బెంగళూరులో భారీ వింత శబ్ధాల కలకలం: భయాందోళనలు, ఏం జరిగిందో?
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం ఉదయం భారీ వింత శబ్ధాలు వినిపించాయి. దీంతో ఒక్కసారిగా నగరవాసులు భయాందోళనలకు గురయ్యారు. సర్జాపూర్, హెచ్ఎస్ఆర్ లేవుట్, వైట్ ఫీల్డ్, హెబ్బల్ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఒక్కసారిగా పెద్దగా శబ్ధం వచ్చిందని తెలిపారు.
ఏపీ బెటర్! మహమ్మారి కరోనా విషయంలో ఇలానా?: తెలంగాణ సర్కారుపై కేంద్రం ఆగ్రహం

భూకంపం మాత్రం కాదు..
ఈ శబ్ధంతో చాలా మంది నగర ప్రజలు భూకంపం ఏదైనా వచ్చిందేమోనని భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అది భూకంపం కాదని, ఎక్కడా ఎలాంటి నష్టం జరగలేదని బెంగళూరు పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు తెలిపారు.
ఎమర్జెన్సీ నెంబర్ 100కు కూడా ఎలాంటి కాల్స్ రాలేదని చెప్పారు.

ఆకాశంలో వాయుసేన హెలికాప్టర్లు..
ఏదైనా విమానంకు సంబంధించిన శబ్ధమా అనే సందేహంతో ఎయిర్ ఫోర్స్ కంట్రోల్ రూంను సంప్రదించామని, వారి నుంచి సమాచారం రావాల్సి ఉందని సీపీ భాస్కర్ రావు చెప్పారు. కాగా, వాయుసేన కార్యకలాపాల వల్లే ఆ శబ్ధం వచ్చిందని పలువురు చెబుతున్నారు. వాయుసేనకు సంబంధించిన పలు హెలికాప్టర్లు కూడా ఆకాశంలో కనిపించాయని మరికొందరు చెప్పారు.

ఎలాంటి నష్టం లేదు కానీ..
తూర్పు బెంగళూరు ప్రాంతంలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ వింత శబ్ధం వినిపించిందని పోలీసు వర్గాలు వన్ఇండియాకు తెలిపాయి. అయితే ఆ శబ్ధం ఏంటనేది తెలియాల్సి ఉందని చెప్పాయి. ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టామని ఎక్కడా ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు.

2018 తర్వాత మరోసారి అలాంటి శబ్ధం..
హెచ్ఏఎల్, ఐఏఎఫ్ అధికారులను సంప్రదించామని, వారి నుంచి సమాచారం రావాల్సి ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. 2018లో కూడా ఇలాంటి వింత శబ్ధాలు వినపడటంతో నగరవాసులు భయాందోళనలకు గురయ్యారు. అయితే, అది కూడా భూకంపంకు సంబంధించిన శబ్ధం కాదని తేల్చారు.