ఆపరేషన్ ఎంప్టీ ప్లేట్: చైనా సరికొత్త వ్యూహం: స్వదేశంలో: ఆహార సరఫరా, వృధాపై కన్నేసిన డ్రాగన్
బీజింగ్: సరిహద్దు వివాదాలను అడ్డుగా పెట్టుకుని భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోన్న చైనా మరో సరికొత్త వ్యూహానికి తెర తీసింది. కొత్త మిషన్‌ను చేపట్టింది. దేశీయంగా అంతర్గతంగా దాన్ని అమలు చేస్తోంది. దీన్ని పాటించని వారిపై కఠిన చర్యలను తీసుకోవడానికి చైనా పాలకులు వెనుకాడట్లేదు. అదే- ఆపరేషన్ ఎంప్టీ ప్లేట్. ఆహారాన్ని వృధా చేయకూడదనే ఉద్దేశంతో చైనా ఈ తరహా ప్రయోగానికి పూనుకుంది. రెస్టారెంట్లు, హోటళ్లు, గ్రూప్ మీల్స్‌లో ఆహారాన్ని పరిమితంగా మాత్రమే ఆర్డర్ ఇవ్వాలంటూ చైనా ప్రభుత్వం తాజాగా ఆదేశాలను జారీ చేసింది.

ఆహార భద్రతలో భాగంగా..
హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు శుభకార్యాల్లో పెద్ద ఎత్తున ఆహారం వృధా అవుతుంటుంది. సగం తిని, సగం అలాగే వదిలేస్తుంటారు. అదంతా వృధా అవుతుంటుంది. ఇకపై ఆ పరిస్థితి తమ దేశంలో కనిపించకూడదంటూ చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్‌పింగ్ తాజాగా ఆదేశాలను జారీ చేశారు. ఆహారాన్ని వృధా చేయడాన్ని ఏ మాత్రం ప్రోత్సహించకూడని చర్యగా అభివర్ణించారు. ఆహారాన్ని వృధాగా పడేయాల్సి రావడం నేరమని పేర్కొన్నారు. ఆహార భద్రతకు అలాంటి చర్యలు ముప్పుగా పరిణమించాయని చైనా పాలకులు భావిస్తున్నారు.

కరోనా సంక్షోభ సమయంలో..
కరోనా వైరస్ వల్ల ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల్లో ఆహారాన్ని వృధా చేయడాన్ని నేరంగా పరిగణించేలా చైనా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లిన వారు కూడా పరిమితంగా మాత్రమే ఆహారాన్ని ఆర్డర్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అపరిమిత ఆహారానికి ఆర్డర్ ఇవ్వడం, పూర్తిగా తినకుండా మధ్యలోనే వదిలేయడం వంటి చర్యలను అరికట్టడానికి తక్షణ నిర్ణయాలను తీసుకోవాలంటూ స్థానిక సంస్థల ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందులో భాగంగా రెస్టారెంట్లు, హోటళ్లపై నిఘా ఉంచాలనీ సూచించింది.

సగటున 93 గ్రాముల ఆహారం వృధా
ఆహారం ఏ మేరకు వృధా అవుతోందనే అంశంపై మీద చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 2018లో ఓ అధ్యయనాన్ని చేపట్టింది. దీని ప్రకారం.. ప్రతి రెస్టారెంట్, హోటల్లో ప్రతి ప్లేట్ భోజనానికి సగటున 93 గ్రాముల ఆహారం వృధా అవుతోందని నిర్ధారించింది. నగరాల్లో సంవత్సరానికి 18 మిలియన్ టన్నుల ఆహరం చెత్తకుప్పల పాలవుతోందని పేర్కొంది. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ ఆహారాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ పరిస్థితుల్లో వృధాను అరికట్టగలిగితే అద్భుత ఫలితాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

20 నుంచి 30 శాతం మేర ఆహార ధాన్యాల దిగుమతి..
చైనా ప్రతి సంవత్సరమూ 20 నుంచి 30 శాతం మేర ఆహార ధాన్యాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. వందల కోట్లను ఖర్చు చేస్తోంది. అందులో కొంతభాగం ఇలా వృధా కావడాన్ని అరికట్టాల్సి ఉందని, ఆహార భద్రతను అందరికీ వర్తింపజేయాలంటే దీన్ని ఒక ప్రధాన మార్గంగా భావించాల్సి ఉంటుందని చైనా అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా. హోటల్ లేదా రెస్టారెంట్‌కు వెళ్లిన వ్యక్తి.. ఆయన ఆర్డర్ ఇచ్చిన ఆహారంలో సగం మాత్రమే వడ్డించేలా తాజా మార్గదర్శకాలను చైనా పాలకులు రూపొందించారు. ఎన్-1 పాలసీగా దీన్ని కఠినంగా అమలు చేయాలని భావిస్తోంది.