• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఇంజినీర్స్ డే: మోక్షగుండం విశ్వేశ్వరయ్య హైదరాబాద్‌ను వరదల నుంచి కాపాడిన మేధావి

By BBC News తెలుగు
|

మోక్షగుండం విశ్వేశ్వరయ్య

మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజినీర్. ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 15ను భారత్‌లో 'ఇంజినీర్స్ డే' గా జరుపుకొంటారు.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15న ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని ముద్దనహళ్లిలో జన్మించారు. ముద్దనహళ్లి అప్పటికి మైసూర్ సంస్థానంలో భాగంగా ఉండేది.

విశ్వేశ్వరయ్య తండ్రి పేరు శ్రీనివాసశాస్త్రి, తల్లి వెంకటలక్ష్మమ్మ. శ్రీనివాసశాస్త్రి ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. ఆయన సంస్కృత పండితుడు కూడా. కానీ విశ్వేశ్వరయ్యకు 12 ఏళ్లుండగా తండ్రి మరణించారు.

చిక్‌బళ్లాపూర్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం ముగిసిన తర్వాత 1881లో డిగ్రీ చదవడానికి బెంగళూరు వెళ్లారు. ఆ తర్వాత పుణేలోని కాలేజ్‌ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఉన్నతవిద్య అభ్యసించారు.

ఆ తర్వాత ముంబయిలోని పీడబ్ల్యూడీ విభాగంలో కొద్దికాలం పనిచేశారు. అక్కడినుంచి ఇరిగేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు వెళ్లారు.

మైసూర్ అభివృద్ధిలో కీలక పాత్ర

1912 నుంచి 1918 వరకూ విశ్వేశ్వరయ్య మైసూర్ సంస్థానానికి దివాన్‌గా పనిచేశారు.

మాండ్య జిల్లాలోని కృష్ణరాజసాగర్ డ్యామ్ నిర్మాణానికి ఈయనే ముఖ్యకారణం.

మైసూర్ అభివృద్ధిలో విశ్వేశ్వరయ్య పాత్ర ఎంతో కీలకం. కృష్ణరాజసాగర్ డ్యామ్, భద్రావతి ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్, మైసూర్ శాండల్ ఆయిల్ అండ్ సోప్ ఫ్యాక్టరీ, యూనివర్శిటీ ఆఫ్ మైసూర్, బ్యాంక్ ఆఫ్ మైసూర్... వంటి ఎన్నో సంస్థల ఏర్పాటులో ఆయన కృషి దాగి ఉంది.

ఆయనను కర్ణాటక రాష్ట్ర భగీరథుడు అని కూడా పిలుస్తారు. సింధు నది నుంచి సుక్కూర్ పట్టణానికి నీటిని తరలించేందుకు ఆయన ఇచ్చిన ప్రణాళిక అప్పట్లోని ఇంజినీర్లందరినీ మెప్పించింది. అప్పుడు ఆయన వయసు 32.

నీటిపారుదల వ్యవస్థను మరింత సమర్థంగా చేయడానికి ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ సూచనల ఆధారంగా బ్లాకుల వ్యవస్థను అభివృద్ధి చేసింది.

స్టీల్ గేట్ల ఏర్పాటు ద్వారా డ్యామ్ నుంచి నీటి ప్రవాహాన్ని అడ్డుకోగలిగారు.

బ్రిటిష్ అధికారులు కూడా విశ్వేశ్వరయ్య ఆలోచనలను అభినందించారు.

హైదరాబాద్‌లో మూసీ వరదల అడ్డుకట్టకు ప్రణాళిక

హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి కాపాడేందుకు ఉద్దేశించిన ప్రణాళికను కూడా విశ్వేశ్వరయ్యే రూపొందించారు.

అప్పట్లో హైదరాబాద్‌లో వరదలను నివారించేందుకు అవసరమైన ప్రణాళికలను సూచించాల్సిందిగా మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నిజాం కోరారు.

మూసీతోపాటు దాని ఉపనదిగా ఉండే ఈసీపై కొన్ని జలాశయాలను నిర్మించాలని ప్రతిపాదిస్తూ విశ్వేశ్వరయ్య ఓ ప్రణాళికను సిద్ధం చేశారు. మురుగునీటి పారుదలకు అవసరమైన సూచనలు చేశారు. ఈ ప్రణాళికలు నిజాంను ఎంతగానో మెప్పించాయి.

ఆ తర్వాత ఆయన మైసూర్‌కు చీఫ్ ఇంజినీర్‌గా నియమితులయ్యారు.

దేశ అభివృద్ధికి పరిశ్రమలే ప్రధానమని ఆయన బలంగా నమ్మేవారు. అందుకే ఆయన జపాన్, ఇటలీ దేశాలకు చెందిన నిపుణులతో సిల్క్, శాండల్‌వుడ్, లోహ.. వంటి ఎన్నో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేశారు.

బ్యాంక్ ఆఫ్ మైసూర్ పేరుతో ఓ బ్యాంకును ప్రారంభించారు. దాన్నుంచి వచ్చే ఆదాయాన్ని వ్యాపారాభివృద్ధికి ఖర్చుచేసేవారు. 1918లో దివాన్‌ పదవి నుంచి విరమణ పొందారు.

రైల్వే స్టేషన్

రైలు పట్టాలు విరిగి ఉన్నట్లు ముందే గుర్తించారు

విశ్వేశ్వరయ్యకు సంబంధించి బాగా ప్రాచుర్యంలో ఉన్న మరో విషయం ఉంది.

బ్రిటిష్ కాలంలో భారత్‌లో ఓసారి ఓ రైలు వెళ్తోంది. అందులో చాలామంది బ్రిటిషర్లే ఉన్నారు. వారితో పాటు ఓ భారతీయుడు కూడా కూర్చుని ప్రయాణిస్తున్నాడు.

నల్లటి చర్మరంగు కలిగి, సన్నగా ఉన్న ఆ వ్యక్తి తెల్లటి దుస్తులు ధరించి ఉన్నాడు. అతడిని చూసిన బ్రిటిషర్లు.. అతడో తెలివితక్కువవాడని, నిరక్షరాస్యుడని వేళాకోళం చేయసాగారు. కానీ అతడు అవేమీ పట్టించుకోలేదు.

కానీ, ఉన్నట్లుండి లేచి నిలబడిన ఆ వ్యక్తి రైలు చైన్ లాగాడు. వేగంగా వెళ్తున్న రైలు కొద్దిసేపట్లోనే ఆగింది. అందరూ అతడి గురించే మాట్లాడుకోసాగారు. అక్కడికొచ్చిన గార్డు.. చైన్ ఎవరు లాగారని ప్రశ్నించాడు.

'నేనే' అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు. 'ఎందుకు లాగానో చెప్పనా... కొద్ది దూరంలో రైలు పట్టాలు దెబ్బతిన్నాయని నాకనిపిస్తోంది' అని ఆ వ్యక్తి చెప్పాడు.

నీకెలా తెలుసు అని గార్డు మళ్లీ ప్రశ్నించాడు.

రైలు సాధారణ వేగంలో వచ్చిన మార్పు, దానితో పాటు శబ్దంలో వచ్చిన మార్పును బట్టి నాకు అలా అనిపించింది అని ఆ వ్యక్తి అన్నాడు.

దీంతో కొద్ది దూరం నడిచి వెళ్లి చూసిన గార్డు అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. రైలు పట్టాలు రెండూ దూరందూరంగా పడి ఉన్నాయి. నట్లు, బోల్టులు దేనికవి విడిపోయి ఉన్నాయి.

ఈ ఘటనలో చైన్ లాగిన వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య.

పురస్కారాలు

1955లో విశ్వేశ్వరయ్యకు భారత దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న ప్రదానం చేసింది.

ప్రజాజీవనాన్ని మెరుగుపరిచేందుకు ఉద్దేశించే ఎన్నో కార్యకలాపాలు చేపట్టినందుకు గుర్తింపుగా బ్రిటిష్-భారత్ ప్రభుత్వానికి చెందిన కింగ్ జార్జ్ 5 'నైట్ కమాండర్' బిరుదుతో సత్కరించారు.

ఇవి కాకుండా ఆయనకు మరెన్నో అవార్డులు, పురస్కారాలు లభించాయి.

ఆయన పేరు మీద ఎన్నో సంస్థలు ఏర్పాటయ్యాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Mokshagundam Visvesvaraya is the genius who saved Hyderabad from floods.మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజినీర్. ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 15వ తేదీని భారత్‌లో 'ఇంజనీర్స్ డే' గా జరుపుకొంటారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X