ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ములాయం, అఖిలేశ్‌కు రిలీఫ్ : వ్యతిరేకంగా సాక్ష్యం లేదన్న సీబీఐ
న్యూఢిల్లీ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌కు ఉపశమనం కలిగింది. ఈ కేసులో వారికి క్లీన్చిట్ ఇస్తూ సుప్రీంకోర్టులో సీబీఐ ఇవాళ అఫిడవిట్ దాఖలు చేసింది. వారిద్దరిపై కేసు నమోదు చేసేందుకు తమకు సాక్ష్యాలు లభించలేదని పేర్కొన్నది. అందుకోసమే ఈ కేసును 2013 ఆగస్టులో మూసేసినట్టు అఫిడివిట్లో సీబీఐ ప్రస్తావించింది.
సుప్రీంలో పిల్ ..
అధికారాన్ని దుర్వినియోగం చేసి ములాయం ఫ్యామిలీ ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టిందని గతంలో ఆరోపణలు వచ్చాయి. దీంతో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ నేత విశ్వనాథ్ చతుర్వేది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2005లో పిటిషన్ దాఖలు చేయగా .. 2007 లో విచారణ చేపట్టింది. ములాయం, కుమారుడు అఖిలేశ్ యాదవ్, ప్రతీక్ యాదవ్, కోడలు డింపుల్ యాదవ్‌పై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. అయితే తర్వాత ఈ కేసు నుంచి డింపుల్ యాదవక్ మినహాయింపునిచ్చింది.

మరోసారి పిటిషన్
ఈ కేసు విచారణ క్రమంలో పోలీసులు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దీంతో పిటిషనర్ విశ్వనాథ్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై గత మార్చిలో సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ములాయం, అఖిలేశ్ ఆదాయానికి మించిన ఆస్తుల గురించి దర్యాప్తు సంస్థ సీబీఐపై పలు ప్రశ్నలు గుప్పించింది. ములాయం, అఖిలేశ్‌పై కేసు సంగతేంటీ ? కేసు నమోదు చేశారా అని ప్రశ్నించింది. దర్యాప్తునకు సంబంధించి నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐకి సాక్ష్యాధారాలు లభించకపోవడంతో .. సీబీఐ ఇవాళ అఫిడవిట్ దాఖలు చేసింది.