ఆన్లైన్ చదువులతో విద్యార్ధులకు చుక్కలు- దేశవ్యాప్తంగా ఇదే పరిస్ధితి-ఎన్‌సీఈఆర్టీ సర్వే
కరోనా వైరస్ ప్రభావంతో స్కూళ్లు తెరిచే పరిస్దితి లేకపోవడంతో దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్ధలు ఆన్‌లైన్ చదువులతో కాలం గడిపేస్తున్నాయి. అంతకంటే ముందే ప్రైవేటు విద్యాసంస్ధలు ఆన్‌లైన్ చదువులను ఆలవాటు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టేశాయి. కానీ ఇప్పటివరకూ క్లాస్ రూమ్ చదువులకు అలవాటు పడిన విద్యార్ధులు... ఈ ఆన్‌లైన్ విద్యాభ్యాసాన్ని రిసీవ్ చేసుకోగలుగుతున్నారా లేదా, ఇందులో వారికి ఎదురవుతున్న సమస్యలేంటి అనే అంశాలను తెలుసుకునేందుకు ఎన్‌సీఈఆర్‌టీ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. ఇందులో విద్యార్ధులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు వెలుగుచూశాయి.
విజయవాడలో 40 శాతం మందికి కరోనా వచ్చిపోయింది- సీరో సర్వైలెన్స్ సర్వే సంచలనం...

ఆన్ లైన్ చదువులు..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుండంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ ఇప్పుడు ఆన్‌లైన్ బాటలోనే ఉన్నాయి. స్కూళ్లు అయితే ఆన్లైన్ చదువులు చెప్పేందుకు సిద్ధమయ్యాయి కానీ క్లాస్ రూమ్ చదువులకు అలవాటుపడిన విద్యార్ధులు మాత్రం ఇంకా వాటికి అలవాటుపడలేదు. ముఖ్యంగా స్కూళ్లతో పోలిస్తే ఇళ్లలో ఉండే సౌకర్యాల కొరతతో పాటు ఇతర సమస్యలూ విద్యార్ధులను వేధిస్తున్నాయి. దీంతో ఆన్ లైన్ చదువులు ఏదో మొక్కుబడిగా సాగిపోతున్నట్లుంది. ఇదే విషయాన్ని జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ సంస్ధ ఎన్‌సీఈఆర్‌టీ ఓ సర్వేలో తేల్చిచెప్పింది.

కరెంటు లేదు, ఫోన్లు, ట్యాబ్‌లూ లేవు...
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ సంస్ధలైన ఎన్‌సీఈఆర్‌టీ, ఎన్‌ఐఈపీఏ, సీబీఎస్‌ఈ, కేవీలు, ఎన్వీలకు చెందిన నిపుణుల కమిటీతో కేంద్ర విద్యాశాఖ ఈ సర్వే నిర్వహించింది. ఇందులో కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన విద్యార్ధులు ఆన్ లైన్ చదువుల్లో భాగంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. అందరు విద్యార్ధులకు ఆన్ లైన్ విద్య సమానంగా అందడం లేదని ఈ కమిటీ గుర్తించింది. విద్యార్ధులకు ఇళ్ల వద్ద ఉండే వాతావరణంతో పాటు కరెంటు కోతలు, ఆన్‌లైన్ విద్యకు అవసరమైన ఫోన్, ట్యాబ్‌లు వెంటి ఎలక్ట్రానిక్ పరికరాల కొరత కూడా ఉందని తెలిపింది. 27 శాతం మంది విద్యార్ధులు కరెంటు కోతలతో 28 శాతం మంది విద్యార్ధులు ఎలక్ట్రానిక్ పరికరాల కొరతను ఎదుర్కొంటున్నట్లు ఈ కమిటీ తేల్చింది.

ఆన్ లైన్ క్లాసులతోనూ ఇబ్బందే...
సౌకర్యాల పరిస్దితి ఎలా ఉన్నా... ఆన్ లైన్ విధానంలో బోధన సాగుతున్న తీరుపై ఈ సర్వేలో పాల్గొన్న 50 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కేంద్రం తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 20 నుంచి 30 శాతం మంది ఆన్ లైన్ విధానం తమకు ఇబ్బందికరంగా ఉందని చెబితే, మరో 10 నుంచి 20 మంది ఇది తమపై భారం పెంచుతోందని వెల్లడించారు. ముఖ్యంగా ఆన్ లైన్ క్లాసులు హాజరవ్వాలంటే ఇంటర్నెట్ సమస్యలు, సిగ్నల్ ఇబ్బందులు, తరచుగా పాఠాలు ఆన్ లైన్‌లో అప్‌లోడ్, డౌన్ లోడ్ చేసుకోవాల్సి రావడం వంటి సమస్యలు ఎదురవుతున్నట్లు వీరు పేర్కొన్నారు. మొబైల్ లో క్లాసులు వినడం కూడా ఇబ్బందిగా ఉందని వీరు తెలిపారు.

బావుందన్న మరికొందరు...
కేంద్రం నిర్వహించిన సర్వేలో పాల్గొన్న సర్వేలో పాల్గొన్న విద్యార్ధులు, టీచర్లు, తల్లితండ్రులు, పాఠశాలల నిర్వాహకులు మొత్తంగా చూస్తే 60 శాతం నుంచి 70 శాతం మంది ఈ విధానం బావుందంటూ కితాబివ్వడం విశేషం. ఆన్ లైన్ పాఠాలు తమ షెడ్యూల్ ప్రకారం అభ్యసించే అవకాశం ఉండటం, టీచర్లు ఇళ్ల వద్దే ఉంటూ తమకిష్టమైన యాక్టివిటీని ప్రోత్సహించడం, తల్లితండ్రులు కూడా వీటిలో భాగస్వాములు కావడం వంటి అంశాలతో సంతృప్త స్ధాయి పెరిగినట్లు తెలుస్తోంది. ఆన్ లైన్ విధానంలో క్లాస్ రూమ్‌తో పోలిస్తే సృజనాత్మకత పెరిగి బోర్ తగ్గిందని కూడా పలువురు విద్యార్ధులు ఈ సర్వేలో తెలిపారు. ఈ అభిప్రాయాలన్నీ తీసుకున్న తర్వాతే కేంద్రం తాజాగా దేశవ్యాప్తంగా మార్గదర్శకాలు విడుదల చేసింది.