనిమిది మంది గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఒకరికి సురక్షితంగా బయటపడగా .. ఐదుగురు పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. ఇద్దరు మాత్రం క్రిటికల్‌గా ఉన్నారని పేర్కొన్నారు. వీరికి మెరుగైన చికిత్స అందించడానికి శ్రీనగర్ తరలించినట్టు పేర్కొన్నారు. పీఎస్‌పై గ్రేనెడ్తో దాడిచేశాక ఆ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

మేజర్ మృతి ...
మరోవైపు సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ మేజర్ చనిపోయిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో అనంత్‌నాగ్ జిల్లాలో జవాన్లు జల్లెడ పడుతున్నారు. అచవల్ ఏరియాలో అణువణువును పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా బలగాల తనిఖీలతో ఉగ్రవాదులు అప్రమత్తమయ్యారు. ఓ ఇంట్లో నక్కిన టెర్రరిస్టులు జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. వారికి ధీటుగా భారత భద్రతా బలగాలు కూడా స్పందించాయి. ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఆర్మీ మేజర్ ర్యాంకు అధికారి ఒకరు చనిపోయారు. అధికారి ర్యాంకు గల మరో ఇద్దరు, ఇద్దరు జవాన్లు కాల్పుల్లో గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం 92 బేస్ ఆస్పత్రికి తరలించారు.