ఢిల్లీ అసెంబ్లీ: వయోవృద్ధులకు పోస్టల్ బ్యాలెట్స్: క్యూఆర్ కోడ్: ప్రతి పోలింగ్ కేంద్రం వద్దా ఓ లాకర్.
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని కేంద్ర ఎన్నికల కమిషన్ ఓ సరికొత్త ప్రయోగానికి తెర తీసింది. ఓటర్ల గైర్హాజరీ వ్యవస్థ (ఓటర్స్ ఆబ్సెంట్ సిస్టమ్-వీఓఎస్)ను ప్రవేశ పెట్టబోతోంది. ఈ విధానం కింద ప్రతి ఓటరు స్లిప్పుపైనా క్విక్ రెస్పా,న్స్ (క్యూఆర్) కోడ్ ను ముద్రించనున్నారు. దీనివల్ల ఏ ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారనే విషయం వెల్లడవుతుంది. ఓటర్ పేరు, అడ్రస్ సహా అన్ని వివరాలూ తెలుసుకునే వీలు ఉంటుంది. పోలింగ్ కేంద్రానికి రాలేని వారి కోసం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: ఫిబ్రవరి 8 పోలింగ్.. ఫిబ్రవరి 11న ఫలితాలు

ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల గైర్హాజరీ వ్యవస్థను ప్రవేశ పెట్టబోతున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడానికి సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. షెడ్యూల్ ను ప్రకటించిన తరువాత.. పలు అంశాలపై స్పందించారు. వందశాతం పోలింగ్ ను అందుకోవడానికి తీసుకున్న చర్యలపై వివరించారు.

80 ఏళ్లు దాటిన వారికి.. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం..
80 సంవత్సరాలకు పైబడిన వయస్సు గల ఓటర్లు, దివ్యాంగులు, ఇతరత్రా కారణాల వల్ల పోలింగ్ కేంద్రం వరకూ రాలేని వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేసినట్లు చెప్పారు. అన్ని అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఈ సారి కూడా వయోధిక వృద్ధులు, గర్భిణీలు, దివ్యాంగుల కోసం ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించామని అన్నారు. దీనికోసం ఆటోలు, మూడు చక్రాల వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. వాటిని వినియోగించుకోవాలని సునీల్ అరోరా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రానికి రాలేని వారి కోసం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు.
ప్రతి స్లిప్పుపైనా క్యూఆర్ కోడ్
కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం తరఫున ఢిల్లీ ఓటర్లకు అందజేసే ప్రతి ఒటరు స్లిప్పు పైనా క్యూఆర్ కోడ్ ను ముద్రించామని సునీల్ అరోరా వెల్లడించారు. ఈ తరహా విధానం దేశంలో ఎక్కడా లేదని చెప్పారు. ఈ సారి కొత్తగా దీన్ని అమల్లోకి తీసుకుని వస్తున్నామని చెప్పారు. ఓటర్ల హెల్ప్ లైన్ యాప్ కు దీన్ని అనుసంధానించామని, ఓటర్లు తమ స్లిప్పులను వెంట తెచ్చుకోలేకపోయినప్పటికీ.. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా వారి వివరాలను తెలుసుకునే అవకాశం ఉందని అన్నారు.
మొబైల్ ఫోన్లు తెచ్చుకోవచ్చు.. కానీ..
సాధారణంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు ఓటర్లు తమ వెంట మొబైల్ ఫోన్ ను వెంట తీసుకెళ్లడంపై నిషేధం ఉంది. ఈ సారి ఢిల్లీ ఎన్నికల్లో ఈ నిబంధనను సవరించినట్లు సునీల్ అరోరా పేర్కొన్నారు. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడానికి ఓటర్లు తమ వెంట మొబైల్ ఫోన్లను తెచ్చుకోవచ్చని, స్కాన్ పూర్తయిన తరువాత.. దాన్ని లాకర్ లో భద్రపరచుకోవాల్సి ఉంటుందని అన్నారు. దీనికోసం ప్రతి పోలింగ్ కేంద్రం వద్దా ఓ లాకర్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.