బీహార్: భారీ షాకిచ్చిన నితీశ్ కుమార్ - సీఎం పదవి కోరలేదు -అది బీజేపీ ఇష్టం -ప్రమాణం తేదీ తెలీదు
బీహార్ లో ఎన్నికల ఫలితాల్లో నెలకొన్న సస్పెన్సే ప్రభుత్వ ఏర్పాటులోనూ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్డీఏలో నిన్నటిదాకా జూనియర్ భాగస్వామిగా కొనసాగిన బీజేపీ ఇప్పుడు జేడీయూ కంటే దాదాపు రెట్టింపు సీట్లు సాధించడంలో ముఖ్యమంత్రి పదవిపై చర్చ తారాస్థాయికి చేరింది. సీట్లు తక్కువొచ్చినా, సీఎం నితీశ్ కుమారే అని ప్రధాని మోదీ నుంచి సాధారణ బీజేపీ నేతల వరకు కరాకండిగా చెబుతున్నారు. కానీ నితీశ్ వెర్షన్ మాత్రం మరోలా ఉంది..
బీహార్ షాక్: విజేతలుగా మోదీ-తేజస్వీ -సీఎం నితీశ్ భారీ మూల్యం -అద్వానీ 30ఏళ్ల కల నెరవేరేలా..

నితీశ్ సంచలన వ్యాఖ్యలు..
మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 125 సీట్లు సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. కూటమిలోని బీజేపీ 74, జేడీయూ 43, హెచ్ఏఎం 4, వీఐపీ 4 సీట్లు గెలుచుకున్నాయి. గట్టిపోటీ ఇచ్చిన మహాకూటమి 110 సీట్లకే పరిమితం అయిపోయింది. గెలుపుపై బీజేపీ పెద్ద ఎత్తున సంబురాలు చేసుకోగా, ఢిల్లీలో నిర్వహించిన విజయోత్సవ సభలో ప్రధాని మోదీ సైతం పాల్గొన్నారు. అయితే ఫలితాలు వెలువడిన రెండు రోజుల తర్వాతగానీ జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్ మీడియా ముందుకురాలేదు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు..
నర్సు కిరాతకం: సినీ ఫక్కీలో 8 మంది శిశువుల హత్య -మరో 10మందినీ -చీమకు కూడా హాని చేయదు

సీఎం పదవిని కోరలేదు..
ఇప్పటికే మూడు దఫాలు బీహార్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నితీశ్ కుమార్.. తాజా గెలుపుతో ఆ పదవికి ఏడోసారి ప్రమాణస్వీకారం చేయబోయే తేదీపై జేడీయూ నేతలు గత రెండు రోజులుగా ప్రకటనలు చేస్తున్నారు. దీపావళి తర్వాత చేస్తారని కొందరు, సోమవారమే సెర్మనీ ఉంటుందని ఇంకొందరు చెప్పారు. కాగా, ప్రమాణ స్వీకారం తేదీపై ప్రచారంలో ఉన్నవన్నీ ఊహాగానాలేనని నితీశ్ స్పష్టం చేశారు. అంతేకాదు.. ముఖ్యమంత్రి పదవిని తాను కోరలేదని కూడా ఆయన బాంబు పేల్చారు.

ముఖ్య పదవిపై మంతనాలు..
‘‘ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టంకట్టారు. వారి ఆదేశాన్ని శిరసావహిస్తూ మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అయితే, ముఖ్యమంత్రిగా నేనే ఉంటానని, ఉండాలని కోరుతున్నట్లుగానే నేనెప్పుడూ చెప్పలేదు. అది కూటమి నిర్ణయం. బీజేపీ, హెచ్ఏఎం, వీఐపీ, జేడీయూ పార్టీల ఎమ్మెల్యేలు శుక్రవారం సమావేశం అవుతారు. అందులో చర్చించిన తర్వాతే సీఎం ఎవరనేది ఒక అభిప్రాయానికి రావొచ్చు. అంతే తప్ప నేను సోమవారమే ప్రమాణం చేయబోతున్నానన్న వార్తలో వాస్తవం లేదు'' అని నితీశ్ పేర్కొన్నారు. అంతేకాదు..

అది బీజేపీ ఇష్టం..
బీహార్ ఎన్డీఏలో మొన్నటి దాకా సీనియర్ భాగస్వామిగా ఉన్న జేడీయూ ఇవాళ బీజేపీ కంటే తక్కువ సీట్లతో జూనియర్ స్థాయికి పడిపోవడానికి కారకురాలైన ఎల్జేపీ పార్టీ, దాని అధినేత చిరాగ్ పాశ్వాన్ ను ఉద్దేశించి నితీశ్ కుమార్ కీలక కామెంట్లు చేశారు. ఎల్జేపీ వల్లే జేడీయూ సీట్లు తగ్గాయని పరోక్షంగా అంగీకరించిన ఆయన.. మరి చిరాగ్ పాశ్వాన్ ను ఎన్డీఏలో ఉంచాలా? గెంటేయాలా? అనేది బీజేపీ ఇష్టమని, కమలనాథుల హైకమాండే ఎల్జేపీపై నిర్ణయం తీసుకోవాలని నితీశ్ అన్నారు. జేడీయూను దెబ్బ కొట్టేందుకు బీజేపీ కావాలనే ఎల్జేపీతో రెబల్ క్యాండేట్లను బరిలోకి దింపిందనే ఆరోపణల నేపథ్యంలో నితీశ్ కామెంట్లకు ప్రాధాన్యం ఏర్పడింది. నితీశ్ వెర్షన్ ఇలా ఉంటే, బీజేపీ నేతలు మాత్రం ఆయనే సీఎంగా కొనసాగుతారని చెబుతున్నారు. ప్రమాణస్వీకారంలోపు ఇది ఏమలుపు తిరుగుతుందో వేచి చూడాలి...