గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నరసారావుపేట అనూష హత్య: నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నాడా... పరారీలో ఉన్నాడా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అనూష

"రోజూలానే కాలేజీకి వెళ్లి వస్తుందని అనుకున్నాం. కానీ బుధవారం మధ్యాహ్నం 12గం.ల సమయంలో పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. మీ పిల్లను ఎవరో హత్య చేశారు, రావాలని ఎస్సై ఫోన్ చేశారు. దాంతో వెంటనే బయలుదేరి వెళ్లాం. అప్పటికే చంపిన వాడు దర్జాగా వచ్చి తానే హత్య చేశానని పోలీసుల ముందు లొంగిపోయాడు. ప్రేమించలేదని చంపేసిన వాడిని పోలీసులు జాగ్రత్తగా కాపాడుతున్నారు. మా పిల్లను చంపేసినా ఫర్వాలేదా.. వాడిని మేపుతారా..మా పిల్లకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదు. హంతకుడ్ని ఉరి తీయాలి. అదే మేం అడుగుతున్నాం. లేదంటే మళ్లీ రోడ్డెక్కి ఆందోళనకు దిగుతాం" అంటున్నారు అనూష తల్లి వనజాక్షి.

ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన కోటా ప్రభాకర్ రావు, వనజాక్షి దంపతుల ఏకైక కుమార్తె కోటా అనూష(19) నరసరావుపేటలోని కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ సెకండ్ ఇయర్ విద్యార్థిని. క్లాసుమేట్ అయిన మెడా విష్ణువర్థన్ రెడ్డి (19) అత్యంత క్రూరంగా ఆమెను హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. బొల్లాపల్లి మండలం పమిడిపాడుకి చెందిన విష్ణువర్థన్ రెడ్డి చిన్న నాటి నుంచి ఆకతాయిగా ఉండేవారని, చివరకు తన ప్రేమ విషయంలో అనూషను మట్టుబెట్టడం కలకలం రేపుతోంది.

తల్లితండ్రులు, సోదరుడితో అనూష

మృతదేహంతో ఆందోళన, అధికారుల సర్థుబాటు

ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం క్లాసులకు హాజరయ్యేందుకు కాలేజీకి వచ్చిన అనూషను అక్కడి నుంచి విష్ణువర్థన్ రెడ్డి ఓ ఆటోలో పట్టణ శివార్లకు తీసుకెళ్లినట్టు పోలీసులు చెబుతున్నారు. నరసరావుపేట డీఎస్పీ విజయ్ భాస్కర్ ఆ వివరాలను వెల్లడించారు. బస్సు దిగిన తర్వాత మాట్లాడాలని చెప్పి ఆమెను ఆటోలో ఎక్కించుకుని రావిపాడు సమీపంలోని పంటకాలువ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే ఆమె మీద దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. గొంతు నులిమినట్టు కనిపిస్తోంది. ఆ తర్వాత శవం కనిపించకుండా చెత్త వేసి కప్పెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి ఆరా తీస్తే మృతదేహం లభించింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. అంటూ ఆయన వివరించారు.

ఈ ఘటన తర్వాత విద్యార్థులు ధర్నాకు దిగారు. మృతురాలి కుటుంబీకులతో కలిసి రోడ్డు మీద భైఠాయించారు. వివిధ విద్యార్థి సంఘాలు, విపక్ష నేతలు వారికి మద్ధతు పలికారు. టీడీపీ నేతలు జీవీ ఆంజనేయులు, అరవిందబాబు వంటి వారు ఈ ధర్నాలో పాల్గొన్నారు. పల్నాడు బస్టాండ్ సమీపంలో సుమారు ఆరు గంటల పాటు ఆందోళన కొనసాగింది. చివరకు సబ్ కలెక్టర్ హామీతో బుధవారం నాటి ఆందోళన విరమించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ హామీ ఇచ్చారు.

అనూష తల్లితండ్రులు

ముగిసిన అంత్యక్రియలు

చిన్ననాటి నుంచి చదువుల్లో శ్రద్ధ చూపే తమ బిడ్డ కర్కశత్వానికి బలికావడం సహించలేని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కోటా ప్రభాకర్ రావు కి గోళ్లపాడులో సొంత భూమి ఎకరంలోపు ఉండగా, మరికొంత కౌలు చేస్తున్నారు. మిర్చి, పసుపు పండిస్తూ కుటుంబ పోషణ సాగిస్తున్నారు. ఇద్దరు బిడ్డల్లో పెద్దవాడు కొడుకు వేణు బీటెక్ చదువుతుండగా అనూష డిగ్రీ పూర్తి చేస్తుందనే సంతృప్తిగా ఉన్నామని ఆయన చెబుతున్నారు.

బిడ్డలిద్దరూ బాగా చదువుకుంటున్నారు. మాకు భరోసాగా ఉంటుందని అనుకున్నాం. కానీ, ఇప్పుడు ప్రేమించలేదని నా బిడ్డను పొట్టన పొట్టుకున్నాడు. అమానుషంగా నీటి ఇంజిన్ గొట్టానికి ఆమె తలను బాది బతికి ఉండగానే నరకం చూపించాడు. ఆ తర్వాత చావుబతుకుల్లో ఉండగా కాలితో పీక నొక్కి చంపేశాడు. అలాంటి వాడికి బతికే హక్కు లేదు. రేపు ఇదే రీతిలో మరో అమ్మాయి జీవితంతో ఆడుకుంటాడు. కాబట్టి వాడిని ఉరి తీయాలి. నేతలు, అధికారులు మాకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రికి కూడా ఆడబిడ్డలున్నారు. కాబట్టి బిడ్డను కోల్పోయిన వారిగా మా బాధను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం అంటూ బీబీసీ ముందు వాపోయారు.

పోస్ట్ మార్టమ్ తర్వాత ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అక్కడే అంత్యక్రియలు పూర్తి చేశారు.

దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ రవిచంద్ర

హంతకుడి కోసం గాలిస్తున్నాం...

నిందితుడు విష్ణువర్థన్ రెడ్డి హత్య తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చి లొంగిపోయినట్టు బాధితురాలి కుటుంబీకులు చెబుతున్నారు. మీడియాలో కూడా అవే కథనాలు వచ్చాయి. కానీ పోలీసులు మాత్రం నిందితుడి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు. ఈ కేసును ప్రభుత్వం దిశ పోలీస్ డీఎస్పీగా ఉన్న రవిచంద్రకు అప్పగించింది. ఆయన బీబీసీతో మాట్లాడుతూ తాము నిందితుడి కోసం గాలింపు చర్యల్లో ఉన్నామని తెలిపారు.

నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్యపై ఎఫ్ఐఆర్ నెం. 73/2021 కింద కేసు నమోదయ్యింది. ఐపీసీ సెక్షన్లు 354డి, 364, 302 రెడ్ విత్ 201 కింద కేసులు పెట్టాము. ఆదారాలు సేకరిస్తున్నాము. కఠిన శిక్ష పడేలా చూస్తున్నాం. నిబంధనల ప్రకారం వేగంగా విచారణ పూర్తి చేసి, త్వరలోనే అన్ని ఆధారాలతో కోర్టులో రుజువు చేసి శిక్ష పడేందుకు అనువుగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. బాధితులు కోరుతున్నట్టుగా నిందితుడికి శిక్ష పడేలా చేస్తాం అంటూ డీఎస్పీ రవిచంద్ర వివరించారు.

నరసారావుపేట పోలీసు స్టేషన్

పలువురి పరామర్శ, నష్టపరిహారం ప్రకటన

అనూష హత్య ఘటనపై ముఖ్యమంత్రి స్పందించారు. పోలీసులు కేసు విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. బాధితుల కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. ఈ మేరకు పలువురు నేతలు మృతురాలి కుటుంబీకులను పరామర్శించారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ గోళ్లపాడు వెళ్లి అనూష తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై దాడులు అదుపు చేసేందుకు దిశ చట్టం తీసుకొచ్చాం. అది అమలులోకి వస్తే మహిళలకు పూర్తి రక్షణ ఏర్పడుతుంది. అనూష ఘటనలో ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. నిందితుడికి కఠిన శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నాం. మృతురాలి కుటుంబానికి పది లక్షల రూపాయల నష్టపరిహారం, ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం అంటూ ప్రకటించారు.

పలువురు టీడీపీ నేతలు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తగిన రీతిలో స్పందించాలని డిమాండ్ చేశారు.

కళాశాల విద్యార్థినులకు రక్షణ కల్పించాలి

రాష్ట్రంలో వరుసగా విద్యార్థినులపై జరుగుతున్న దాడులు ఆందోళనకరంగా మారుతున్నాయని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. నరసరావుపేట కాలేజీ విద్యార్థుల సంఘం నాయకుడు ఎం రవీంద్ర బీబీసీతో మాట్లాడారు. కాలేజీ కి వచ్చిన విద్యార్థినిని బలవంతంగా తీసుకెళుతుంటే కాలేజీ యాజమాన్యం ఏం చేస్తోంది. హాస్టల్ లో ఉండే విష్ణువర్థన్ రెడ్డి ఆకతాయిగా వ్యవహరిస్తున్నా ఎందుకు అడ్డుకోలేదు. ఇలాంటి వాటిపై పూర్తి విచారణ చేయాలి. అనూషకి జరిగిన అన్యాయం మరోసారి పునరావృతం కాకూడదు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. రాష్ట్రంలో అనేక చోట్ల విద్యార్థినులపై కళాశాల ఆవరణలోనూ, వెలుపల కూడా దాడులు పెరుగుతున్నాయనడానికి ఇదో ఉదాహరణ, వాటికి అడ్డుకట్ట వేయాలి అంటూ డిమాండ్ చేశారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Narasaraopet Anusha murder: Is the accused in police custody or is he on the run?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X