వాహనదారుల కోసం కేంద్రం కొత్త రూల్ .. వాహనచట్టంలో మార్పుకు రెడీ ..ఇదో గుడ్ న్యూస్
మోటారు వాహనాల యాజమాన్యాన్ని బదిలీ చేసే ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ వాహనదారుల కోసం మరో కొత్త రూల్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది . తీసుకున్న వాహనానికి రిజిస్ట్రేషన్ సమయంలో వాహన యజమాని తో పాటు నామిని పేరును కూడా నామినేట్ చేయడానికి వాహన యజమాని బదిలీ ప్రక్రియ ను సులభతరం చేయడానికి సెంట్రల్ మోటారు వాహన నిబంధనలను 1989ని సవరించాలని ప్రతిపాదించింది.

దీనికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను రవాణా మంత్రిత్వ శాఖ ప్రచురించింది.
వాహన రిజిస్ట్రేషన్ లో నామినీ పేరును చేర్చే ఆలోచన
వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో నామినేషన్ సదుపాయాన్ని చేర్చాలని ప్రతిపాదించింది. అయితే ఆన్‌లైన్ దరఖాస్తు ద్వారా నామినీ పేరును కూడా చేర్చవచ్చునని పేర్కొంది . ఇది మోటారు వాహనాన్ని వాహనం యొక్క యజమాని మరణించిన సందర్భంలో, నామినీ పేరిట నమోదుకు , లేదా బదిలీ చేయడానికి సహాయపడుతుందని తెలుస్తుంది .
యాజమాన్యాన్ని బదిలీ చేసే విధానం సరిగా లేకపోవటం , దేశవ్యాప్తంగా ఒకేవిధంగా ఉండకపోవటంతో కార్యాలయాలకు వాహనదారులు తరచు తిరగాల్సిన పరిస్థితి వస్తోంది.

వాహన యజమాని మరణం తర్వాత బదిలీకి సులభప్రక్రియ కోసమే
ఈ క్రమంలో మోటారు వాహనం యొక్క నామినీ , వాహన యజమాని మరణం విషయంలో వాహనం యొక్క చట్టపరమైన వారసుడిగా మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఈ విధానానికి స్వస్తి చెబుతూ నామిని ఇప్పటికే పేర్కొంటే, ఆటోమేటిక్ గా నామిని పేరు మీదకి వాహనం రిజిస్ట్రేషన్ బదిలీ చేయబడుతుంది. అయితే నామిని రిజిస్ట్రేషన్ కోసం డెత్ సర్టిఫికెట్ ను పోర్టల్ లో అప్ లోడ్ చేసి, తన పేరు మీదకు మార్చుకునేందుకు నామిని దరఖాస్తు చేసుకోవాలి.

వాహనదారులకు గుడ్ న్యూస్ ... ఒకే కుటుంబంలో రిజిస్ట్రేషన్ బదిలీ కోసం తిరిగే పని లేదు
వాహనం తీసుకున్న సమయంలో యజమాని నామిని పేరు చేర్చకుంటే ఆ తరువాత ఆన్లైన్ ద్వారా కూడా నామిని పేరును చేర్చుకునే వెసులుబాటు కల్పించే విధంగా మార్పులు తీసుకురానుంది కేంద్ర సర్కార్.
అందుకోసం మోటార్ వాహన చట్టం 1989 ని సవరించనుంది. ప్రతిపాదిత సవరణలపై ప్రజల నుండి సలహాలు , సూచనలను కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆహ్వానించింది.
ఏది ఏమైనా ఇది వాహనదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి . చాలా మంది వాహనదారులు తమ వారి పేరు మీద ఉన్న వాహన రిజిస్ట్రేషన్ మార్చుకోవటం కోసం నానా తిప్పలు పడాల్సి వస్తుంది. ఇక ఆ ఇబ్బందులకు కేంద్రం తాజా ప్రతిపాదన చెక్ పెట్టనుంది .