50-50 ఫార్ములా: శివసేన ప్రతిపాదనను శివసేన ముందే ఉంచిన ఎన్సీపీ..!
ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీని నిరూపించుకోగలిగితే దాన్ని ఎత్తేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), శివసేన చర్చలు కొనసాగిస్తూనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తరువాత కనీస ఉమ్మడి కార్యాచరణ (కామన్ మినిమమ్ ప్రోగ్రామ్) ను అమలు చేయాలని కాంగ్రెస్ చెబుతుండగా.. 50-50 ఫార్ములాను తెర మీదికి తీసుకొచ్చింది ఎన్సీపీ. ఇన్నాళ్లూ ఏ శివసేన అయితే ఈ ఫార్ములాను బీజేపీ ముందు ఉంచిందో.. అదే ఫార్ములాను శివసేన ముందుకే నెట్టింది.
ముఖ్యమంత్రిగా చెరో రెండున్నరేళ్ల కాలం..
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్ల కాలం పాటు పంచుకోవాలని ఎన్సీపీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనికి శివసేన ఇంకా ఎలాంటి అంగీకారాన్ని వ్యక్తం చేయలేదని సమాచారం.

అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించవచ్చని చెబుతున్నారు. అయిదేళ్ల కాలం పాటు కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే వీలును కల్పించారని అంటున్నారు. శివసేన, ఎన్సీపీ మాత్రం అయిదేళ్ల ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని రెండుగా పంచుకోవాలని ప్రతిపాదించిందని తెలుస్తోంది.
సమానంగా మంత్రి పదవులు..
కాంగ్రెస్ పార్టీ కనీస ఉమ్మడి కార్యాచరణను ప్రతిపాదించిందని అంటున్నారు. ఇందులో పలు అంశాలను పొందుపరిచిందని తెలుస్తోంది. మంత్రివర్గ కూర్పు ఎలా ఉండాలనే అంశాన్ని ప్రధానంగా ఇందులో ఆ కార్యాచరణలో ప్రతిపాదించిందని అంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మంత్రివర్గంలో కూడా సమాన సంఖ్యలో ఎమ్మెల్యేలను తీసుకోవాల్సి ఉంటుందనే ప్రతిపాదనలు ఈ మూడు పార్టీల మధ్య చర్చకు రాగా, దీనిపై మూడు పార్టీలు ఓ అంగీకారానికి వచ్చాయని అంటున్నారు. కీలకమైనవిగా భావించే హోం, రెవెన్యూ, ఆర్థికం, మున్సిపల్ వంటి శాఖల్లో ఏ ఒక్క పార్టీకో చెందిన ఎమ్మెల్యేలకు కాకుండా.. సమానంగా పంచాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!