ఉత్కంఠగా నిర్భయ కేసు: ఉరిశిక్షపై స్టేకునిరాకరించిన పాటియాల కోర్టు: మరోసారి విచారణ, తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీతపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో మరణశిక్ష అమలుపై స్టే ఇచ్చేందుకు సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత మరికొద్దిసేపటికే ఇదే అంశంపై కోర్టు మరోసారి విచారణ చేపట్టి తీర్పును రిజర్వులో పెట్టింది.
Nirbhaya case: కోర్టులో కన్నీటిపర్యంతమైన నిర్భయ తల్లి, న్యాయమూర్తి ఏం చెప్పారంటే..?

ఉరిపై స్టేకు నిరాకరణ..
ఉరిశిక్షపై తాను మరోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నానని, అందువల్ల డెత్ వారెంట్‌పై ఇవ్వాలని కోరుతూ దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన పాటియాలా హౌస్ కోర్టు అక్షయ్ అభ్యర్థనను తిరస్కరించింది. మార్చి 3న అమలుకానున్న ఉరిశిక్షపై తాము స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది.

రాష్ట్రపతికి నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్..
అయితే, ఇదే సమయంలో మరో దోషి పవన్ గుప్తా కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఉరిశిక్ష అమలుకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో పవన్ గతవారం సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయగా.. సోమవారం విచారించిన న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో అతడు రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని దోషి తరపు న్యాయవాది ఏపీ సింగ్ ఢిల్లీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

నిర్భయ దోషి తరపు లాయర్‌పై కోర్టు ఆగ్రహం
క్షమాభిక్ష అభ్యర్థన రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని పవన్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై ఢిల్లీ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకోవడానికి ఎందుకు ఆలస్యం చేశారని పవన్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఒక వ్యక్తి చేసే తప్పుడు చర్య వల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయో మీకు తెలియదా? అంటూ నిలదీసింది. కాగా, వాదనల అనంతరం పవన్ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది.

రేపు నిర్భయ దోషులకు ఉరిపడేనా?
ఈ నేపథ్యంలో నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై మరోసారి ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పవన్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థన కేంద్ర హోంశాఖకు చేరింది. దీన్ని హోంశాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు నిర్భయ దోషుల క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించిన రాష్ట్రపతి.. ఈ పిటిషన్ కూడా తిరస్కరించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలన్నీ సోమవారం రోజే ముగిస్తే.. మంగళవారం ఉదయం నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే మరింత సమయం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.