కొండెక్కిన ఉల్లిధరలు..కిలో ఉల్లి రూ.120కి పై మాటే..! మరో మూడు వారాల పాటు..!
ముంబై: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లి నుంచి ఆ మేలు పొందే సంగతి అటుంచితే ఉల్లి మాట ఎత్తాలంటేనే భయమేస్తోంది. ఇందుకు కారణం ధరలు. పెరుగుతున్న ధరలతో ఉల్లిని కోయకముందే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో ఉల్లి ధరలు ఏకంగా కిలోకు రూ.100 దాటాయి.

కిలో ఉల్లి రూ.120
అకాల వర్షాలు, పంటనష్టాలతో ఉల్లి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ముంబై, పూణే నగరాల్లో కిలో ఉల్లి ధర రూ. 100ను టచ్ చేస్తోంది. అక్టోబర్ 21 నాటికి ముంబై నగరంలో ఉల్లి రీటెయిల్ ధర కిలోకు రూ. 80 నుంచి రూ.100 పలుకుతుండగా పూణేలో మాత్రం రూ.100 నుంచి రూ.120 వరకు ధర పలుకుతోంది. వర్షాల కారణంగా ఉల్లి పంటకు నష్టం వాటిల్లడంతో ధరలు పెరిగాయని ఓ ఉల్లి వ్యాపారి చెప్పాడు.గత వారం కిలో రూ.70గా ఉన్న ఉల్లి ఈ వారానికి రూ. 120కు పెరిగింది. దీంతో సామాన్యులు ఉల్లిని కొనాలంటే జంకుతున్నారు. ఇక ఉల్లి ధరలు కొండెక్కి కూర్చున్నందున వినియోగదారులు చాలా తక్కువ మొత్తంలో ఉల్లిని కొనుగోలు చేస్తున్నారని మరో వ్యాపారి చెప్పాడు.

70శాతం పడిపోయిన ఉల్లి సరఫరా
రెండు నెలల్లో 70శాతం వరకు ఉల్లి సప్లయ్ పడిపోయిందని దేశంలోనే అతిపెద్ద ఉల్లి హోల్‌సేల్ మార్కెట్ అయిన లాసల్గావ్ ఏపీఎంసీ అధికారులు తెలిపారు. ఆగష్టు నెలలో ప్రతి రోజు 22వేల క్వింటాల్ ఉల్లి సప్లయ్ అవుతుండగా అక్టోబర్ గతవారంలో రోజుకు 7వేల క్వింటాల్ ఉల్లి మాత్రమే సప్లయ్ అవుతోందని చెప్పారు. ఇక తక్కువ ఉల్లి సప్లయ్ మరో మూడువారాల పాటు ఉంటుందని చెప్పారు. క్వింటాల్ ఉల్లి రూ.5,500 నుంచి రూ.7000 ఉంటుందని అధికారులు చెప్పారు. 50శాతం ఖరీఫ్ సీజన్లో సాగైన ఉల్లి పంట భారీ వర్షాలకు దెబ్బతినిందని మహారాష్ట్ర ఆనియర్ గ్రోవర్స్ అసోసియేషన్ వెల్లడించింది.

విదేశాల నుంచి ఉల్లి దిగుమతిపై ఫోకస్
ఇదిలా ఉంటే ఉల్లి స్థానిక ఉల్లి సరఫరాకు ఊతమిచ్చేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకోవడాన్ని డిసెంబర్ 15వరకు నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.ఇక ధరలను నియంత్రించేందుకు స్టాక్‌లో ఉన్న ఉల్లిని బహిరంగ మార్కెట్లకు తరలిస్తామని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అంతేకాదు ఆయా దేశాల్లోని ఉల్లి కాంట్రాక్టర్లను సంప్రదించి భారత్‌కు ఉల్లి ఎగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆయా దేశాల భారత హైకమిషన్‌ను కోరింది.

బీహార్ ఎన్నికలపై ఉల్లి ఎఫెక్ట్ ఉంటుందా.?
ఇక ఉల్లి చేసిన నష్టాన్ని గతంలో కూడా చూశాం. గతంలో ఉల్లి ధరలు పెరగడంతో ఢిల్లీ ప్రభుత్వం పడిపోయింది. తాజాగా బీహార్‌లో కూడా ఈ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉల్లి ధరలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉల్లి ధరలను ప్రభుత్వం వీలైనంత త్వరగా నియంత్రణలోకి తీసుకురాకపోతే బీహార్ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే వాదన వినిపిస్తోంది.