• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అణ్వాయుధాలు: చైనా, పాకిస్తాన్‌ల దగ్గర పెరుగుతున్న అణు వార్‌హెడ్‌లు... భారత్ వెనుకబడిపోతోందా?

By BBC News తెలుగు
|

ఆగస్టు 6, 1945

ఆగస్టు 9, 1945

అణ్వాయుధాలతో ప్రపంచానికి ఎంత ముప్పు ఉందో తెలిపే తేదీలు ఇవి. సుమారు 76 సంవత్సరాల కిందట, 1945 సంవత్సరంలో ప్రపంచంలో తొలిసారి, చివరిసారి ఒక దేశంపై అణు బాంబులు ప్రయోగించిన తేదీలు ఇవి.

జపాన్‌లోని హిరోషిమాపై ఆగస్టు 6న, నాగసాకి పై ఆగస్టు 9న అమెరికా అణు బాంబులను ప్రయోగించింది.

ప్రచ్ఛన్న యుద్ధం తరువాత తొలిసారి...

అణు బాంబులు మానవాళికి ఎంత నష్టం చేకూరుస్తాయో చెప్పడానికి హిరోషిమా, నాగసాకి సజీవ సాక్ష్యాలుగా మిగిలిపోయాయి. అణు దాడి ప్రభావం నుంచి ప్రజలు నేటికీ కోలుకోలేక పోయారు.

కానీ, ఆ వినాశనం జరిగి 76 సంవత్సరాల అయిన తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది దేశాలు 13 వేలకు పైగా అణ్వాయుధాలను తయారు చేసి పెట్టుకుని ఉన్నాయి.

స్వీడన్‌కు చెందిన థింక్-ట్యాంక్ 'స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్' (సిప్రి) తన వార్షిక నివేదికను సోమవారం విడుదల చేసింది. ఇందులో అణ్వాయుధాలకు సంబంధించిన కీలకమైన సమాచారం ఉంది.

అణ్వాయుధాల విషయంలో పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్‌లకన్నా భారత్ చాలా వెనకబడి ఉందని ఈ నివేదిక వెల్లడించింది.

'సిప్రి' నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు:

  • 2011 ప్రారంభంలో, తొమ్మిది అణ్వాయుధ దేశాల (అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, పాకిస్తాన్, ఇండియా, ఉత్తర కొరియా) వద్ద 13,080 అణు వార్‌హెడ్‌లు ఉన్నాయి.
  • వీటిలో 3,825 అణ్వాయుధాలు ఎలాంటి ఆపరేషన్ కోసమైనా సిద్ధంగా ఉంటాయి. గత సంవత్సరం వాటి సంఖ్య 3,720.
  • 3,825 ఆయుధాలలో సుమారు 2,000 అణ్వాయుధాలు అమెరికా, రష్యాలవే. వీటిని హై అలర్ట్ మోడ్‌లో ఉంచారు.
  • ఇజ్రాయెల్‌లో 90, ఉత్తర కొరియాలో 40-50 అణ్వాయుధాలు ఉన్నాయి.
  • గత సంవత్సరంతో పోల్చితే ఉత్తర కొరియా 10 కొత్త అణ్వాయుధాలను తయారు చేసింది
  • చైనా గత సంవత్సరంతో పోలిస్తే 30 అణ్వాయుధాలను కొత్తగా జత చేసింది. ఇప్పుడు ఆ దేశం దగ్గర 350 అణ్వాయుధాలు ఉన్నాయి.
  • గత ఏడాదితో పోలిస్తే పాకిస్తాన్ అయిదు కొత్త అణ్వాయుధాలను తయారు చేసింది. ఆ దేశంలో మొత్తం 165 అణు వార్‌హెడ్‌లు ఉన్నాయి.
  • భారత దేశం గత సంవత్సరం ఆరు కొత్త అణ్వాయుధాలను తయారు చేసింది. ఇప్పుడు భారత్‌లో 156 అణ్వాయుధాలు ఉన్నాయి.

చైనా ముప్పు

ఈ నివేదిక విడుదలైన తరువాత చైనా ఆయుధ సంపత్తి గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది.

భారతీయ కోణంలో చూస్తే, చైనాతో సరిహద్దు వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. యాదృచ్ఛికంగా సిప్రి నివేదిక గల్వాన్ వ్యాలీలో భారత్, చైనాల మధ్య ఘర్షణ జరిగిన ఏడాది పూర్తయిన కొద్ది రోజులకే వచ్చింది.

ఈ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు అంత బాగా లేవు.

అంతర్జాతీయంగా ప్రపంచంలోని అనేక శక్తివంతమైన దేశాలు చైనాను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నాయి. జీ-7, నాటో, క్వాడ్...ఇలా సమావేశం ఏదైనా చైనాతో పెరుగుతున్న ప్రమాదంపై చర్చ జరుగుతోంది.

ఇటు చైనా కూడా దూకుడుగానే స్పందిస్తోంది. జీ-7, నాటో సమావేశాలను చైనా తక్కువ చేసి మాట్లాడింది.

ఇక భారత్‌కు పాకిస్తాన్‌ నుంచి కూడా సవాల్ ఎదురవుతోంది. నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, పాకిస్తాన్‌తో ఏ క్షణంలో ఉద్రిక్తత పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది.

అణ్వాయుధాల విషయంలో భారతదేశం పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్‌లకన్నా చాలా వెనకబడి ఉందని కూడా నివేదిక వెల్లడించింది.

భారత దేశానికి సవాళ్లు

'సిప్రి' నివేదిక తర్వాత అణ్వాయుధాల పెంపుపై దేశాలు పోటీ పడుతున్న తీరు, దాని వల్ల కలిగే పరిణామాల గురించి చర్చ తీవ్రంగా సాగుతోంది.

అయితే, ఇది అణ్వాయుధ పోటీ అనడం సముచితం కాదని రక్షణ రంగ విశ్లేషకుడు రాహుల్ బేదీ అభిప్రాయపడ్డారు.

"అణ్వాయుధాల ఉత్పత్తి నిరంతర ప్రక్రియ. ఒక దేశం అకస్మాత్తుగా అణ్వాయుధాల తయారీని నిలిపేసి, తర్వాత మళ్లీ మొదలు పెట్టే అవకాశం ఉండదు'' అని ఆయన బీబీసీతో అన్నారు.

''ఆయుధాల తయారీ ఒక్కసారి ఆగిపోతే, మొత్తం ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. కాబట్టి నా అభిప్రాయంలో ఇది పోటీ కాదు'' అన్నారాయన.

ఇక భారత్, చైనా, పాకిస్తాన్‌ల గురించి చెప్పాలంటే ఈ మూడు అణ్వాయుధ శక్తులే. అయితే, పాకిస్తాన్, చైనాలతో భారత్‌కు సరిహద్దు వివాదం ఉంది.

''ఈ మూడు దేశాల పరిస్థితి ప్రత్యేకమైంది. ఇది సరిహద్దు సమస్య. సరిహద్దు విభేదాలు ఉన్న అణ్వస్త్ర దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ మూడు దేశాల మధ్య నిత్యం ఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది. అయితే, అది కాల్పులు లేదంటే మరో రూపంలో మాత్రమే ఉంటుంది'' అన్నారు రాహుల్ బేదీ

కాకపోతే, అణ్వాయుధాల నియంత్రణ మిలిటరీ చేతిలో ఉన్న రెండు దేశాలు పాకిస్తాన్, చైనా అని కూడా మనం మర్చిపోకూడదని బేదీ అన్నారు. ఇలాంటి పరిస్థితి భారత్‌కు మరింత ప్రమాదకరం అన్నారాయన.

పాకిస్తాన్, చైనాల మిలిటరీ సహకారంలోనే కాక, అణ్వాయుధాల పరంగా కూడా మిత్ర దేశాలని రాహుల్ బేదీ వివరించారు. ఇక అణు నిరాయుధీకరణ కేవలం సైద్ధాంతిక స్వప్నం( ఐడియలాజికల్ డ్రీమ్) మాత్రమే అన్నారు బేదీ.

అణ్వాయుధాలపైనే అధిక వ్యయం

ఒకవైపు ప్రపంచం గత రెండేళ్లుగా కరోనా మహమ్మారితో పోరాడుతుండగా, మరోవైపు, అణ్వాయుధాల కోసం చేసే వ్యయం కూడా పెరిగింది.

అణ్వాయుధ నిర్మూలనపై పని చేసే ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు ఎబాలిష్ న్యూక్లియర్ వెపన్స్ (ICAN) అనే సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది.

ఈ నివేదిక ప్రకారం 2020 సంవత్సరంలో అణుశక్తి ఉన్న దేశాలు 72.6 బిలియన్ డాలర్లను కేవలం అణ్వాయుధాల కోసం ఖర్చు చేశాయని తెలిపింది. ఈ వ్యయం 2019 సంవత్సరంతో పోలిస్తే 41.4 బిలియన్లు అధికం.

మహమ్మారి కారణంగా ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థలు ఛిన్నాభిన్నం అవుతున్న సమయంలో కూడా ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల సొమ్ము లాబీయింగ్‌ల కారణంగా రక్షణ రంగ కాంట్రాక్టర్లకు ఎలా చేరుతుందో ఈ నివేదిక వివరించింది.

మహమ్మారి సమయంలో అణ్వాయుధాల కోసం ఎక్కువ ఖర్చు చేసిన దేశాలలో అమెరికా మొదటి స్థానంలో, చైనా రెండవ స్థానంలో ఉందని ఐసీఏఎన్ నివేదిక తెలిపింది. ఈ జాబితాలో భారత్ ఆరో స్థానంలో, పాకిస్తాన్ ఏడో స్థానంలో ఉన్నాయి.

అణ్వాయుధాలు శాంతి సాధనాలా ?

అణ్వాయుధాలు ఇతర దేశాలు మనపై దాడి చేయకుండా నిరోధిస్తాయని, అందువల్ల వాటిని శాంతి సాధనాలుగా భావించాలని భారతదేశాన్ని అణ్వస్త్ర దేశంగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు.

అణ్వాయుధాలను తరచుగా 'వెపన్ ఆఫ్ డిటరెన్స్' అంటే 'యుద్ధ నిరోధక ఆయుధాలు' అని కూడా అంటుంటారు.

''అణ్వాయుధాలు నిజంగా దాడికి ఉద్దేశించినవి కావు. వాటి ఉద్దేశం రక్షణాత్మకమైనది'' అని రక్షణ వ్యవహారాలపై వార్తలు ప్రచురించే 'ఏవియేషన్ అండ్ డిఫెన్స్ యూనివర్స్' వెబ్‌సైట్ సంపాదకురాలు సంగీత సక్సేనా అభిప్రాయపడ్డారు.

''భారత్, పాకిస్తాన్, చైనాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటాయని నేను అనుకోను. ముగ్గురి దగ్గరా అణ్వాయుధాలున్నాయి. అందుకే అణ్వాయుధాలను వెపన్ ఆఫ్ డిటరెన్స్ అంటారు'' అని సంగీత సక్సేనా బీబీసీతో అన్నారు.

డిఫెన్స్ మ్యాగజీన్ 'ఫోర్స్' ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గజాలా వహాబ్ కూడా సంగీత అభిప్రాయంతో ఏకీభవించారు.

''అణ్వాయుధాలను యుద్ధంలో ఉపయోగించడానికి తయారు చేయరు'' అన్నారామె.

''భారత్, చైనాల మధ్య 'అణ్వాయుధాన్ని మొదట ఉపయోగించబోము'( నో ఫస్ట్ యూజ్ పాలసీ) అన్న ఒప్పందం ఉంది కాబట్టి, ఈ రెండు దేశాల మధ్య సమస్య రాకపోవచ్చు'' అని 'ఫోర్స్' మేగజీన్ ఎడిటర్ ప్రవీణ్ సాహ్ని అభిప్రాయపడ్డారు. కానీ, పాకిస్తాన్ విధానంపై స్పష్టత లేదు

అయితే, అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఉత్తర కొరియా వంటి దేశాలు 'నో ఫస్ట్ యూజ్ పాలసీ'లో భాగం కాదు. ఇజ్రాయెల్ కూడా దీనిపై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.

చాలా పాశ్చాత్య దేశాలు 'నో ఫస్ట్ యూజ్' విధానాన్ని పాటించనందున అణ్వాయుధాల పెరుగుదలపై సహజంగానే ఆందోళన వ్యక్తమవుతోందని ప్రవీణ్ సాహ్ని చెప్పారు.

అయితే, ఎవరి దగ్గర ఎన్ని అణ్వాయుధాలున్నా భయపడాల్సిన అవసరం లేదని కూడా ప్రవీణ్ సాహ్ని అభిప్రాయపడ్డారు.

''సిప్రి రిపోర్ట్‌ ప్రతి సంవత్సరం వస్తుంది. అందులో పెద్ద తేడాలు ఉండవు. అణుబాంబులు ఎన్ని ఉన్నాయి అన్నది సమస్య కాదు. ఒక బాంబుతో సర్వనాశనం అవుతుంది'' అని ఆయన అన్నారు.

ప్రపంచానికి ప్రమాదం లేదా?

అణ్వాయుధాలను యుద్ధ నిరోధకాలుగా అభివర్ణించినంత మాత్రాన అసలు యుద్ధాలే రావు అనడం సరికాదని కొందరు వాదిస్తున్నారు.

గత నెలలో యూకేకు చెందిన థింక్‌ ట్యాంక్ 'ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్''(ఐఐఎస్ఎస్) ఒక నివేదికను ప్రచురించింది.

ఈ నివేదిక 2019 ఫిబ్రవరిలో పుల్వామా దాడి తరువాత భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుందని, ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా ఏ దేశమైనా అణ్వాయుధాలను ఉపయోగించే పరిస్థితిని తోసిపుచ్చలేమని ఈ రిపోర్టు వెల్లడించింది.

''భారత్, పాకిస్తాన్‌లు టెక్నాలజీలో తమ సామర్ధ్యాన్ని నిత్యం పెంచుకుంటున్నాయి. ఈ కారణంగా అణు రక్షణ అనే అంశాన్ని ఈ రెండు దేశాలు దెబ్బ తీసుకునే అవకాశం ఉంది'' అని ఐఐఎస్ఎస్ ప్రధాన రచయిత ఆంటోనియో లెవెస్క్యూస్ అభిప్రాయపడ్డారు.

అణు శక్తితో పనిచేసే దేశంగా పెరుగుతున్న చైనా శక్తి భారత్ భద్రతకు సవాళ్లను సృష్టిస్తోందని కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ వాదనలన్నిటినీ బట్టి చూస్తే భారతదేశానికి చైనా కచ్చితంగా ముప్పేనని సంగీతా సక్సేనా అభిప్రాయపడ్డారు.

మరోవైపు, అణ్వాయుధాలు యుద్ధ నిరోధకాలుగా ఉపయోగపడతాయన్న వాదన చైనా విషయంలో నిజం కాలేదని ప్రవీణ్ సాహ్ని అన్నారు.

''వాజ్‌పేయీ ప్రభుత్వం 1998లో అణు పరీక్ష నిర్వహించినప్పుడు, చైనా నుంచి భద్రత కోసమేనని చెప్పారు. అయితే ఈ రోజు వరకు కూడా సరిహద్దుల్లో చైనా భారత్‌ల మధ్య ఉద్రిక్తత తొలగిపోలేదు. అంటే చైనాను నిలువరించడంలో భారత్ అంత బలంగా లేదు'' అన్నారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Nuclear weapons: Rising nuclear warheads near China and Pakistan ... Is India lagging behind?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X