• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నితిన్ గడ్కరీ: స్కానియా లగ్జరీ బస్ విషయంలో కేంద్ర మంత్రి మీద అవినీతి ఆరోపణలు ఎందుకొస్తున్నాయి?

By BBC News తెలుగు
|

స్కానియా బస్సు అందిన కంపెనీకి, తన కొడుకులకు సంబంధం ఉందని వస్తున్న ఆరోపణలను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు.

స్వీడన్‌కు చెందిన స్కానియా కంపెనీ 2016లో ఈ స్పెషల్ లగ్జరీ బస్సును భారత్‌లోని ఒక సంస్థకు ఇచ్చింది.

దీనిపై గడ్కరీ కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది. ఈ ఆరోపణలు దురదృష్టకరం, కల్పితం, నిరాధారమని పేర్కొంది. ఆ బస్సు కోసం డబ్బు చెల్లించలేదని, దానిని నితిన్ గడ్కరీ కూతురి పెళ్లిలో ఉపయోగించారని వస్తున్న వాదనలను మీడియా ఊహాగానాలుగా చెప్పారు.

nitin

"ఈ మొత్తం స్కానియా బస్సు కేసు స్వీడన్‌లోని ఆ కంపెనీ అంతర్గత విషయం. అందుకే స్కానియా ఇండియా అధికారిక ప్రకటన వచ్చేవరకూ మీడియా వేచిచూడడం మంచిది" అని కూడా గడ్కరీ కార్యాలయం చెప్పింది.

బస్సు కొనుగోలు లేదా అమ్మకంతో గానీ, దానికి సంబంధించిన వ్యక్తులతో గానీ నితిన్ గడ్కరీకి, ఆయన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఆ ప్రకటనలో చెప్పారు.

భారత్‌లో హరిత ప్రజా రవాణాను తీసుకురావాలనే తన పథకంలో భాగంగా నితిన్ గడ్కరీ నాగపూర్‌లో ఇథనాల్‌తో నడిచే స్కానియా బస్సులను ప్రారంభించడానికి అనుకూలంగా ఉన్నారని అందులో చెప్పారు.

ఒక పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించేలా ఆయన నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ప్రోత్సహించారు. దాంతో నాగపూర్ మున్సిపాలిటీలు స్వీడిష్ కంపెనీతో ఒక వాణిజ్య ఒప్పందం చేసుకున్నాయి. ఆ తర్వాత స్కానియా ఇథనాల్‌ బస్సులు నాగపూర్‌లో నడిచాయి. కానీ, ఈ ఒప్పందం పూర్తిగా నాగపూర్ మున్సిపాలిటీలు, స్వీడన్‌లోని ఆ బస్ తయారీ కంపెనీ మధ్యే జరిగిందని ప్రకటనలో తెలిపారు.

అసలు కేసేంటి?

భారత్‌లో నిర్వహించిన తమ లావాదేవీలకు సంబంధించి ఒక అంతర్గత దర్యాప్తులో, తమ సంస్థలోని సీనియర్ మేనేజ్‌మెంట్ సహా ఉద్యోగులు దుర్వినియోగానికి పాల్పడ్డారనడానికి ఆధారాలు లభించాయని, అందులో ప్రమేయం ఉన్న అందరూ కంపెనీని వదిలేశారని స్కానియా అనే స్వీడన్ బస్, ట్రక్ తయారీ సంస్థ చెప్పింది.

స్కానియా 2013 నుంచి 2016 మధ్య భారత్‌లోని 7 రాష్ట్రాల్లో బస్సు కాంట్రాక్టులు పొందడానికి లంచాలు ఇచ్చినట్లు స్వీడన్ మీడియా చానల్ ఎస్‌వీటీ సహా మూడు మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి.

స్కానియా ఒక స్పెషల్ లగ్జరీ బస్సును భారత్‌లోని ఒక కంపెనీకి ఇచ్చిందని, ఆ కంపెనీకి భారత రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి సంబంధం ఉందని కూడా ఎస్‌వీటీ చెప్పింది. ఈ బస్సును గడ్కరీ కూతురి పెళ్లికి ఇచ్చారని, దానికి పూర్తిగా చెల్లింపులు కూడా జరపలేదని తెలిపింది.

ఆ స్పెషల్ బస్సును స్కానియా డీలర్ల ద్వారా విక్రయించింది. వారు దానిని ఒక ఏసీ కంపెనీకి అమ్మడమో లేదంటే లీజుకో ఇచ్చారు. ఆ కంపెనీతో గడ్కరీ కొడుకులకు సంబంధాలు ఉన్నాయి అని పేర్కొంది.

స్వీడన్ న్యూస్ చానల్ ఎస్‌వీటీ, జర్మన్ బ్రాడ్‌కాస్టర్ జడ్‌డీఎఫ్, భారత్‌లోని కాన్‌ఫ్లుయెన్స్ మీడియా పరిశోధన ఆధారంగా ఈ వాదనలు వచ్చాయి.

ఈ కేసులో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలకు చెందిన భారత అధికారులకు మొత్తం 19 ఒప్పందాల్లో 65 వేల యూరోలు లంచం ఇచ్చారని బ్లూంబర్గ్ చెప్పింది.

పబ్లిక్ సెక్టార్‌లోని బొగ్గు తవ్వకాల కంపెనీకి అమ్మడానికి వంద ట్రక్కులకు సంబంధించి వాహన దస్తావేజులు, రిజిస్ట్రేషన్ పత్రాలను స్కానియా సంస్థ తారుమారు చేసిందని ఒక అంతర్గత విచారణను ఉటంకిస్తూ జడ్‌డీఎఫ్ ఆరోపించింది.

ఎస్‌వీటీ కథనాల ప్రకారం ట్రక్కులపై చాసిస్ నంబర్, లైసెన్స్ ప్లేట్లు మార్చి స్కానియా కంపెనీ మోసం చేసింది.

మరోవైపు, తమ కంపెనీ 2017లో అంతర్గత దర్యాప్తు ప్రారంభించిందని, ఈ మొత్తం కేసులో లంచం, వ్యాపార భాగస్వాముల ద్వారా లంచం, తప్పుడు ప్రకటనలు ఇవ్వడం లాంటివి ఉన్నాయని స్కానియా ప్రతినిధి రాయిటర్‌తో చెప్పారు.

నాగపూర్ గ్రీన్ బస్ ప్రాజెక్ట్ ఏంటి?

మున్సిపాలిటీల్లో ఇథనాల్‌తో నడిచే బస్సులను తిప్పడానికి నాగపూర్ గ్రీన్ బస్ ప్రాజెక్ట్ రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ కింద అన్ని సిటీ బస్సులను జీవ ఇంధనంతోనే నడపాలి.

బెల్లంతోనే కాకుండా, వరి, గోధుమ గడ్డి, వెదురుతో కూడా ఇథనాల్ తయారు చేసేలా ఇలాంటి పథకాన్ని తీసుకొస్తున్నట్లు 2016లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించిన సమయంలో నితిన్ గడ్కరీ అన్నారు.

ఈ ప్రాజెక్ట్ కింద నడపడానికి స్వీడన్ కంపెనీ స్కానియా ఇథనాల్‌తో నడిచే 55 బస్సులు సిద్ధం చేసింది. కానీ 2018లో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. నాగపూర్ మునిసిపల్ కార్పొరేషన్ నుంచి 25 గ్రీన్ బస్సుల బకాయిలు రాకపోవడంతో దీనిని ఆపేస్తున్నట్లు స్కానియా చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Nitin Gadkari: Why are allegations of corruption leveled against the Union Minister in the Scania luxury bus case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X