మాకు నీతులా?: ఒబామా మత వ్యాఖ్యపై ఏకేసిన సుబ్రహ్మణ్యస్వామి
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పైన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన ఒబామా పలుమార్లు ప్రసంగించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఒబామా మతం విషయమై కూడా మాట్లాడారు. ఈ విషయమై స్వామి ధ్వజమెత్తారు.
భారత మతసహనం పైన ఒబామా ఉపన్యాసం ఇవ్వరాదన్నారు. ఆయన పనేదో ఆయన చూసుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. అమెరికాలో రెండు మిలియన్ల మంది భారతీయులు ఉన్నారని, అక్కడ వారు దేవాలయాలు నిర్మించుకునేందుకు అనుమతించరని, దీపావళి జరుపుకునేందుకు అనుమతించరని విమర్శించారు.
కానీ, ఇక్కడ బరాక్ ఒబామా మాత్రం ఉపన్యాసాలు ఇస్తారని ఎద్దేవా చేశారు. అమెరికాలో మతసామరస్యం సాధించామని చెప్పడం విడ్డూరమన్నారు. అమెరికాలో మెజార్టీ ప్రజలు హిందువులను పశువుల కన్నా హీనంగా చూస్తారని, భారత దేశంలో అయితే ఎనిమిది వందల ఏళ్లుగా ఇస్లామిక్ మైనార్టీ వర్గం, ఆ తర్వాత క్రిస్టినయ్లు మెజార్టీ హిందువులను వేధిస్తున్నారన్నారు.

కాగా, మతవిశ్వాసాలకు అనుగుణంగా దేశం చీలిపోనంతకాలం భారతదేశం రాణిస్తూనే ఉంటుందన్న గట్టి హెచ్చరికతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మంగళవారం తన మూడు రోజుల భారత దేశ పర్యటనను ముగించిన విషయం తెలిసిందే.
సౌదీ అరేబియాకు బయలుదేరి వెళ్లడానికి కొద్ది ముందు మత తీవ్రవాదంపై బలమైన సందేశం ఇస్తూ, తనకిష్టమైన మత విశ్వాసాన్ని పాటించడానికి, ఏ మత విశ్వాసాన్ని పాటించకుండా ఉండడానికి, ఎలాంటి ఒత్తిడి, భయం లేదా వివక్ష లేకుండా చేయడానికి ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని అన్నారు.
మతమార్పిడులు, కొన్ని హిందుత్వ సంస్థలు చేపట్టిన ఘర్ వాపసీ కార్యక్రమాల నేపథ్యంలో ఒబామా చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో తీవ్రమైన చర్చకు దారితీసాయి. ఒబామా భారత్కు హితబోధ చేయడంపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేయగా, మరికొంతమంది మాత్రం ఇది ప్రభుత్వానికి సకాలంలో చేసిన హెచ్చరికగా అభిప్రాయపడ్డారు.