ఆమ్వే ఇండియాకు ఈడీ భారీ షాక్: మనీలాండరింగ్ కేసులో రూ. 757 కోట్ల ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ: మల్టీ లెవల్ మార్కెటింగ్ ప్రమోటింగ్ కంపెనీ ఆమ్వే ఇండియాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) భారీ షాకిచ్చింది. గొలుసుకట్టు వ్యాపారం మోసం కేసులో ఆమ్వేపై మానీలాండరింగ్ కేసు నమోదు చేశారు ఈడీ అధికారులు. అంతేగాక, ఆమ్వేకు చెందిన రూ. 757 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు.
జప్తు చేసిన ఆస్తుల్లో స్థిర, చరాస్తులతో పాటు బ్యాంకు ఖాతాల్లోని నగదు నిల్వలు కూడా ఉన్నాయి. ఆమ్వే నిబంధనలకు విరుద్ధంగా గొలుసుకట్టు వ్యాపారం చేస్తూ కుంభకోణానికి పాల్పడుతోందని ఆరోపణలున్నాయి. ఈ కంపెనీ ఉత్పత్తుల ధరలు బహిరంగ మార్కెట్లో లభించే ప్రముఖ ఉత్పత్తుల ధరలతో పోలిస్తే అధికంగా ఉన్నాయని ఫిర్యాదులు అందాయి.

ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు.. కంపెనీపై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం ఆమ్వేకు చెందిన మొత్తం రూ. 757.77 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసుకున్నట్లు తెలిపారు. అటాచ్ చేసిన ఆస్తుల్లో తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని సంస్థ పరిశ్రమ భవనం, యంత్రాలు ఉన్నాయి. రూ.411.83 కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తులు సీజ్ చేసిన ఈడీ.. 36 బ్యాంకు ఖాతాల్లో ఉన్న 345.94 కోట్లను జప్తు చేసింది.
కాగా, మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గత డిసెంబర్లో ఈ కంపెనీలకు కొత్త నియమ నిబంధనలు అమల్లోకి తెచ్చారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలు అందిస్తున్న పొడక్టులన్నీ రెగ్యులర్ మార్కెట్లో ఉన్న ఉత్పత్తుల కంటే అధిక ధరతో ఉండటం, ఈ వ్యాపారంలో భాగస్వాములకు అధిక మొత్తంలో కమిషన్లు అందివ్వడం తదితర వ్యవహరాలపై అనేక విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ చర్యలకు ఉపక్రమించింది.