ఇదో కుట్ర, ఘోర వైఫల్యం: మన్మోహన్ సంచలనం, సభలోనే మోడీ
పెద్ద నోట్ల రద్దుపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర స్థాయిలో స్పందించారు.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద సంఘటిత నేరమని, ఎందరో ప్రభుత్వ పెద్దలు ఈ నేరం వెనుక కుట్ర చేశారని రాజ్యసభ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభలో పాత నోట్ల రద్దుపై మన్మోహన్ చర్చను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేవలం నోట్ల రద్దు వల్ల నల్లధనాన్ని పూర్తిగా అరికట్ట వచ్చని మోడీ చేస్తున్న ప్రచారాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. నోట్ల రద్దుకు ముందు ఎంతమాత్రమూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని, పూర్తి అనాలోచితంగా వేసిన అడుగులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు.

సామాన్యులు నిత్యమూ పనులు మానుకుని ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు గంటల కొద్దీ నిలబడుతున్నారని మన్మోహన్ తెలిపారు. ప్రజల కష్టాలకు మోడీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని, తక్షణం వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
నోట్ల రద్దు తరువాత వివిధ క్యూలైన్లలో వేచి చూస్తూ, 65 మంది వరకూ మరణించాలన్న వార్తలు తనను కలచి వేశాయని చెప్పారు. బ్యాంకుల వద్ద కనీస ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేయలేకపోయిందని దుయ్యబట్టారు. ఉగ్రవాదం, చొరబాట్లు సైతం పెద్ద నోట్ల రద్దు వల్ల జరుగుతుందని ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు.
నోట్ల రద్దు గురించిన సమాచారం బీజేపీ నేతలకు ముందే తెలుసునన్న అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఎంతో మంది బీజేపీ నేతలు, రద్దు నిర్ణయం వెల్లడించడానికి ముందే కొత్త కరెన్సీలతో సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పెట్టుకున్నారని, దీనికి ఏం సమాధానం చెబుతారని మోడీని ఉద్దేశించి సూటిగా ప్రశ్నించారు.
నల్లధనానికి అడ్డుకట్ట వేయబోవద్దని తాను చెప్పడం లేదని, నోట్ల రద్దు మంచిది కాదని కూడా అన్నానని, ఇదే సమయంలో ప్రజాగ్రహం ఏ పార్టీకీ లాభించదని, వారు ఇబ్బందులు పడితే పాలకులు వృథాయేనని అన్నారు. ప్రభుత్వం నిర్మాణాత్మక ఆలోచనలతో ముందుకు రావాలని సూచించారు. ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటే సహకరిస్తామని మన్మోహన్ తెలిపారు. కాగా, ఇతర ఎంపీలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ పార్లమెంటులో మాట్లాడారు. ఇది ఎమర్జెన్సీని తలపిస్తోందని ఎంపీ నరేష్ అగర్వాల్ అన్నారు.
పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకం: తృణమూల్ కాంగ్రెస్
పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలే ఇబ్బంది పడుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ అన్నారు. తాము నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. రూ. 2వేల నోట్లతో ప్రయోజనమేంటని ఎంపీ డెరిక్ ప్రశ్నించారు. సరిపడా వందనోట్లు ఎందుకు ముద్రించలదేని నిలదీశారు. డెబిడ్, క్రెడిట్ కార్డులను ఎంత మంది వాడుతున్నారు? అని ప్రశ్నించారు. చాలా గ్రామాల్లో బ్యాంకులే లేవని అన్నారు.
పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకం కాదు: కాంగ్రెస్
పెద్దనోట్ల రద్దుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని కాంగ్రెస్ సభ్యుడు గులాంనబీ ఆజాద్ అన్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని పరిష్కరించాలని కోరుతున్నామని అన్నారు.
ముందు జాగ్రత్తలేవి?
పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బహుజన సమాజ్ వాదీ పార్టీ ఎంపీ యాయావతి అన్నారు. ప్రభుత్వం ముందు జాగ్రతలు తీసుకోలేదని మండిపడ్డారు. కాగా, మాయావతి మాట్లాడిన అనంతరం భోజన విరామానికి రాజ్యసభ వాయిదా పడింది.












Click it and Unblock the Notifications