ప్రభుత్వాన్ని పడగొట్టాలా? ఇట్రెస్ లేదు.. దానంతటదే కుప్పకూలుతుంది..
మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల నేతృత్వంలోని మహా వికాస్ ఆగాధి(ఎంవీఏ) కూటమి ప్రభుత్వాన్ని కూలదోసేసే ఆసక్తిగానీ, అలాంటి అవసరంగానీ భారతీయ జనతాపార్టీకి లేదని ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రం జోక్యంతో ఉద్ధవ్ సర్కారును కూల్చేస్తారంటూ వస్తోన్న వార్తలను ఖండించారు.
వాళ్లే తన్నుకుంటారు...
''ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని మహా వికాస్ ఆగాధి ప్రభుత్వాన్ని కూల్చేయాలనే ఇంట్రెస్ట్ మాకు లేనేలేదు. ఇంకా కొద్ది రోజులు ఆగితే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గొడవలు ముదిరిపాకానపడతాయి. అప్పుడు బీజేపీ ప్రమేయం లేకుండానే కూటమి సర్కారు దానంతటదే కూలిపోతుంది. అప్పటిదాకా మేం ఎలాంటి ప్రయత్నాలు చేయబోము''అని ఫడ్నవిస్ చెప్పారు.

ఏప్రిల్ 15 నుంచి రుణ మాఫీ పథకం
కూటమి ప్రభుత్వం కామన్ మినిమమ్ ప్రోగ్రాం(సీఎంపీ)లో ప్రధానాంశమైన రైతులకు రుణమాఫీ పథకంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే శుక్రవారం ప్రకటన చేశారు. జ్యోతిరావు పూలే పేరుతో రూపొందించిన రుణమాఫీ పథకం ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వస్తుందని సీఎం చెప్పారు. జిల్లాల వారీగా అర్హులైన రైతుల పేర్ల నమోదు ప్రక్రియ 90 శాతం పూర్తయిందని, ఇప్పటిదాకా 32 లక్షల మంది రైతులు అర్హులుగా తేలారని, జాబితా పూర్తయ్యేనాటికి సంఖ్య పెరుగుతుందని సీఎం చెప్పారు. రైతు రుణమాఫీ పథకానికి నిధుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును పక్కనపెట్టేసిన సంగతి తెలిసిందే.