రోజూ ఆపిల్ తింటామా:భార్యకి ఎన్నారై వాట్సాప్ తలాక్
తిరువనంతపురం: పెళ్లైన పదిరోజులకే వాట్సాప్ ద్వారా నవ వధువుకు తలాఖ్.. తలాఖ్.. తలాఖ్ అంటూ సందేశం పంపించాడు ఓ ఎన్నారై. దీంతో, అవాక్కయిన నూతన వధువు కేరళ మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది.
ఈ సంఘటన కేరళలోని అలప్పుజ జిల్లాలోని చెర్తాలాకు చెందిన 21 ఏళ్ల యువతి బిడిఎస్ చదువుతోంది. దుబాయ్‌లో ఉద్యోగం చేసే వ్యక్తితో ఆమెకు గత నెలలో పెళ్లి జరిగింది. పదిరోజులు నవ దంపతులు ఆనందంగా గడిపారు.
ఆ తర్వాత భర్త ఉద్యోగానికి అంటూ దుబాయ్ బయలుదేరాడు. అంతలోనే కేరళకు చెందిన ఓ ప్రవాస భారతీయుడు తన భార్యకు వాట్స్ యాప్ ద్వారా తలాక్ సందేశాన్ని పంపించాడు. సందేశాన్ని చూసుకున్న ఆ యువతి(21) తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
నిఖా అనంతరం తన భర్త దుబాయ్‌కి వెళ్లిన తర్వాత అతడి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఫోన్‌ద్వారా సంక్షిప్త సందేశాలు పంపింది. అయితే, హఠాత్తుగా అతడి నుంచి వాట్స్‌యాప్ సందేశం వచ్చింది.
నువ్వంటే నాకు ఇష్టం లేదని, నాకోసం వేచి చూడాల్సిన అవసరం లేదని, మనకు యాపిల్ అంటే ఇష్టమని రోజూ దాన్నే తింటామా ఏమిటని, ఇతర పండ్లనూ స్వీకరిస్తామంటూ... చెబుతూ... తలాక్...తలాక్...తలాక్ అంటూ అతడు మెసేజ్ పంపాడు. దీంతో, ఆమె తమకు ఫిర్యాదు చేసినట్లు కేరళ మహిళా సంఘం సభ్యురాలు ప్రమీలాదేవి తెలిపారు.