west bengal bjp police bjym West Bengal Assembly Elections 2021 mamata banerjee narendra modi rajnath singh పశ్చిమ బెంగాల్ డ్రగ్స్ బీజేపీ మమతా బెనర్జీ నరేంద్ర మోదీ రాజ్‌నాథ్ సింగ్ politics
ఖేలా హోబ్.. బెంగాల్లో ఎక్కడ విన్నా ఇదే స్లోగన్.. డీజే పాటలతో హోరు,అసలేంటీ నినాదం?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత కొద్దిరోజులుగా 'ఖేలా హోబ్...' అనే మాట అక్కడ ఎక్కువగా వినబడుతోంది. తృణమూల్ కాంగ్రెస్,బీజేపీ నాయకులు పదేపదే 'ఖేలా హోబ్..' అంటూ సవాల్ విసురుకుంటున్నారు. అంతేనా.. పొలిటికల్ ర్యాలీల్లోనూ 'ఖేలా హోబ్' స్లోగన్‌తో జోర్దార్ డీజే పాటలు హోరెత్తిపోతున్నాయి. తాజాగా బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా అధికార టీఎంసీకి ఖేలా హోబ్ అంటూ సవాల్ విసిరారు. ఇంతకీ ఏంటీ ఖేలా హోబ్... బెంగాల్లో ఇప్పుడీ స్లోగన్ ఎందుకు పాపులర్ అవుతోంది...
మోదీ దేశంలోనే అతిపెద్ద విధ్వంసకారుడు... బెంగాల్ గడ్డపై బీజేపీకి సమాధే.. : మమతా ఫైరింగ్ స్పీచ్

ఎలా వచ్చందీ స్లోగన్...
కొద్దిరోజుల క్రితం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. 'ఖేలా హోబ్' అంటూ నినదించారు. అప్పటినుంచి రాష్ట్రంలోని ఇతర టీఎంసీ నేతలు,ప్రతిపక్ష బీజేపీ నేతలు కూడా 'ఖేలా హోబ్' నినాదాన్ని ఎత్తుకున్నారు. ఖేలా హోబ్ అంటే... ఆట మొదలైంది అని అర్థం. కొన్నేళ్ల క్రితం బంగ్లాదేశ్‌కు చెందిన బ్లంగాదేశీ ఆవామీ లీగ్ ఎంపీ షమీమ్ ఒస్మాన్ తొలిసారిగా ఈ 'ఖేలా హోబ్' నినాదాన్ని అక్కడ వినిపించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల బిర్భమ్ జిల్లా అధ్యక్షుడు టీఎంసీ అనుబ్రతా మండల్ బెంగాల్లో ఈ నినాదాన్ని వినిపించారు. 'ఖేలా హోబ్(ఆట మొదలైంది).. ఇది చాలా ప్రమాదకర ఆట... అయినా ఆట కొనసాగుతుంది...' అని ఆయన వ్యాఖ్యానించారు.

మొదట్లో విమర్శించిన బీజేపీ... కానీ..
ఇటీవలి ఎన్నికల ప్రచారంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా 'ఖేలా హోబ్' అంటూ బీజేపీకి సవాల్ విసిరారు. మొదట్లో ఈ స్లోగన్‌పై బీజేపీ విమర్శలు గుప్పించింది. బంగ్లాదేశ్ నుంచి అరువు తెచ్చుకున్న నినాదంతో ఎన్నికల ప్రచారంలో చేస్తున్నారని టీఎంసీని విమర్శించింది. కానీ ఆ తర్వాత కొద్దిరోజులకే సీన్ మారిపోయింది. బీజేపీ సహా మిగతా పొలిటికల్ పార్టీలు కూడా ఇదే స్లోగన్ అందుకున్నాయి. ప్రచార సభల్లో,ర్యాలీల్లో డీజే సాంగ్స్‌తో ఈ స్లోగన్ మారుమోగుతోంది. తాజాగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఖేలా హోబ్ అంటూ మమతకు సవాల్ విసిరారు. 'అవును ఆట మొదలైంది... రాష్ట్రంలో అభివృద్ది,శాంతి కోసం నిజంగానే ఆట మొదలైంది...' అని కామెంట్ చేశారు.

'ఇన్సైడర్-ఔట్‌సైడర్' థీమ్‌తో...
టీఎంసీ ఎన్నికల ప్రచారంలో 'ఇన్సైడర్-ఔట్‌సైడర్' థీమ్‌తో 'ఖేలా హోబ్' స్లోగన్‌ను వాడుకుంటున్నారు. 'వాళ్లు నెలకోసారి రాష్ట్రాన్ని సందర్శిస్తుంటారు... కానీ మీరు,మేమూ అలా కాదు... ఇప్పటికీ,ఎప్పటికీ మనమిక్కడే ఉంటాం మిత్రమా.. ఇక ఆట మొదలైంది..' అంటూ డీజే సాంగ్స్ ప్లే చేస్తున్నారు. టీఎంసీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా ఇప్పుడిదే పాట మారుమాగుతోంది. అటు బీజేపీ కూడా ఇప్పుడీ స్లోగన్‌ను ఓన్ చేసుకుని ఖేలా హోబ్ అంటూ టీఎంసీకి సవాల్ విసురుతోంది.

ఎన్నికల షెడ్యూల్ విడుదల...
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎనిమిది దశల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది. మొదటి దశ పోలింగ్ మార్చి 27న, రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 1న, మూడో దశ ఏప్రిల్ 6, నాలుగో దశ ఏప్రిల్ 10న జరుగుతాయి. ఐదో దశ పోలింగ్ ఏప్రిల్ 17న ఉంటుంది. ఆరో దశ ఏప్రిల్ 22, ఏడో దశ ఏప్రిల్ 26, చివరిదైన ఎనిమిదో దశ పోలింగ్ ఏప్రిల్ 29న ఉంటుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రకటించారు. ఇలా 8 విడతల్లో పోలింగ్ నిర్వహించడం కేవలం బీజేపీకి మేలు చేయడం కోసమేనని టీఎంసీ వర్గాలు ఈసీని విమర్శిస్తున్నాయి.