మళ్లీ మొదటికొచ్చింది: నాలుగు నెలల్లో నాగాలాండ్ మళ్లీ సంక్షోభం
కోహిమా: నాగాలాండ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లైజైత్సును ఈ నెల 15వ తేదీలోగా అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాలని రాష్ట్ర గవర్నర్ పీబీ ఆచార్య ఆదేశించారు. బలపరీక్ష ఫలితాలను బట్టి తదుపరి కార్యాచరణ చేపడతామని చెప్పారు. నాగాలాండ్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం తలెత్తింది. అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)లో మెజారిటీ ఎమ్మెల్యేలు మాజీ సీఎం టీఆర్ జెలియాంగ్‌కు మద్దతు పలికారు.
60 స్థానాలు గల నాగాలాండ్ అసెంబ్లీలో 41 మంది ఎమ్మెల్యేలు జెలియాంగ్‌కు మద్దతుగా బయటకు వచ్చారు. మరోవైపు లైజైత్సు నలుగురు మంత్రులతో పాటు 11 మంది పార్లమెంటరీ కార్యదర్శులను పదవి నుంచి తప్పించారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి సీఎం జెలియాంగ్ పదవి నుంచి దిగిపోయి, ఆ ఆ స్థానంలో లైజైత్సు సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
తాజాగా తనకు ఎమ్మెల్యేల మద్దతుందని తెలుపుతూ.. జెలియాంగ్ మళ్లీ సీఎం పీఠమెక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ పీబీ ఆచార్యకు ఎన్పీఎఫ్ శాసనసభా పక్షం తరఫున లేఖ రాసిన జీలియాంగ్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. తనకు 33 మంది ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని ఆ లేఖలో తెలిపారు.
జెలియాంగ్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. తనను పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారని అన్నారు. న్యూ నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) డెమొక్రటిక్ అలయన్స్ ఆఫ్ నాగాలాండ్ (డీఏఎన్) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను జీలియాంగ్ కోరారు.
ఇంకా ఎమ్మెల్యేగా ఎన్నిక కాని లియోజిస్త్ సీఎంగా వైదొలిగి జీలియాంగ్ సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరారు. ప్రస్తుతం తనకు మద్దతుగా నిలిచిన 33 మంది ఎమ్మెల్యేలతో జీలియాంగ్ అసోంలోని కజీరంగా రిసార్ట్‌లో క్యాంప్ ఏర్పాటు చేశారు. మరో 11మంది ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలు లియోజిస్త్, లోక్‌సభ సభ్యుడు నిపురియోలకు మద్దతునిస్తున్నారు. మిగతా సభ్యులు తటస్థ వైఖరి ప్రదర్శిస్తున్నారు.

ఇలా సంక్షోభం ప్రారంభం
ఎన్పీఎఫ్ అధ్యక్షుడిగా ఉన్న లైజైత్సు సీఎంగా నియమితులైన ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యేందుకు వీలు కల్పిస్తూ నార్తరన్ అంగామీ - 1 స్థానం నుంచి ఆయన కుమారుడు ఖ్రియెహు లైజెత్సు గత మే 24వ తేదీన రాజీనామా చేశారు. త్వరలో లైజైత్సు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉన్నది. ఈ నెల 29వ తేదీన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో ఎన్పీఎఫ్‌లో ముసలం పుట్టింది.

ఎన్సీఎఫ్‌లో సంక్షోభం నాలుగోసారి
గత ఫిబ్రవరి 22వ తేదీన జెలియాంగ్ నుంచి లైజైత్సు సీఎంగా పదవీబాధ్యతలు స్వీకరించడం గమనార్హం. పట్టణ స్థానిక సంస్థల పాలక మండళ్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు జీలియాంగ్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. నిరసన హింసాత్మక రూపం దాల్చింది. రాష్ట్ర రాజధాని కొహిమా సహా పలు పట్టణాల్లో అప్పట్లో జన జీవనం స్తంభించింది. మహిళలకు రిజర్వేషన్ల కల్పన ద్వారా తమ ఆధిపత్యాన్ని దెబ్బ తీస్తున్నారని ప్రజా ప్రతినిధులంతా ఆందోళనకు మద్దతునిచ్చారు. తమ జాతుల్లో ఇది సంప్రదాయం కాదనే కొత్త వాదన తీసుకొచ్చారు. నిరసన వెల్లువెత్తడంతో దీంతో సీఎంగా జెలియాంగ్ తప్పుకుని లైజెత్సుకు అధికారం అప్పగించారు. అధికార ఎన్పీఎఫ్‌లో సంక్షోభం నెలకొనడం ఇది నాలుగోసారి.

ఆరుగురు ఎమ్మెల్యేలపై లైజైత్సు వేటు
ఎన్పీఎఫ్ అధ్యక్షుడు, నాగాలాండ్ సీఎం లైజైత్సు అసమ్మతివాదులపై కొరడా ఝుళిపించారు. నలుగురు మంత్రులను తన క్యాబినెట్ నుంచి సస్పెండ్ చేశారు. మాజీ సీఎం జెలియాంగ్‌తోపాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలను ఎన్పీఎఫ్ నుంచి సస్పెండ్ చేశారు. లైజైత్సును తన సలహాదారు పదవి నుంచి తొలగించారు. తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని గవర్నర్ పీబీ ఆచార్యకు జీలియాంగ్ లేఖ రాసిన వెంటనే లైజైత్సు స్పందించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు నలుగురు మంత్రులు సహా ఆరుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.