బీఫ్ వార్: శామ్యూల్ గా మారిన సిద్దరామయ్య!
బెంగళూరు: సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును మార్చివేసిన వ్యక్తి కోసం కర్ణాటక సైబర్ క్రైం పోలీసులు గాలిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేరును శామ్యూల్ గా మార్చి వికీపీడియా వైబ్ సైట్ లో పెట్టారు.
వికీపీడియా వైబ్ సైట్ లో సీఎం సిద్దరామయ్య పేస్‌ని గుర్తించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయన పేరును శామ్యూల్ గా మార్చి వేశాడు. మీరు గోమాంసం తింటారు కాబట్టి మీ పేరును శామ్యూల్ గా మార్చి వేశామని పోస్టు చేశారు.
వికీపీడియాలో సిద్దరామయ్య పేరును శామ్యూల్ గా మార్చారని గుర్తించిన అధికారులు వెంటనే వికీపీడియా అడ్మినిస్ట్రేటర్ల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అధికారులు శామ్యూల్ పేరును తొలగించి సిద్దరామయ్య పేరును పునరుద్దరించారు.
వికీపీడియా వెబ్ సైట్ లో వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్నిఎవరైనా పొందుపరిచే వీలుండటంతో ఓ గుర్తు తెలియని దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని అధికారులు చెప్పారు. గోమాంసం తినాలనిపిస్తే తాను తింటానని సిద్దరామయ్య చెప్పిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి ఆయన మీద పలువురు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం సిద్దరామయ్యకు దమ్ముంటే శివమొగ్గ చేరుకుని గోమాంసం ఆరగించాలని, అక్కడే ఆయన తల నరికి ఫుట్ బాల్ ఆడుకుంటామని ఓ బీజేపీ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు వికీపీడియాలో ఈ విధంగా చేశారు.