3వేలకు చేరువలో కరోనాకేసులు: కరోనా ఆందోళన నేపధ్యంలో ప్రధాని మోడీ కీలక సమావేశం
భారతదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా 2 వేలకు పైగా నమోదవుతున్న కరోనా కేసులు తాజాగా మూడు వేల చేరువకు చేరుకున్నాయి. తాజాగా నమోదైన 2,927 కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,65,496 కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, క్రియాశీల కేసుల సంఖ్య 16,279కి పెరిగింది.దేశంలో గత 24 గంటల్లో 32 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కోవిడ్ సంబంధిత మరణాల సంఖ్య 5,23,654 కు చేరుకుంది.

పెరుగుతున్న కరోనా కేసులతో ఆందోళన
మొత్తం నమోదైన కరోనా కేసులలో యాక్టివ్ కేసులు 0.04 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.75 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. యాక్టివ్ కోవిడ్-19 కేసులలో 24 గంటల వ్యవధిలో 643 కేసులు పెరిగాయి. మంగళవారం నాడు 5.05 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా దాదాపు మూడు వేల కొత్త కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ రేటు 0.58 శాతానికి పెరిగింది.

ఢిల్లీలో తాజాగా 1204 మందికి కరోనా
ఒక్క ఢిల్లీలోనే 1204 మందికి కరోనా మహమ్మారి సోకింది. హర్యానాలో 517 కరోనా కేసులు నమోదు కాగా, కేరళ, ఉత్తరప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల్లో కూడా కరోనా పంజా విసురుతున్న పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి బారినుండి 2252 మంది కోలుకున్నారు. ఇక ప్రస్తుత పరిస్థితి రికవరీ ల కంటే కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టుగా కనిపిస్తుంది. యాక్టివ్ కేసుల రేటు 0.04 శాతంగా ఉంది.

అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్
నిన్న ఒక్కరోజే 21.97 లక్షల మందికి వ్యాక్సినేషన్ నిర్వహించారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 188 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది. దేశంలో విస్తరిస్తున్న కోవిడ్ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నారు. ఈ సదస్సులో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ప్రజెంటేషన్ చేయనున్నారు. రాష్ట్రాలలో కరోనా పరిస్థితులు, తీసుకుంటున్న జాగ్రత్తలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

కరోనా కేసుల పెరుగుదల, అప్రమత్తత అవసరం
మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని కోవిడ్-సంబంధిత పరిస్థితులపై ప్రధాని మోదీ సీఎంలతో సంభాషించనున్నారు. అనేక పండుగలు వస్తున్నందున, కరోనావైరస్ నుండి వచ్చే ముప్పు పట్ల అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ధరించడం మరియు తరచుగా చేతులు కడుక్కోవడం వంటి కోవిడ్-సముచితమైన ప్రవర్తనను కొనసాగించాలని మోడీ ఆదివారం ప్రజలను కోరారు. ఏది ఏమైనా పెరుగుతున్న కరోనా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.