అద్వానీ-మోడీ నవ్వేశారు: మొన్న అలా, నేడు ఇలా(ఫొటోలు)
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీల ప్రవర్తనతో వారి మధ్య దూరం పెరిగినట్లు అనిపించింది. బుధవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జరిగిన సన్నివేశాలను చూస్తే అదంతా ఉత్తదేనని తేలిపోయింది.
ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీ, అద్వానీ పక్కపక్కనే కూర్చున్నారు. అంతేగాక, ఇద్దరూ సన్నిహితంగా మాట్లాడుకుంటూ ఉల్లాసంగా నవ్వుకున్నారు. కాగా, ఇటీవల బెంగళూరులో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అద్వానీకి పెద్దగా ప్రాధాన్యత లభించకపోవడంతో చిన్నబుచ్చుకున్నట్లు వార్తలు వచ్చాయి.

అందుకే సమావేశాల్లో ప్రసంగించాలన్న నేతల అభ్యర్థనలను అద్వానీ తోసిపుచ్చినట్లు తెలిసింది. అద్వానీని జ్యోతి ప్రజ్వలనకే పరిమితం చేయడం, బెంగళూర్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కూడా అద్వానీకి పెద్దగా స్థానం దక్కకపోవడం గమనార్హం. కాగా, బిజెపి 35 ఏళ్ల చరిత్రలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో అద్వానీ సంప్రదాయబద్దమైన ముగింపు ప్రసంగం చేయకపోవడం ఇది రెండోసారి.
సమావేశంలో ప్రసంగం చేయాలని శుక్రవారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన విజ్ఞప్తిని ఆయన తోసిపుచ్చారు. బెంగళూర్ సమావేశం సందర్భంగా అద్వానీ, ప్రధాని నరేంద్ర మోడీ ఎడమొహం, పెడమొహంగానే వ్యవహరించారు. వారిద్దరు కనీసం మాటలు కూడా కలుపుకోలేదని చెప్పుకున్నారు.

ఇది ఇలా ఉండగా అద్వానీకి సోమవారం న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో జరిగిన భారతీయ జనతా పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవాలకు కూడా ఆహ్వానం లభించనట్లు సమాచారం. అమిత్ షా నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ.. అద్వానీకి ఎలాంటి సందేశం పంపించలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా తాజా ఘటనతో మోడీ.. అద్వానీల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేనట్లుగా చెప్పుకోవచ్చు.












Click it and Unblock the Notifications