అందరూ హిందువులు కారు.. ఆరెస్సెస్ చీఫ్ కు అథవాలే కౌంటర్
ఇండియాలో మతాచారాలు వేరైనా అందరూ భరతమాట బిడ్డలేనని, 130 కోట్ల మంది హిందువులేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన కామెంట్లను కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తప్పుపట్టారు. ''అందరూ హిందువులే అనడం ఏమాత్రం సరికాదు. ఒకానొక సమయంలో మన దేశంలో అందరూ బౌద్ధులుగానే ఉండేవాళ్లు. హిందూయిజం రాక తర్వాతే దీన్ని హిందూ దేశంగా పిలుస్తున్నారు''అని అథవాలే చెప్పారు.
అలా చెప్పి ఉంటే బాగుండేది..
ఇండియాలో ఉన్నోళ్లందరూ హిందువులే అనేకంటే.. అందరూ మనవాళ్లేనని మోహన్ భాగవత్ అని ఉంటే బాగుండేదని అథవాలే అభిప్రాయపడ్డారు. గురువారం హైదరాబాద్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ మీటింగ్ లో భగవత్ మాట్లాడుతూ.. సంఘ్ ను కొంత మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, అలాంటివాళ్లే తమ స్వార్థం కోసం ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

ఎన్డీఏలోనే ఉంటూ..
మహారాష్ట్రలో అంబేద్కరైట్ లీడర్ గా ఎదిగిన రాందాస్ అథవాలే.. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్ పీఐ)ని స్థాపించారు. 2014 నుంచి ఎన్డీఏలో కొనసాగుతున్నా.. కొన్ని కీలక అంశాల్లో బీజేపీని విభేదిస్తూ వచ్చారు. జాతీయ క్రికెట్ జట్టులో రిజర్వేషన్ అమలు చేయాలన్న అథవాలే ప్రతిపాదన అప్పట్లో సంచలనం రేపింది.