ఎందుకీ మౌనం... వాళ్ల అసలు రంగు ఇప్పుడు బయటపడింది... సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు...
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి,బార్క్ మాజీ సీఈవో పార్థో దాస్ గుప్తా వాట్సాప్ చాట్ లీక్స్‌పై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. జాతీయ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రాజీపడుతోందని మండిపడ్డారు. అర్నబ్ వాట్సాప్ చాట్ లీక్స్‌పై కేంద్రం మౌనాన్ని తప్పు పట్టారు.అర్నబ్ వ్యవహారాన్ని కేంద్రం చూసీ చూడనట్లు వదిలేస్తోందని విమర్శించారు. శుక్రవారం(జనవరి 22) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీ దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు.

అసలు రంగు బయటపడింది...
'ఇతరుల దేశభక్తికి,జాతీయతకు సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ల అసలు రంగు ఇప్పుడు బయటపడింది. అర్నబ్ వాట్సాప్ చాట్ లీక్స్‌పై కేంద్రం మౌనం వహించడం చెవులుండి విననట్లుగానే ఉంది.' అని సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీ బీజేపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ఇటీవల లీకైన అర్నబ్ వాట్సాప్ చాట్‌లో బాలాకోట్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించి ఆయనకు ముందస్తు సమాచారం ఉందన్నట్లుగా అందులోని సంభాషణ బయటపెట్టిన సంగతి తెలిసిందే. రక్షణ శాఖ అత్యంత రహస్యంగా చేపట్టే మిలటరీ ఆపరేషన్స్ ఇలా బయటకు లీకవడం జాతీయ భద్రతకు ముప్పు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సోనియా అర్నబ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

రైతుల పట్ల అహంకారపూరితంగా...
ఇదే సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీ రైతుల ఆందోళనల గురించి ప్రస్తావించారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని సర్వ నాశనం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం అగ్రి చట్టాలను తెచ్చిందన్నారు. రైతుల పట్ల కేంద్రం వైఖరి అహంకారపూరితంగా ఉందని విమర్శించారు. కేంద్రం హడావుడిగా తీసుకొచ్చిన ఆ మూడు చట్టాలపై కనీసం పార్లమెంటులో చర్చకు కూడా అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. దేశంలో ఆహార భద్రతకు మూల స్తంభాలైన కనీస మద్దతు ధర,పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్,పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌లకు ఈ చట్టాలు విఘాతం కలిగిస్తాయని అన్నారు. తొలి నుంచి ఆ చట్టాలను కాంగ్రెస్ పార్టీ తిరస్కరిస్తోందని... ఇదే వైఖరిని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై...
తాజా సీడబ్ల్యూసీ సమావేశంలో సంస్థాగత మార్పులపై కూడా సోనియా గాంధీ చర్చించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో పార్టీకి చెందిన 23మంది సీనియర్లు పార్టీలో ప్రక్షాళన అవసరమంటూ సోనియా గాంధీకి లేఖ రాసిన నేపథ్యంలో... ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో అంతర్గత ఎన్నిక ద్వారా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అంశంపై ఆమె సీడబ్ల్యూసీ సభ్యులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఎప్పుడు జరుగుతుందనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.