నీట్, జేఈఈ పరీక్షలపై ట్విస్ట్: ప్రధానికి లేఖ రాసిన విద్యావేత్తలు: కాలిఫోర్నియా వర్శిటీ నుంచీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుతం నీట్, జేఈఈ పరీక్షల నిర్వణ హాట్ టాపిక్‌గా మారింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల ప్రస్తుతం రాజకీయ పార్టీలు కూడా దీనిపైనే ఫోకస్ పెట్టాయి. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ బీజేపీయేతర రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఏ చిన్న పొరపాటు చోటు చేసుకున్నప్పటికీ.. విద్యార్థుల జీవితాలు ప్రమాదంలో పడతాయనే ఆందోళనలను వ్యక్తం చేస్తున్నాయి.

కేంద్రానికి అండగా.. విద్యావేత్తలు
ఈ పరిస్థితుల్లో పలువురు విద్యావేత్తలు రంగంలోకి దిగారు. కేంద్రప్రభుత్వానికి అండా నిలిచారు. నీట్, జేఈఈ పరీక్షలను సకాలంలో నిర్వహించాలని కోరుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను అడ్డుగా పెట్టుకుని, అత్యంత కీలకమైన ఈ పరీక్షలను వాయిదా వేయకూడదని సూచించారు. సకాలంలో, ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారమే ఈ పరీక్షలను నిర్వహించాలని విజ్ఙప్తి చేశారు. వందమందికి పైగా విద్యావేత్తలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కాలిఫోర్నియా యూనివర్శిటీ నుంచి కూడా ఇదేరకమైన విజ్ఙప్తి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

యూనివర్శిటీల ప్రొఫెసర్లు..
ఢిల్లీ యూనివర్శిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ, కేరళ సెంట్రల్ యూనివర్శిటీ, కాలిఫోర్నియా యూనివర్శిటీ వంటి అత్యున్నత విద్యాసంస్థలకు చెందిన పలువురు ప్రొఫెసర్లు, వైస్ ఛాన్సలర్లు ఈ లేఖను రాశారు. నీట్, జేఈఈ పరీక్షలను సకాలంలో నిర్వహించాలని ప్రధానిని సూచించారు. పరీక్షలను వాయిదా వేయడం వల్ల గానీ, మార్పులు చేయడం వల్ల గానీ ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు. ఇప్పుడీ పరీక్షలను నిర్వహించడం వల్ల విద్యా సంవత్సరాన్ని కాపాడినట్టవుతుందని అభిప్రాయపడ్దారు.

విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ వద్దు..
విద్యార్థుల భవిష్యత్తు గురించి, వారి క్యాలెండర్ గురించి తమకు సంపూర్ణ అవగాహన ఉందని, నీట్, జేఈఈ పరీక్షలను సకాలంలో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తుతో, వారు కన్న కలలను నిజం చేయడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దని ప్రధానికి సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారంటూ ఆరోపణలు చేస్తోన్న నాయకులు తమ సొంత రాజకీయం కనిపిస్తోందని చెప్పారు. 2020-2021 విద్యా సంవత్సరంలో జేఈఈ, నీట్ పరీక్షలు యధాతథంగా కొనసాగుతాయని తాము బలంగా విశ్వసిస్తున్నామని అన్నారు.

కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా..
ప్రధానికి లేఖలను రాసిన వారిలో ఇందిరాగాంధీ జాతీయ స్వార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సీబీ శర్మ, ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ ప్రకాశ్ సింగ్, మహాత్మాగాంధీ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జయప్రసాద్, కేరళ్ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఐనుల్ హసన్ వంటి వందమందికి పైగా విద్యావేత్తలు ఉన్నారు. కరోనా వైరస్ నిబంధనలకు అనుగుణంగా, కట్టుదిట్టంగా పరీక్షలను నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ పరీక్షలను నిర్వహించాలంటూ ఇదివరకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.

రాజకీయ ఒత్తిళ్లు వెల్లువెత్తిన వేళ..
జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలంటూ కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీ సహా పలువురు ముఖ్యమంత్రులు ప్రధానికి విజ్ఙప్తి చేసిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, జార్ఖండ్, కేరళ, ఒడిశా, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరీక్షల వాయిదా వేయాలంటూ కేంద్రానికి లేఖలు రాశారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఈ విజ్ఙప్తులు అందాయి. వాయిదా వేయించడంపై సోనియాగాంధీ స్వయంగా బరిలో దిగారు.