కర్ణాటక సరిహద్దుల్లో స్పెషల్ చెక్‌పోస్టులు- 4 జిల్లాల్లో హైఅలర్ట్..!!
బెంగళూరు: కేరళలో ప్రాణాంతక నిఫా వైరస్ తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికే రెండు మరణాలు సైతం నమోదయ్యాయి. కిందటి నెల 30, ఈ నెల 11వ తేదీల్లో కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ బారినపడి ఇద్దరు మరణించారు. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ వైరస్ మరింత విస్తరించకుండా కేరళ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
మృతులు నివసిస్తోన్న ప్రదేశాల నుంచి అయిదు చదరపు కిలోమీటర్ల దూరం వరకు ఉన్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించింది. కోజికోడ్ జిల్లాలో రెండు రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించిందంటే అక్కడి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటికే కేరళకు చేరుకున్న కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్ర బృందం కోజికోడ్ జిల్లాలో పర్యటించనుంది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి, నిమ్హాన్స్ నిపుణులతో కూడిన అయిదుమంది సభ్యుల బృందం పరిస్థితిని అంచనా వేయనుంది.
నిఫా వైరస్ కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కేరళతో సరిహద్దులను పంచుకుంటోన్న కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది. కేరళ-కర్ణాటక సరిహద్దుల్లో ప్రత్యేేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. అడ్వైజరీనీ జారీ చేసింది. కేరళలో నిఫా వైరస్ వ్యాప్తి చెందిన ప్రదేశాలకు వెళ్లొద్దంటూ విజ్ఞప్తి చేసింది.
కేరళతో సరిహద్దులను పంచుకుంటోన్న దక్షిణ కన్నడ, చామరాజనగర, కొడగు, మైసూరు జిల్లాల్లో హైఅలర్ట్‌ను ప్రకటించింది. ఆయా జిల్లాల్లోని చెక్ పోస్టుల మీదుగా రాకపోకలను సాగించే వారికి తప్పనిసరిగా వైద్య పరీక్షలను నిర్వహించాలని ఆదేశించింది. నిఫా వైరస్ ట్రీట్‌మెంట్‌పై ఈ నాలుగు జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇస్తోంది.
నిఫా వైరస్ బాధితుల కోసం జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను సైతం ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది కర్ణాటక ప్రభుత్వం. కనీసం రెండు నుంచి నాలుగు పడకలను దీనికోసం కేటాయించాలంటూ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కర్ణాటకలో నిఫా వైరస్ విస్తరించకుండా ఉండటానికి అన్ని ముందుజాగ్రత్తలను తీసుకున్నామని వివరించింది.












Click it and Unblock the Notifications