షాకింగ్ : 17 ఏళ్ల అత్యాచార బాధితురాలిపై 38 మంది రేప్..? 33 మంది అరెస్ట్...
కేరళలో దారుణం జరిగింది. మలప్పురం జిల్లాకు చెందిన 17 ఏళ్ల ఓ అత్యాచార బాధితురాలిపై 38 మంది లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన కేరళలో సంచలనం రేకెత్తిస్తోంది. 13 ఏళ్ల వయసులో మొదటిసారి అత్యాచారానికి గురైన ఆ బాలిక కొన్నాళ్లు షెల్టర్ హోమ్‌లో రక్షణ పొందింది. కానీ అక్కడినుంచి బయటకొచ్చాక ఆమెకు రక్షణ కరువైంది. కామాంధుల చేతిలో మళ్లీ అత్యాచారానికి గురైంది. గత కొద్ది నెలలుగా తనపై వరుస అత్యాచారాలు జరిగాయని ఇటీవల నిర్భయ పోలీసులకు బాధితురాలు వెల్లడించింది.

2016లో మొదటిసారి...
మలప్పురం జిల్లాకు చెందిన బాధిత బాలిక 2016లో 13 ఏళ్ల వయసులో మొదటిసారి అత్యాచారానికి గురైంది. ఆ ఘటన తర్వాత స్థానిక అధికారులు బాలికను చైల్డ్ హోమ్‌కు తరలించారు. దాదాపు ఏడాది తర్వాత 2017లో తిరిగి ఆమెను ఇంటికి పంపించారు. కానీ ఆ తర్వాత కొద్దిరోజులకే మళ్లీ ఆమె అత్యాచారానికి గురైంది.తమ పొరుగింటి వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

38 మంది అత్యాచారం...
ఆ ఫిర్యాదుతో బాధిత బాలికను పోలీసులు నిర్భయ కేంద్రానికి తరలించారు. గతేడాది కరోనా లాక్ డౌన్ సమయంలో నిర్భయ కేంద్రం నుంచి తిరిగి ఆమెను ఇంటికి పంపించారు. కానీ ఆ తర్వాత ఆమె ఆచూకీ తెలియరాలేదు. పోలీసులు బాలిక కోసం వెతకగా డిసెంబర్లో పాలక్కడ్‌లోని ఓ ప్రాంతంలో ఆమె ఆచూకీ లభ్యమైంది. దీంతో ఆమెను మళ్లీ నిర్భయ కేంద్రానికి తీసుకొచ్చారు. అక్కడ ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో తనపై జరిగిన అత్యాచారాలను బయటపెట్టింది. 38 మంది ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు వెల్లడించింది.

33 మంది అరెస్ట్...
బాలికపై అత్యాచారానికి పాల్పడిన 38 మంది నిందితుల్లో 33 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనపై మలప్పురం శిశు సంక్షేమ కమిటీ ప్రెసిడెంట్ షాజేష్ భాస్కర్ మాట్లాడుతూ... బాలిక రక్షణ కోసం తాము అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. షెల్టర్ హోమ్‌లో బాధితురాలికి తగిన కౌన్సెలింగ్ నిర్వహించాకే.. తిరిగి సమాజంలో ఆమె సాధారణ జీవితాన్ని మొదలుపెట్టాలన్న ఉద్దేశంతోనే ఆమెను ఇంటికి పంపించామన్నారు.

షెల్టర్ హోమ్ నిర్లక్ష్యం ఉందా?
నిజానికి షెల్టర్ హోమ్ నుంచి వెళ్లిన బాలికలపై ఫాలో అప్ చేస్తుంటామని... కానీ గతేడాది లాక్ డౌన్ కారణంగా అది సరిగా చేయలేకపోయామని షెల్టర్ హోమ్ నిర్వాహకులు తెలిపారు. షెల్టర్ హోమ్ వైపు నుంచి ఏదైనా నిర్లక్ష్యం జరిగిందా అన్న కోణంలోనూ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మహమ్మద్ హనీఫా తెలిపారు. అరెస్టయిన నిందితులను జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నట్లు చెప్పారు.