బ్లాక్ ఫ్రైడే: అంకెలే అస్త్రాలుగా.. విపక్షాల దాడి: జీడీపీ అంటే గాడ్సే డెసిసివ్ పాలిటిక్స్ కాదంటూ..!
న్యూఢిల్లీ: క్షీణించిన దేశ ఆర్థిక వ్యవస్థ.. ప్రతిపక్షాలకు అయాచిత అస్త్రంలా మారింది. 2019-2020 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన జీడీపీ అంకెలనే అస్త్రాలుగా మార్చుకున్నారు ప్రతిపక్ష నాయకులు. రెండో త్రైమాసికంలో జీడీపీ కేవలం 4.5 శాతం నమోదు కావడం పట్ల మండి పడుతున్నారు. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన నివేదికలో పొందుపరిచిన వివరాలను ఆధారంగా చేసుకుని చెలరేగిపోతున్నారు.
ప్రమాద ఘంటికలు: అంకెల అలజడి..దిగజారిన జీడీపీ: ఆర్థిక నిపుణుల పరిభాషలో చెప్పాలంటే.. !
అత్యంత ఆందోళనకరం..
జీడీపీ అత్యంత కనిష్ఠ స్థాయికి దిగజారడం ఆందోళన కలిగిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. దేశంలో వేళ్ల మీద లెక్కపెట్టే ఆర్థికవేత్తల్లో ఒకరిగా పేరుంది మన్మోహన్ సింగ్ కు. జీడీపీకి సంబంధించిన నివేదికను జాతీయ గణాంకాల కార్యాలయం ఆవిష్కరించే సమయానికి ఆయన ఓ సదస్సులో ఉన్నారు. ఆర్థిక రంగానికి సంబంధించిన సదస్సు కావడంతో మన్మోహన్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జీడీపీ తాజా నివేదికపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

సరిదిద్దడానికి అవకాశం ఉంది..
దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం వల్లే జీడీపీ అత్యంత కనిష్ఠ స్థాయి దిగజారిందని మన్మోహన్ సింగ్ అన్నారు. అయినప్పటికీ- ఇలాంటి పరిస్థితుల్లో కూడా దీన్ని సరిదిద్దడానికి అవకాశం ఉండటం కాస్త సంతోషించదగ్గ పరిణామమని చెప్పారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగాల్సిన సమయం ఆసన్నమైందని, ఇప్పుడు కాకపోతే.. పరిస్థితులు చేతులు దాటి పోయే ప్రమాదం నెలకొని ఉందని అన్నారు.
జీడీపీ అంటే గాడ్సే డెసిసివ్ పాలిటిక్స్ కాదంటూ..
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వానికి జీడీపీ అనే పదాలకు అర్థం కూడా తెలియట్లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రణ్ దీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. జీడీపీ అంటే గాడ్సే డెసిసివ్ పాలిటిక్స్ అని కేంద్రం భావిస్తోందని ఎద్దేవా చేశారు. జీడీపీ అత్యల్ప స్థాయికి దిగజారడం ఆర్థిక మాంద్యం కాక ఇంకేమిటీ? అంటూ ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో కళ్లముందే కనిపిస్తోందని, అయినప్పటికీ కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఆర్థిక మంత్రి నుంచి సమాధానం ఉందా?
నానాటికీ క్షీణిస్తోన్న దేశ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడే దమ్ము, ధైర్యం కేంద్ర ఆర్థిక మంత్రికి ఉందా? అంటూ తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డెరెక్ ఒబ్రియాన్ నిలదీశారు. 26 త్రైమాసికాలతో పోల్చుకుంటే ఈ స్థాయిలో పాతాళానికి దిగజారడం దేశ ఆర్థిక చరిత్రలోనే లేదని మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థపై తమ నిరసనను వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలందరూ పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసినప్పటికీ.. ఆర్థిక మంత్రి మాత్రం తన సీటుకే అతుక్కుపోయి కనిపించారని ఎద్దేవా చేశారు.

బ్లాక్ ఫ్రైడేగా అభివర్ణించిన పారిశ్రామికవేత్తలు..
జీడీపీ పతనం కావడాన్ని పలువురు పారిశ్రామికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ ఫ్రైడేగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి పతనాన్ని తాము ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. తక్షణ నివారణ చర్యలు గనక తీసుకోకపోతే మరింత పతనం తప్పదంటూ కలవరపడుతున్నారు. ఇప్పటికే తయారీ రంగంలో నెలకొన్న మాంద్యం తరహా పరిస్థితుల వల్ల లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారని, ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగితే పరిస్థితులు మరింత దిగజారతాయని అంటున్నారు.