మోడీ సర్కార్ పేదల కోసం , అల్లుళ్ళ కోసం కాదు .. కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలు మరియు మధ్యతరగతి ప్రజల కోసం పని చేస్తుందని, కొంతమంది అల్లుళ్ళ కోసం పని చేయడం లేదని నిర్మల సీతారామన్ కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేస్తూ విమర్శించారు. ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలు తోసిపుచ్చుతూ తమ పార్టీ ప్రజల కోసం పని చేస్తోందని, కార్పొరేట్ల కోసం పనిచేయడం లేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ వీడ్కోలు సభలో ప్రధాని మోడీ భావోద్వేగం:నిజమైన మిత్రుడు అంటూ కితాబు

అల్లుడు అనే పదం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు ట్రేడ్ మార్క్ నా ?
బడ్జెట్ పై చర్చ సందర్భంగా రాజ్య సభలో మాట్లాడిన నిర్మల సీతారామన్ కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాని టార్గెట్ చేసి విమర్శించారు.
నిర్మల సీతారామన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నిర్మలాసీతారామన్ అల్లుడు అనే పదం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు ట్రేడ్ మార్క్ అని తాను అనుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లోనూ అల్లుళ్ళు ఉంటారని, కాకపోతే కాంగ్రెస్ పార్టీలో మాత్రం అల్లుడు అనేది ఒక ప్రత్యేకమైన పదం అంటూ వ్యాఖ్యానించారు.

తమ ప్రభుత్వం పని చేసేది పేదల కోసం .. కార్పోరేట్ల కోసం కాదు
ప్రతిపక్షాలకు నిత్యం తప్పుడు వార్తలు సృష్టించడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. ప్రతిపక్షంలో కొంతమందికి నిరంతరం ఏదో ఒక ఆరోపణలు గుప్పించడం అలవాటుగా మారిందని నిర్మలా సీతారామన్ విమర్శించారు. తమ ప్రభుత్వం పేదలకోసం ఎంతో చేసిందని పేర్కొన్నారు నిర్మలాసీతారామన్. కరోనా నేపథ్యంలో 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాల సరఫరా చేశామని, ఎనిమిది కోట్ల మందికి ఉచితంగా వంటగ్యాస్ అందించామని, నాలుగు కోట్ల మంది రైతులకు, మహిళలు , దివ్యాంగులకు నగదు బదిలీ చేశామని నిర్మల సీతారామన్ వివరించారు. ఇక వీరంతా ధనికులా అని ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించారు.

కాంగ్రెస్ హయాలో ఏ నాడూ బడ్జెట్ అంచనాలను అందుకోలేదు
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద సుమారు 1.6 కోట్ల ఇళ్లు పూర్తయ్యాయని 2.67 కోట్ల ఇళ్లకు పీఎం సౌభాగ్య యోజన కింద విద్యుత్ అందించామని పేర్కొన్న నిర్మల సీతారామన్... వీరంతా బడా కార్పొరేట్లా ? అని ప్రశ్నించారు కాంగ్రెస్ హయాంలో ఏనాడు బడ్జెట్ అంచనాలను అందుకోలేదని పేర్కొన్న నిర్మలాసీతారామన్ ఈ ఆర్థిక సంవత్సరంలో 90, 500 కోట్ల రూపాయలు వెచ్చించి మన బడ్జెట్ అంచనాలకు మించి ఖర్చు చేశామని వివరించారు.

యూపీఐని తీసుకు వచ్చింది పేదల కోసం.. పెట్టుబడిదారులు, అల్లుళ్ళ కోసమైతే కాదు
ఉపాధి హామీ పథకంలో లోపాలన్నింటినీ తొలగించామని స్పష్టం చేశారు. 2016 ఆగస్టు నుంచి 2020 జనవరి వరకు 3.6 లక్షల కోట్ల లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయని పేర్కొన్న నిర్మల సీతారామన్ యూపీఐ అయిన వాడిన వారంతా ధనికులా అని ప్రశ్నించారు. యూపీఐని ప్రభుత్వం తీసుకు వచ్చింది మధ్యతరగతి , చిరు వ్యాపారుల కోసమే తప్ప పెట్టుబడిదారులు, అల్లుళ్ళ కోసమైతే కాదు అంటూ నిర్మల సీతారామన్ కాంగ్రెస్ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు.