దేశంలో పెరిగిన ఉల్లిపాయల దొంగలు: బాలీవుడ్ స్టైల్ లో ట్రక్ నుండి 20 లక్షల విలువైన ఉల్లిపాయల చోరీ
దేశంలో ఉల్లిపాయల దొంగలు పెరిగిపోయారు. ఉల్లి ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఇటీవల ఉల్లిపాయలు దొంగతనాల ఘటనలు పలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లా ఓ దుకాణం లో దొంగతనం జరిగింది. ఇక ఏకంగా ఉల్లి పాయల ట్రక్ మాయం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

మహారాష్ట్రలో ఉల్లిపాయల ట్రక్ చోరీ .. 20 లక్షల విలువైన ఉల్లిపాయలు మాయం
నిన్న ఓ షాపులో నగదును వదిలేసి ఉల్లి పాయలు దొంగతనం చేసి సంచలనం సృష్టించగా అదే క్రమంలో తాజాగా మహారాష్ట్రలోని నాసిక్ నుండి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్ పూర్ కి వెళ్లే మార్గంలో రూపాయల విలువైన ఉల్లిపాయలు చోరీకి గురయ్యాయి. బాలీవుడ్ స్టైల్ లో ఈ చోరీ జరిగిందని తెలుస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే ఉల్లిపాయలతో నిండిన ట్రాక్ నాసిక్ నుండి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్ పూర్ కు బయలుదేరింది. నాసిక్ వ్యాపారవేత్త ప్రేమ్ చంద్ శుక్లా శివపురి కి చెందిన ఒక ట్రాన్స్ పోర్ట్ పేరుతో 20 లక్షల రూపాయల విలువైన ఉల్లిపాయలను పంపించారు. అయితే ఆ ట్రక్ మధ్యలోనే అదృశ్యమైంది.

ట్రాన్స్ పోర్ట్ యజమానిపై ఫిర్యాదు చేసిన యజమాని ...
ట్రక్ నిర్ధేశించిన సమయానికి గమ్యస్థానం చేరకపోవడంతో ఉల్లిపాయలు పంపించిన వ్యాపారి, ట్రాన్స్ ఫోర్ట్ యజమాని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన 20 లక్షల రూపాయల విలువైన ఉల్లిపాయలను దొంగిలించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఉల్లిపాయలతో నిండిన ట్రక్ గోరక్ పూర్ కు వెళుతుందని, అయితే 22వ తేదీన గమ్యస్థానం చేరాల్సిన ట్రక్ చేరకపోవడంతో వ్యాపారి ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.

ట్రక్ దొరికినా , ఉల్లిపాయలు దొరకని వైనం
డ్రైవర్ మరియు ట్రక్ రెండు అదృశ్యమయ్యాయని, వెతగ్గా ట్రక్ మాత్రమే లభించింది కానీ అందులో ఉల్లిపాయలు లేవని శివపురి ఎస్పీ రాజేష్ సింగ్ చందేల్ చెప్పారు. దేశంలో ఉల్లి ధరలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. వాటి ధరలు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో మంచి రకం ఉల్లి ధర మార్కెట్లో కిలో రూ.100 పలుకుతోంది. అందుకే ఉల్లి దొంగలు రెచ్చిపోతున్నారు. ఎక్కడికక్కడ దోపిడీలకు పాల్పడుతున్నారు.

తాజాగా పశ్చిమ బెంగాల్ లో దుకాణంలో ఉల్లిపాయల చోరీ ఘటన
నిన్నటికి నిన్న పశ్చిమ బెంగాల్లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని సుతహతా ప్రాంతంలో దుకాణంలో జరిగిన దొంగతనంలో డబ్బుకు బదులుగా ఉల్లిపాయలు దొంగిలించారు. అక్షయ్ దాస్ అనే వ్యక్తికి చెందిన దుకాణంలో నగదు పెట్టెలో ఉంచిన డబ్బు వదిలేసి ఉల్లిపాయలు ఉన్న బస్తాలు దొంగిలించారు దొంగలు. వాటి విలువ దాదాపు 50 వేల రూపాయలు. కొన్ని వెల్లుల్లి మరియు అల్లం బస్తాలను కూడా దోచుకున్నారని తెలుస్తుంది.దొంగతనం చేసిన దొంగలు డబ్బు కు బదులుగా ఉల్లిపాయలు దొంగిలించారు అంటే ప్రస్తుతం ఉల్లి పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది.