మోడీ పిలుపు: జమిలి ఎన్నికలకు నితీష్ మద్దతు, కానీ
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలకు జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మద్దతు ప్రకటించారు. బుధవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అనంతరం జమిలి ఎన్నికలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు.
అన్ని రాష్ట్రాలతో చర్చించి ఏకాభిప్రాయం తీసుకురావాలని కోరారు. ఇది ఇప్పటికిప్పుడే సాధ్యమవుతుందని తాను అనుకోవడంలేదన్నారు. మెల్లమెల్లగా రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించారు. తమ రాష్ట్రంలో అయితే ఇప్పుడు జమిలి ఎన్నికలు సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

లోక్‌సభ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణకు ఏకాభిప్రాయం తీసుకురావాలని కోరుతూ కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా సోమవారం పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అదేరోజు నిర్వహించిన సమావేశంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు జమిలి ఎన్నికలపై అభిప్రాయం చెప్పాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ జమిలి ఎన్నికలకు సానుకూలంగా ఉన్నట్లు ప్రకటించింది. కాగా, ఏపీ మాత్రం ఇంకా తన అభిప్రాయాన్ని చెప్పలేదు.












Click it and Unblock the Notifications