డిజిటల్ స్ట్రైక్... చైనాపై మోదీ బ్రహ్మాస్త్రం... కానీ వాటి సంగతేంటి...?
గత రెండు నెలలుగా చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు భారత్‌కు పెను సవాల్‌గా మారాయి. జూన్ 15 నాడు ఇరు దేశాల మధ్య తలెత్తిన ఘర్షణలు తారాస్థాయికి చేరుకుని ఇరువైపులా ప్రాణ నష్టం జరిగింది. దీంతో చైనాతో తాడో పేడో తేల్చిపారేయాలని లక్షలాది మంది భారతీయులు భావోద్వేగాలతో కూడిన స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయితే కేంద్రం మాత్రం ఈ విషయంలో తొందరపడలేదు. ఓవైపు సరిహద్దులో మిలటరీ స్థాయి చర్చలు జరుపుతూనే... దౌత్య పరంగా,ఇతర మార్గాల్లో చైనా దూకుడుకు ఎలా బ్రేక్ వేయాలా అన్న దానిపై సమాలోచనలు జరుపుతూ వచ్చింది. ఈ క్రమంలో కేంద్రం తాజాగా చైనాపై 'డిజిటల్ స్ట్రైక్' ప్రకటించింది.

డిజిటల్ స్ట్రైక్...
గ్లోబలైజేషన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ది చెందిన రంగాల్లో డిజిటల్ ఇండస్ట్రీ ముందు వరుసలో ఉంది. సోషల్ నెట్వర్కింగ్ యాప్స్‌తో పాటు న్యూస్,ఎంటర్టైన్మెంట్ అందించే అనేక డిజిటల్ యాప్స్ పుట్టుకొచ్చాయి. ఇందులో ఫేస్బుక్,వాట్సాప్‌లతో పాటు చైనా సృష్టించిన టిక్‌టాక్,హలో,బిగో వంటి సోషల్ యాప్స్ కూడా డిజిటల్ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాయి. ఇలాంటి తరుణంలో భారత్ చైనాపై డిజిటల్ స్ట్రైక్ ప్రకటించడం డ్రాగన్‌కు గట్టి ఎదురు దెబ్బే అని చెప్పాలి. టిక్‌టాక్ అతి తక్కువ కాలంలోనే ప్రపంచాన్ని ఒక ఊపు ఊపే స్థాయికి వచ్చింది. భారత్‌లో అయితే ఏకంగా ఒక్క నెలకే 120 మిలియన్ యూజర్స్‌ను ఈ యాప్ సంపాదించింది. దీని మాతృ సంస్థ బైట్ డ్యాన్స్. ప్రస్తుతం భారత్‌లో దాదాపు 50మిలియన్ల యూజర్స్ ఉన్న హలో యాప్ కూడా ఈ సంస్థదే. తాజాగా భారత్‌లో నిషేధించిన 59 యాప్స్‌లో ఈ రెండు యాప్స్ కూడా ఉన్నాయి.

చైనా పెట్టుబడులు పెట్టిన భారత కంపెనీల సంగతేంటి?
భారత్ తీసుకున్న ఈ చర్యపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. చైనా యాప్స్‌ను నిషేధించారు సరే... మరి చైనీస్ కంపెనీలు పెట్టుబడులు పెట్టిన భారతీయ కంపెనీల మాటేంటి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. బిగ్ బాస్కెట్,బైజుస్,డ్రీమ్ 11,ఫ్లిప్‌కార్ట్,హైక్,మేక్మైట్రిప్,ఓలా,ఓయో,పేటీఎం,పాలసీ బజార్,క్విక్కర్,రివిగో,స్నాప్ డీల్,స్విగ్గీ,జొమాటో వంటి ఇండియన్ కంపెనీల్లో చైనా పెట్టుబడులు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. చైనాతో డీల్ చేయాల్సిన విధానం ఇది కాదని అంటున్నారు.అయితే బీజేపీ మద్దతుదారులు మాత్రం ఈ చర్యపై తీవ్ర ప్రశంసలు కురిపిస్తున్నారు. సింహం గర్జించడం మొదలుపెట్టిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

సైబర్ సెక్యూరిటీ కోసమే...
చైనీస్ యాప్స్ నిషేధం గురించి భారత్ ఇంకా స్పష్టమైన వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఈ నిషేధం ఎప్పటినుంచి అమలులోకి వస్తుంది.. ఏ పద్దతిలో అమలవుతుందన్నది తెలియాల్సి ఉంది. ప్రభుత్వం వెల్లడించిన వివరాల్లో యాప్స్‌పై నిషేధం,అందుకు కారణాన్ని మాత్రమే వెల్లడించింది. డేటా & సైబర్ సెక్యూరిటీని ఇందుకు ప్రధాన కారణంగా ముందుకు తెచ్చింది. ఈ నిర్ణయం వల్ల భారతదేశ సమగ్రత,సౌభ్రాత్రుత్వం,దేశ సైబర్ స్పేస్ పరిరక్షించబడుతాయని పేర్కొంది.

ఆ ఉద్యోగులు ఉన్నపళంగా రోడ్డున పడ్డట్టేనా...
కేంద్రం నిషేధించిన 59 చైనీస్ యాప్స్ ప్రస్తుతం మన దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. చాలావరకు కంపెనీలు ముంబై,ఢిల్లీ కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. ఈ కంపెనీల్లో భారత్ నుంచి వేలాది మంది యువత ఉద్యోగాలు పొందుతున్నారు. అయితే కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో వీరి భవిష్యత్ ఏంటన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఒక్క ప్రకటనతో నిషేధం విధించేస్తే.. వీరంతా ఉన్నపళంగా రోడ్డున పడ్డట్టే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎప్పటికైనా భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండా కేవలం నిషేధాజ్ఞలు జారీ చేయడం వల్ల ఒరిగేదేమీ ఉండదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.