పొంచి ఉన్న ముప్పు - సామాజిక వ్యాప్తిగా ఓమిక్రాన్ : 24 గంటల్లో 3.06 లక్షల పాజిటివ్ కేసులు..!!
దేశ వ్యాప్తంగా కరోనా కల్లోల్లం కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా మరో సారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షలు దాటింది. ఇక, ఓమిక్రాన్ క్రమేణా వ్యాపిస్తూ దేశంలో అన్ని రాష్ట్రాలకు విస్తరించింది. ఇన్సాకాగ్ అధ్యయనం తాజా వైరస్ పైన కీలక అంశాలను వెల్లడించింది. ఓమిక్రాన్ దేశంలో సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని నివేదికలో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,06,064 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీని ద్వారా యాక్టివ్ కేసుల సంఖ్య 22,43,335 కు చేరుకుంది. రోజు వారీ పాజిటివిటీ రేటు 20.75 శాతానికి చేరింది. వారంలో పాజిటివ్ రేటు 17.03 శాతంగా ఉంది.

కర్ణాటకలో విప్ఫోటనం
దేశం మొత్తం మీద కర్ణాటకలో పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముంబాయి కంటే పది రెట్లు ఎక్కువగా కర్ణాటకలో ఒక్క రోజులోనే 26 వేల కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్దారణకు వచ్చాయి. ఉత్తరా ఖండ్ లో క్లాస్ 12 వరకు అన్ని విద్యా సంస్థల ను మూసివేస్తూ..ఆన్ లైన్ క్లాసుల ద్వారానే బోధన కొనసాగించాలని నిర్ణయించారు.
మంబాయిలో 1-12 తరగతుల వరకు పాఠశాలలను తిరిగి ప్రారంభించారు. గడిచిన 24 గంటల్లో 439 మరణాలు నమోదయ్యాయి. దీని ద్వారా మరణాల సంఖ్య 4,89,848 కు చేరింది. ప్రధానంగా అయిదు రాష్ట్రాల్లో ఎక్కువ మొత్తంలో కేసులు నమోదవుతున్నాయి.

సామాజిక వ్యాప్తికి ఓమిక్రాన్
కర్ణాటకలో 50,210 రిజిస్టర్ కాగా, కేరళలో 45,449 కేసులు, మహారాష్ట్రలో 40,805 కేసులు గుర్తించగా, అదే సమయంలో తమిళనాడులో 30,580 కేసులు.. ఇక గుజరాత్ లో 16,617 పాజిటివ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు. జనవరి 20వ తేదీన 91 నమూనాల్లో జన్యుక్రమ విశ్లేషణ జరపగా.. 89 నమూనాల్లో ఒమిక్రాన్‌ను, 2 నమూనాల్లోనే డెల్లాను గుర్తించారు. గతనెలతో పోలీస్తే ఒమిక్రాన్ భారీగా వ్యాప్తి చెందుతున్నట్లు నిర్ధారించారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ వేగంగా
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 46,650 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 14,440 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు మృతి చెందారు. కరోనా బారి నుంచి తాజాగా 3,969 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 83,610 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. ఏపీలో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఈ రోజు సీఎం జగన్ మరోసారి కరోనా పరిస్థితుల పైన సమీక్షించనున్నారు. ఇందులో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.