• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మియన్మార్ సంక్షోభం: సైనిక పాలకులు ఫేస్‌బుక్‌ అంటే ఎందుకు భయపడుతున్నారు?

By BBC News తెలుగు
|

మియన్మార్‌లో చాలామందికి ఇంటర్నెట్‌ అంటే ఫేస్‌బుక్ అని‌,ఫేస్‌బుక్ అంటే ఇంటర్నెట్ అని మాత్రమే తెలుసు. ఆ దేశంలో ఫేస్‌బుక్‌కు ఉన్న ఆదరణ అలాంటిది. అందుకే దేశంలో పరిస్థితులు చక్కబడేందుకు ఇంటర్నెట్ సర్వీసులను నిలిపేస్తున్నామని మిలిటరీ పాలకులు ప్రకటించగానే యూజర్లు షాక్‌కు గురయ్యారు.

ఫిబ్రవరి 1న మియన్మార్‌లో ప్రభుత్వాన్ని నడుపుతున్న వారందరినీ నిర్బంధంలో పెట్టి సైన్యం అధికారాన్ని చేతుల్లోకి తీసుకుంది.

ఈ పరిణామాలకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను తెలుసుకోవడానికి మియన్మార్‌ ప్రజలు ఫేస్‌బుక్‌ మీద ఆధార పడ్డారు. వాళ్లకది వార్తలు అందించే ప్రాథమిక వనరుగా మారింది.

దీనినిబట్టి ఆ దేశంలో ఫేస్‌బుక్‌ వ్యాప్తి, దాని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

మియన్మార్‌లో ఫేస్‌బుక్‌ ఎందుకంత పాపులర్‌?

2000 సంవత్సరం వరకు మియన్మార్ ప్రజలకు ఇంటర్నెట్‌ అంటే ఏంటో తెలియదు. మొబైల్‌ ఫోన్ కూడా అప్పటి వరకు అందుబాటులోకి రాలేదు.

అప్పట్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెలీకమ్యూనికేషన్‌ వ్యవస్థ ఎంపీటీ నుంచి ఒక సిమ్‌ కొనుక్కోవాలంటే వందల డాలర్లను ఖర్చు చేయాల్సి వచ్చేది.

ప్రపంచంలో అతి తక్కువ మొబైల్‌ ఫోన్‌లు వాడే దేశంగా అప్పటికి మియన్మార్‌కు పేరుండేది.

2011లో ఆ దేశంలో ఆర్ధిక సంస్కరణలు మొదలయ్యాయి. 2014నాటికి రెండు మొబైల్‌ ఆపరేటర్లు నార్వేకు చెందిన టెలీనార్‌, ఖతార్‌కు చెందిన ఓరీడూలకు దేశంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతి లభించింది.

వాటితోనే చాలామంది బర్మీస్‌కు మొబైల్‌ ఫోన్‌ వాడే అవకాశం వచ్చింది. ధరలు కూడా తగ్గడంతో అనేకమంది మొబైల్ ఫోన్లు కొని వాడటం మొదలుపెట్టారు.

“మియన్మార్‌లో రాత్రికి రాత్రే మొబైల్‌ విప్లవం మొదలైంది. ఒకేసారి అందరూ మొబైల్‌ ఫోన్లు వాడటం మొదలు పెట్టారు” అని యాంగాన్‌లో ఉంటున్న రాజకీయ విశ్లేషకుడు రిచర్డ్‌ హార్సే అన్నారు.

2010లో మియన్మార్‌లో ప్రవేశించిన ఫేస్‌బుక్‌ ఎలాంటి డేటా ఖర్చులు లేకుండానే తమ సర్వీసులు వాడుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో సహజంగానే దానికి పాపులారిటీ పెరిగింది.

ముందుగానే ఇన్‌స్టాల్‌ చేసిన మొబైల్‌ ఫోన్‌లు కూడా మార్కెట్‌లో వెల్లువెత్తడంతో అందరూ ఫేస్‌బుక్‌ వాడటం ప్రారంభించారు.

“గతంలో ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలంటే టీస్టాల్‌ దగ్గర జనం చేరేవారు. టీ తాగుతూ సమాచారాన్ని తెలుసుకునేవారు. కానీ ఫేస్‌బుక్‌ వచ్చాక పరిస్థితి మారిపోయింది. ఇప్పుడది డిజిటల్‌ టీ షాప్‌గా మారింది” అన్నారు హార్సే.

సుమారు 5.4 కోట్లమంది జనాభా ఉన్న మియన్మార్‌లో దాదాపు సగంమంది ఫేస్‌బుక్‌ వాడుతున్నారు.

ఫేస్‌బుక్‌ను బ్లాక్‌ చేయడం సైనిక పాలనపై వ్యతిరేక ప్రచారానికి విఘాతమని భావిస్తున్నారు.

ఫేస్‌బుక్‌ చుట్టూ వివాదాలెందుకు?

2012లో రఖైన్‌ రాష్ట్రంలో బౌద్ధులకు, రోహింజ్యా ముస్లింలకు మధ్య మత ఘర్షణలు జరిగాయి. ఫేస్‌బుక్‌ కారణంగా ఈ ఘర్షణలు మరింత ముదిరే ప్రమాదం ఉందన్న ఆందోళన అప్పట్లో వినిపించింది.

2014లో అషిన్‌ విరాతు అనే బౌద్ధ బిక్షువు.. ఒక ముస్లిం వ్యక్తి బౌద్ధ మతానికి చెందిన యువతిని అత్యాచారం చేశాడంటూ ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను షేర్‌ చేశారు.

ఈ వీడియో చూశాక ఆగ్రహావేశాలకులోనైన కొందరు, నిందితులుగా అనుమానిస్తున్న వ్యక్తులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు.

తర్వాత జరిగిన పోలీస్‌ విచారణలో ఆ అత్యాచారంపై విడుదలైన వీడియో అంతా కల్పితమని తేలింది.

ఫేస్‌బుక్‌లో ప్రచారమైన ఈ స్పీచ్‌ కారణంగానే హింస జరిగిందని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల విభాగం అధికారులు తేల్చారు.

హింసాత్మక ఆలోచనలు ఉన్నవారు తమ ప్లాట్‌ఫామ్‌ను వాడుకోవడాన్ని నిరోధించడంలో తాము విఫలమయ్యామని ఫేస్‌బుక్‌ అంగీకరించింది.

“ఓ వర్గం మీద దాడికి, హత్యలకు ఫేస్‌బుక్‌ కారణమైంది. హింసను ప్రేరేపించే ప్రచారాన్ని నిరోధించే చర్యలు తీసుకోవాల్సిందిగా అప్పటికే ఫేస్‌బుక్‌కు సూచనలు అందాయి. కానీ వారి నిర్లక్ష్యం హత్యాకాండకు దారి తీసింది” అని రిన్‌ ఫిజిమట్సు వ్యాఖ్యానించారు. ఆమె ప్రోగ్రెసివ్‌ వాయిస్‌ అనే రీసెర్చ్‌ గ్రూప్‌లో పని చేస్తారు.

ఈ ఘటనల తర్వాత ఫేస్‌బుక్‌ కొన్ని చర్యలు చేపట్టింది. మిలిటరీ అధికారులను, ద్వేష పూరితంగా కామెంట్లు పెట్టేవారిని తమ ప్లాట్‌ఫామ్‌ నుంచి నిషేధించింది.

ప్రస్తుత మిలిటరీ పాలకుడు మిన్‌ ఆంగ్‌ హ్లయింగ్‌ను కూడా ఫేస్‌బుక్‌ 2018లో నిషేధించింది. ఆర్మీకి చెందిన టెలివిజన్‌ ఛానల్‌ 'మ్యావాడీ’ని తన ప్లాట్‌ఫామ్‌ మీద కనిపించకుండా చేసింది ఫేస్‌బుక్.

మొబైల్ ఫోన్లతో మియన్మార్ యువతులు

ఇప్పుడెందుకు ఫేస్‌బుక్‌ను బ్లాక్‌ చేశారు?

దేశంలో అస్ధిరత ఏర్పడకుండా ఉండేందుకు ఫేస్‌బుక్‌ను బ్లాక్‌ చేయాల్సిందిగా మిలిటరీ పాలకులు ఆదేశించారు. ఈ పరిణామంతో ప్రజలు చేపట్టిన శాసన ఉల్లంఘన ఉద్యమానికి తీవ్ర విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడింది.

అనేక వ్యాపారాలతోపాటు, కోవిడ్‌-19కు సంబంధించిన సూచనలు, సలహాల ప్రచారంపై కూడా ప్రభావం పడుతోంది.

“ఇది ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను, సమాచార హక్కును అడ్డుకోవడమే. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో సమాచార వ్యాప్తి అనేది చాలా కీలకం” అని ఫుజిమట్సు అన్నారు.

ఫేస్‌బుక్‌ను బ్లాక్‌ చేయడంతో ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టారు. ట్విటర్‌లాంటి సోషల్ మీడియాతో పాటు, 'బ్రిడ్జిఫై'లాంటి ఆఫ్‌లైన్‌ మెసేజింగ్‌ యాప్‌లకు ఆదరణ పెరుగుతోంది.

“ప్రజలు తమ కుటుంబ సభ్యులు, బంధువులతో నిరంతరం టచ్‌లో ఉండటానికి వీలుగా నిషేధాన్ని తొలగించాలని విజ్జప్తి చేస్తున్నాం”అని ఫేస్‌బుక్‌ ప్రభుత్వాన్ని కోరింది.

ప్రస్తుతం మియన్మార్‌లో పరిస్థితులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని, మిలటరీ తిరుగుబాటును సమర్ధించేవారి పోస్టులను తొలగిస్తున్నామని కూడా ఫేస్‌బుక్‌ వెల్లడించింది.

మిలిటరీ తిరుగుబాటుకు వ్యతిరేకంగా తలపెట్టిన శాసన ఉల్లంఘన ఉద్యమానికి ఫేస్‌బుక్‌ కీలకంగా మారింది. చాలామంది యూజర్లు తమ ప్రొఫైల్ పిక్చర్లను మార్చి, ఆంగ్‌సాన్‌ సూచీకి మద్దతు ప్రకటిస్తున్నారు.

మియన్మార్‌లో గతంలో జరిగిన ఘటనలను బట్టి అర్ధం చేసుకోగలిగేది ఏంటంటే, ఆ దేశంలో మానవ హక్కుల పరిరక్షణ, భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడటం చాలా ముఖ్యమని ఫేస్‌బుక్‌ భావిస్తోంది.

అయితే అదే అభిప్రాయం ఫేస్‌బుక్‌ను ప్రజలకు దూరం చేస్తుందా ? అలా జరగకపోవచ్చన్న మాట వినిపిస్తోంది.

“ఫేస్‌బుక్‌ను ఎలా వాడుకోవాలో ప్రజలకు బాగా తెలుసు. అలాగే మిలిటరీ పాలనలో సమాచార ప్రసారం ఎంత బలహీనంగా మారుతుందో కూడా తెలుసు. అందుకే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రజలు ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటారు. తమకు సమాచారం అందించే ఇతర మార్గాలపై దృష్టిపెడతారు’’ అని ఫుజిమట్సు అన్నారు.

అయితే ఇప్పుడు అందుబాటులో లేకపోయినంత మాత్రాన దాని ప్రాధాన్యత తగ్గిపోదని, బర్మీయుల జీవితంలో ఫేస్‌బుక్‌ విడదీయరాని భాగంగా మారిందని ఫుజిమట్సుతోపాటు మరికొందరు అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Myanmar Crisis: Why Are Military Rulers Afraid of Facebook
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X