ఆరు నెలలుగా తల్లి మృతదేహంతో కూతురు జీవనం .. ముంబైలో దారుణ ఘటన
ఒక మహిళ తన తల్లి మృతదేహంతో కలిసి ఆరు నెలల కాలం జీవనం సాగించిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. మృతదేహంతో కలిసి ఆరు నెలలు జీవనం సాగించడం స్థానికులను షాక్ కు గురి చేసింది.
ముంబైలోని బాంద్రా ప్రాంతానికి చెందిన ఒక వృద్ధ మహిళ మృతదేహాన్ని ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్న క్రమంలో ఈ విషయం వెలుగు చూసింది.
పోలీసుల సమాచారం ప్రకారం .. ఈ సంవత్సరం మార్చిలో సదరు వృద్ధ మహిళ కన్నుమూసింది . అయినప్పటికీ ఆమె మరణ వార్తను ఆమె 53 ఏళ్ల కుమార్తె ఎవరికీ తెలియజేయకుండా శవాన్ని ఇంట్లో పెట్టుకుని జీవనం సాగిస్తుంది.
తల్లి మరణించిన విషయం కూడా అర్థం చేసుకోలేని తీవ్ర మానసిక రుగ్మతతో ఆ మహిళ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది మార్చిలోనే తల్లి మరణించినట్లుగా గుర్తించిన పోలీసులు ఆ కుటుంబానికి బయట వ్యక్తులు ఎవరితోనూ సత్సంబంధాలు లేకపోవడం కారణంగా ఆమె మరణాన్ని ఎవరూ తెలుసుకోలేకపోయారు అంటూ పేర్కొన్నారు.
మతిస్థిమితం లేని కుమార్తె ప్రతిరోజు కిటికీ వెలుపల చెత్త విసిరేయడం, ఇంట్లోని చెత్తతో పాటు మలాన్ని కూడా కిటికీ నుంచి బయటపడేస్తూ ఉండటంతో ఇరుగుపొరుగువారు ఇబ్బందిగా ఫీల్ అయ్యి పోలీసులకు సమాచారం అందించారు .

అక్కడికి చేరుకున్న పోలీసులు ఓ గదిలో తల్లి ఎముకలను గుర్తించి 6 నెలల క్రితం తల్లి మరణించినట్లుగా అంచనా వేశారు. ఆ మహిళ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతుందని గుర్తించిన పోలీసులు చుట్టుపక్కల వారి ద్వారా సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశారు. గతంలో ఇంట్లో కుక్క చనిపోయినప్పుడు కూడా ఆమె అలాగే కుక్క తో పాటు ఉండిపోయిందని ఇరుగు పొరుగు వారు పేర్కొన్నారు. ఇక మరణించిన వృద్ధ మహిళ మృత దేహానికి సంబంధించిన శాంపిల్స్ ను శవ పరీక్షల నిమిత్తం పంపించిన అధికారులు, మానసిక వ్యాధితో బాధపడుతున్న ఒక మహిళను వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మానసిక వ్యాధి కారణంగా మహిళ తల్లి మృతదేహంతో ఆరునెలలపాటు జీవనం సాగించిన దుర్భర ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.