india jammu and kashmir ajit doval nsa terrorist arrest security తీవ్రవాది అరెస్టు భద్రత కేంద్ర ప్రభుత్వం
అజిత్ ధోవల్ ఇంటిపై తీవ్రవాదుల రెక్కీ- అరెస్టైన జైషే ఉగ్రవాది వెల్లడి- భద్రత కట్టుదిట్టం
కశ్మీర్ వ్యవహారాల్లో కీలకంగా ఉన్న దేశ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ ధోవల్‌ను తీవ్రవాదులు టార్గెట్ చేశారు. ఆయన ఇంటిపై రెక్కీ కూడా నిర్వహించారు. తాజాగా అరెస్టయిన జైషే మహ్మద్ తీవ్రవాద సంస్ధకు చెందిన ఉగ్రవాది విచారణలో ఈ విషయం వెల్లడైంది. దీంతో అజిత్ దోవల్ ఇంటితో పాటు ఆయన ఆఫీసుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్‌లో నివాసం ఉంటున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్ధ సభ్యుడు హిదాయతుల్లా మాలిక్‌తో పాటు మరో ముగ్గురిని భద్రతా దళాలు ఫిబ్రవరి 6న అరెస్టు చేశాయి. విచారణలో మాలిక్ పలు కీలక విషయాలు వెల్లడించాడు. ఢిల్లీలోని సర్దార్ పటేల్ భవన్‌తో పాటు పలు వీఐపీ టార్గెట్లపై తాను రెక్కీ నిర్వహించినట్లు విచారణలో అంగీకరించాడు. 2019 మే నెలలో ఢిల్లీలోని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ నివాసంపైనా రెక్కీ నిర్వహించినట్లు మాలిక్ తెలిపాడు. అలాగే తనతో పాటు పలువురు ఉగ్రవాదులు కూడా రెక్కీల్లో పాల్గొన్నట్లు తెలిపాడు.

ఉగ్రవాది మాలిక్ తన సహచరులతో కలిసి గతేడాది కశ్మీర్‌లో నగదుతో వెళ్తున్న ఏటీఏం వ్యాన్‌పైనా దాడి చేసి రూ.60 లక్షల దోపిడీకి పాల్పడినట్లు అంగీకరించాడు. తాజా విచారణలో తనతో పాటు పలు కార్యకలాపాల్లో పాల్గొన్న 8 మంది పేర్లను అతను వెల్లడించాడు. వీరిలో ఒకరి సాయంతో బీహార్‌లోని చాప్రా నుంచి 7 పిస్టల్స్ కొన్నట్లు తెలిపాడు. తాజా పరిణామాలతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఇంటితో పాటు ఆయన ఆఫీసుల వద్ద కేంద్రం భద్రత పెంచింది.