కంగనా రనౌత్..కేక: ప్రభుత్వాన్ని ఢీ కొట్టి గెలిచింది: పరిహారం కూడా: బోంబే హైకోర్టు తీర్పు
ముంబై: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్‌కు చెందిన ముంబైలోని కార్యాలయం మణికర్ణిక ఫిల్మ్స్ భవనం కూల్చివేత వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఈ వ్యవహారంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని తేలింది. భవనం కూల్చివేతకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కంగనా రనౌత్‌కు అనుకూలంగా తీర్పు వెలువడింది. ఆమె పట్ల బీఎంసీ అధికారులు కక్షపూరితంగా వ్యవహరించారని, చట్టాల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారని బోంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తన తుది తీర్పును వినిపించింది.
కంగనా రనౌత్‌కు సెకెండ్ షాక్: ఈ సారి రాకపోతే.. అరెస్ట్ తప్పనట్టే: చెల్లెలికి కూడా

కక్షసాధింపు చర్యగా..
ముంబై మహానగరం.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌గా తయారైందంటూ ఇదివరకు కంగనా రనౌత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ముంబై పట్ల ఆమె చేసిన వ్యాఖ్యలను అధికార శివసేన సారథ్యంలోని మహా వికాస్ అగాఢీ నేతలు తీవ్రంగా పరిగణించారు. ప్రత్యేకించి- శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. క్షమాపణలు చెబితే గానీ ఆమెను ముంబైలోకి అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరించారు. ఆ తరువాత పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంజయ్ రౌత్‌ను కూడా కంగనా రనౌత్ లెక్క చేయలేదు. ఆయన కూడా తనలాగే నాన్ ముంబైకర్ అంటూ ఎద్దేవా చేశారు.

మణికర్ణిక కూల్చివేత..
ఈ వ్యాఖ్యల అనంతరం.. బీఎంసీ అధికారులు కంగనా రనౌత్‌కు చెందిన పాలీ హిల్‌లోని మణికర్ణిక కార్యాలయ భవనానికి నోటీసులను జారీ చేయడం, ఆ వెంటనే దాన్ని కూల్చివేయడం వంటి పనులు చకచకా సాగిపోయాయి. తమకు అందజేసిన భవనం డిజైన్‌కు వ్యతిరేకంగా నిర్మించారనే కారణంతో కొంతమేర పడగొట్టారు. కూల్చివేత కొనసాగుతోన్న సమయంలోనే ఆమె బోంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం న్యాయస్థానానికి చేరడంతో మణికర్ణక భవనం కూల్చివేత పనులకు బ్రేక్ పడింది.

బీఎంసీ అధికారుల వాదనేంటీ?
సెప్టెంబర్ 9వ తేదీన కంగనా తరఫు న్యాయవాది బోంబే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. పలు దఫాలుగా విచారణ కొనసాగింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 354 (ఎ) కింద ఈ భవనం అక్రమ నిర్మాణం అంటూ బీఎంసీ అధికారులు వాదించారు. భవనం నిర్మాణం మొత్తం నిబంధనలకు విరుద్ధంగా చోటు చేసుకుందని పేర్కొన్నారు. టాయ్‌లెట్‌ను ఆఫీస్ క్యాబిన్‌గా నిర్మించారని ఈ నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. తమకు అందజేసిన బ్లూప్రింట్ డిజైన్లతో పోల్చుకంటే.. భిన్నంగా నిర్మించారంటూ తమ వాదనలను వినిపించారు.

కంగనదే విజయం..
ఈ పిటీషన్‌పై బోంబే హైకోర్టు కొద్దిసేపటి కిందటే తన తీర్పును వినిపించింది. ఈ వ్యవహారంలో బీఎంసీ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని స్పష్టం చేసింది. చట్టాన్ని ఉల్లంఘించారనే విషయం స్పష్టమౌతోందని న్యాయమూర్తులు జస్టిస్ కథవాలా, ఆర్ ఐ ఛాంగ్లా పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను ఎవరూ హర్షించబోరని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి బిల్డింగ్‌ను కట్టారనడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. అకారణంగా భవనాన్ని ధ్వంసం చేసినందున.. దానికి నష్ట పరిహారాన్ని చెల్లించాలని బీఎంసీ అధికారులను ఆదేశించారు. నష్ట పరిహారాన్ని అంచనా వేయడానికి ప్రత్యేకంగా అధికారిని నియమించారు న్యాయమూర్తులు.