• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తేజస్వి మెడపై కత్తి: సంక్షోభంలో నితీష్ సర్కార్

By Swetha Basvababu
|

పాట్నా/న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఐక్యతా బాటలో పయనింపజేయడంలో ముందు వరుసలో నిలిచిన రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌పై సమస్యలు ముప్పేట దాడిచేస్తున్నాయి.

అక్రమాస్తుల కేసులో కూతురు మీసా భారతిని ఆదాయం పన్నుశాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడుల పరంపర సాగిస్తుంటే.. లాలూ రైల్వే మంత్రిగా హోటళ్ల నిర్వహణ బాధ్యతల అప్పగింతల కేసులో ఆయన తనయుడు - డిప్యూటీ సీఎం తేజస్వి ప్రసాద్ యాదవ్ పేరు చేర్చడంతో ఆయన పదవికి గండం ఏర్పడింది. నాలుగు రోజుల్లో తేల్చాలని మిత్రపక్షం యునైటెడ్ జనతాదళ్ (జేడీయూ) ఆల్టిమేటం జారీ చేసింది.

కానీ తాను మంత్రిగా తప్పు చేయనందున వైదొలగాల్సిందేమీ లేదని తేజస్వి యాదవ్ కూడా గట్టిగానే ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కూడా తన కుమారుడు రాజీనామా చేయాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పేశారు. అన్నింటికీ తానే బాద్యుడినని స్పష్టం చేశారు. అదే సమయంలో బీజేపీకి తల వంచే ప్రసక్తే లేదని ఆయన చెప్తున్నా.. వెంటాడుతున్న అవినీతి ఆరోపణల నుంచి బయట పడితే తప్ప.. ప్రజలు నమ్మటం కష్టతరమైన పని అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

నిజాయితీ పరుడినని చెప్పుకునే నితీశ్ కుమార్.. తేజస్వి ప్రసాద్ యాదవ్‌ను తప్పిస్తారా? లేదా? తేల్చుకోవాలని బీజేపీ పట్టుబట్టింది. ఒకవేళ ఆర్జేడీ మద్దతు ఉపసంహరించుకుంటే మళ్లీ నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అంశంపై మాత్రం బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ మాట దాట వేశారు. పరిస్థితులను బట్టి కేంద్రంలోని బీజేపీ పార్లమెంటరీ బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. కొంతకాలం మద్దతునిస్తే లబ్ది చేకూరుతుందని భావిస్తే బీజేపీ మద్దతు ఇవ్వవచ్చు.. లేదంటే తక్షణం ప్రభుత్వాన్ని రద్దుచేసి కొంతకాలం గవర్నర్ పాలన పెట్టడానికి అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఆర్జేడీని వెంటాడుతున్న అవినీతి కేసులు

ఆర్జేడీని వెంటాడుతున్న అవినీతి కేసులు

తొలిసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చిక్కుకున్న ‘పశుగ్రాసం' కేసు పుణ్యమా? అని.. మరోవైపు లాలూ ప్రసాద్ పట్ల వ్యతిరేకత కారణంగా లోహియా వాదుల్లోని ఆయన వ్యతిరేకులతో కలిసి బీహార్‌లో క్రమక్రమంగా ప్రధాన ప్రతిపక్షం స్థాయికి చేరుకున్నది బీజేపీ. తొలుత సమతా పార్టీగా.. తర్వాత జేడీయూగా మారిన తర్వాత బీహార్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నితీశ్ కుమార్.. అధికారానికి దగ్గర కావడానికి కమలనాథులు తమదైన శైలిలో ఇతోధిక సాయం అందించారు. కానీ జాతీయ రాజకీయాలపై ప్రత్యేకించి ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకున్న ఈ బీహారీ నేతకు.. 2013లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీని ప్రకటించడం ఇష్టం లేకపోయింది. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి విడిగా పోటీ చేశారు. కానీ మోదీ ప్రభంజనానికి తోడు విపక్షాలు విడిపోవడం.. రాం విలాస్ పాశ్వాన్‌తోపాటు కుశ్వాహాల మద్దతుతో బీహార్‌లో అత్యధిక స్థానాలు బీజేపీ ఖాతాలో పడిన తర్వాత గానీ నితీశ్ కుమార్‌కు తత్వం బోధపడలేదు. లోక్ సభ ఎన్నికలు పూర్తయిన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్.. జీతన్ రాం మాంఝీని సీఎంగా చేశారు. ఆర్జేడీతో చేతులు కలిపారు.

తీరు మారిన నితీశ్ కుమార్

తీరు మారిన నితీశ్ కుమార్

అధికారానికి దగ్గరైన బీజేపీకి.. దాని టేస్ట్ తెలిసిన తర్వాత జీతన్ రాం మాంఝీకి దగ్గరకు తీయడంతో ఆయన చెలరేగిపోయారు. ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేశారు. జేడీయూ ఉనికే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితుల్లో తిరిగి సీఎంగా నితీశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో తిరిగి విజయం సాధించారు నితీశ్. అవినీతి కేసు వల్ల సీఎంగా బాధ్యతలు స్వీకరించడానికి వీల్లేని లాలూ ప్రసాద్ యాదవ్.. సీఎంగా నితీశ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఒప్పుకునేలా చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. కానీ ఎన్నికల్లో విజయం సాధించి క్యాబినెట్‌లో తేజస్వి యాదవ్‌కు డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించిన నితీశ్ కుమార్ ప్లేట్ ఫిరాయించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీకి, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు మద్దతు ఇవ్వడంతో నితీశ్ మళ్లీ పాత గూటికి చేరతారా? అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

రైల్వే మంత్రిగా లాలూ హయాంపై కూపీ

రైల్వే మంత్రిగా లాలూ హయాంపై కూపీ

ఎంతో కాలంగా అన్నివైపులా జాగ్రత్తగా అధ్యయనం చేసి మరీ లాలూ వ్యవహారాలపై కూపీ లాగారు. తొలుత లాలూ కూతురు, రాజ్యసభ సభ్యురాలు మీసా భారతి, ఆమె భర్త శైలేంద్ర‌కుమార్ సంయుక్తంగా బినామీ పేర్లపై చేసిన ఆస్తుల కొనుగోళ్లపై ఆరా తీశారు. తర్వాత యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ పనిచేసినప్పటి లావాదేవీల వివరాలు బయటకు తీశారు. అస్త్రాలు దొరకగానే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయంపన్ను శాఖ (ఐటీ) అధికారులను ప్రయోగించారు. తొలుత లాలూ కూతురు మీసా భారతి ఇళ్లపై ఆదాయం పన్నుశాఖ అధికారులు దాడులు చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.. ఆదేశాలు పాటించకపోవడంతో ఆస్తులు జప్తు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె, ఆమె భర్త హాజరయ్యారు. తర్వాత చిన్నగా రైల్వేశాఖ ఆధ్వర్యంలో హోటళ్ల కేటాయింపుల్లో అవినీతి జరిగిందంటూ కేసు నమోదు చేసి లాలూ కుటుంబ సభ్యుల ఇళ్లపై సీబీఐ దాడులు చేసింది. ఈ కేసులో లాలూ తనయుడు - బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి ప్రసాద్ యాదవ్ పేరు చేర్చింది. దీంతో కమలనాథులు స్వరం పెంచారు.. తేజస్వి రాజీనామా చేయాలని పట్టుబట్టారు.

నిజాయితీ నిరూపించుకోవాలని తేజస్వికి జేడీయూ ఝలక్

నిజాయితీ నిరూపించుకోవాలని తేజస్వికి జేడీయూ ఝలక్

కానీ ఆర్జేడీ చీఫ్ లాలూ మాత్రం ఈ కేసులో తన భార్య రబ్రీదేవికి, ఆ హోటల్ లావాదేవీలు జరిగే నాటికి మైనర్‌గా ఉన్న తేజస్వి యాదవ్ కు సంబంధం లేదు పొమ్మన్నారు.. అన్నింటా తమకు కంట్లో నలుసుగా మారిన లాలూను బీజేపీ.. కమలనాథులు వదుల్తారా? మరి.. నితీశ్ కుమార్ నిజాయితీని సవాల్ చేశారు. ఇక జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. నేరుగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడానికి వెనుకాడని నితీశ్.. లాలూ కుటుంబంపై మాత్రం జాగ్రత్తగా ముందుకెళుతున్నారు. అందులో భాగంగానే బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి ప్రసాద్ యాదవ్ నిజాయితీ నిరూపించుకోవాలని అధికార జేడీయూ కోరింది. అవినీతి ఆరోపణలపై వాస్తవాలతో ప్రజల ముందుకు రావాలని కోరింది.

తేజస్వికి ఇలా జేడీయూ ఆల్టిమేటం

తేజస్వికి ఇలా జేడీయూ ఆల్టిమేటం

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో విభేదాలు విస్తృతమయ్యాయన్న వార్తల నేపథ్యంలో మంగళవారం జేడీయూ నేతలతో బీహార్ సీఎం నితీశ్ కుమార్ సమావేశమయ్యారు. తేజస్వి రాజీనామా చేయరని లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ప్రకటనపై నితీశ్ అసంత్రుప్తిగా ఉన్నారన్న వార్తలు వచ్చాయి. అయితే తేజస్వి రాజీనామాపై నేరుగా జేడీయూ నేతలు స్పందించలేదు. సమావేశం తర్వాత నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ ‘మీపై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా వాస్తవాలను బయటపెట్టండి' అని తేజస్విని ఉద్దేశించి అన్నారు. ఇప్పుడు బంతి ఆర్జేడీ కోర్టులో ఉంది అని అన్నారు.

తేజస్వి రాజీనామా ఎందుకన్న ఆర్జేడీ

తేజస్వి రాజీనామా ఎందుకన్న ఆర్జేడీ

కానీ ఆర్జేడీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్ర పుర్బే మీడియాతో మాట్లాడుతూ తేజస్వి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. డిప్యూటీ సీఎంగా, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ప్రశంసలు అందుకున్న తేజస్వి రాజీనామా చేయాల్సిన అవసరమేమిటని నిలదీశారు. ఆర్జేడీ ఎలా స్పందిస్తుందన్న విషయమై వేచి చూస్తామని బీజేపీ సీనియర్ నేత సుశీల్‌కుమార్ మోదీ మీడియాతో అన్నారు. మరో మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ నేత - రాష్ట్ర మంత్రి అశోక్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ సంచలనాల కోసం మీడియా హడావుడి ఎక్కువైందన్నారు. అయితే నితీశ్ కుమార్ ఇటు విపక్షాలతోనూ, అటు ఎన్డీయేతోనూ సత్సంబంధాలు కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా హవాలా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు, ఎంపీ మీసా భారతిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం ఎనిమిది గంటల పాటు ప్రశ్నించింది.

English summary
JD(U) chief and Bihar Chief Minister Nitish Kumar told party MLAs that the RJD has to take a call on Tejashwi Yadav's resignation from the post of Bihar deputy chief minister. The Janata Dal (United) and its leader Nitish Kumar have given ally Rashtriya Janata Dal (RJD) an ultimatum of four days to decide on Tejashwi Yadav. Bihar Chief Minister Nitish Kumar had called a meeting of JD(U) MPs, MLAs and other office-bearers of the party today to discuss the CBI raids on ally and RJD chief Lalu Prasad and his family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X