• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఓటీఎస్: ‘జగనన్న సంపూర్ణ భూ హక్కు పథకం’ ఏమిటి? అనుమానాలెందుకు, ప్రభుత్వ సమాధానాలేంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఓటీఎస్ స్కీమ్ వేడి పుట్టిస్తోంది. వివిధ ప్రభుత్వ పథకాల కింద ఇళ్లు నిర్మించుకున్న సామాన్యుల్లో అనుమానాలు పెంచుతోంది.

లబ్దిదారులంతా ఇప్పుడు ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాలనడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వాలంటీర్లు సహా ప్రభుత్వ సిబ్బంది నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ఆందోళనకు గురవుతున్నారు.

జగన్ ప్రభుత్వ వైఖరిని విపక్షాలు తప్పుబడుతున్నాయి. ప్రభుత్వం మాత్రం తమ చర్యను సమర్థించుకుంటోంది.

ప్రజలెవరూ ఓటీఎస్‌కి డబ్బులు కట్టొద్దని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని ప్రధాన ప్రతిపక్షం చెబుతుంటే, ఓటీఎస్ చుట్టూ దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇంతకీ ఓటీఎస్ అంటే ఏమిటి? అసలు వివాదం ఏమిటి? 5 కీలక ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.

1. ఓటీఎస్ అంటే ఏమిటి?

జగనన్న సంపూర్ణ భూ హక్కు పథకం పేరుతో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్నే ఓటీఎస్ అని ప్రస్తావిస్తున్నారు. 'వన్‌ టైమ్ సెటిల్‌మెంట్‌'గా దీనిని చెబుతున్నారు.

ఈ పథకాన్ని అమలు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్‌ అసైన్డ్‌ భూములు (ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌)-1977 చట్టానికి సవరణలు తీసుకువచ్చారు.

2011 ఆగస్టు 15 కంటే ముందు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నివాస పత్రాలు, డీఫామ్ పట్టాల కింద ఇళ్లు కట్టుకున్న వాళ్లకు ఈ పథకం వర్తిస్తుంది. దానికోసం ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం 1994లో కూడా సవరణలు తీసుకొచ్చారు.

హౌసింగ్ కార్పొరేషన్ నుంచి అప్పట్లో సుమారు 40 లక్షల మంది రుణం తీసుకున్నట్టు ఏపీ గృహనిర్మాణ శాఖ లెక్కలు చెబుతున్నాయి.

అప్పటి నుంచి తీసుకున్న రుణాలు పూర్తి చెల్లించకుండా లేదా ఇతర కారణాలతో అసలు కూడా చెల్లించని వారు ఈ పథకం వల్ల లబ్ది పొందుతారని ప్రభుత్వం అంటోంది.

గృహ నిర్మాణం కోసం తీసుకున్న రుణం, వడ్డీతో కలిపి ఎంత మొత్తం ఉన్నప్పటికీ దాని నుంచి విముక్తి కల్పిస్తామని చెబుతోంది.

అందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.15వేలు, కార్పొరేషన్‌ పరిధిలో రూ.20 వేలు చొప్పున ఏకకాలంలో ప్రభుత్వానికి చెల్లించాలని నిర్దేశించింది.

ఆయా ప్రాంతాల్లో నిర్ణయించిన మొత్తం కంటే లబ్దిదారులు కట్టవలసిన రుణం తక్కువ ఉంటే, తక్కువగా ఉన్న మొత్తాన్నే చెల్లించవచ్చని పేర్కొంది.

ప్రభుత్వ గృహాలు

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిర్ణయించిన మొత్తం కంటే లబ్ధిదారుడు కట్టవలసిన సొమ్ము ఎక్కువగా ఉన్నప్పుడు, జగనన్న సంపూర్ణ భూహక్కు పథకం కింద నిర్ణయించిన మొత్తం చెల్లిస్తే.. మొత్తం రుణం మాఫీ అవుతుంది.

ఉదాహరణకి గ్రామీణ ప్రాంతంలో ఒక లబ్ధిదారుడికి రూ.9 వేలు రుణ భారం ఉందనుకుంటే... సదరు లబ్ధిదారుడు రూ.10వేలకు బదులు రూ.9 వేలు చెల్లిస్తే సరిపోతుంది.

అలాగే మరో లబ్దిదారుడు రూ.50,000 రుణం చెల్లించాల్సి ఉందనుకుంటే.. ఆ లబ్ధిదారుడు రూ.10వేలు కడితే అతడికి రూ.40,000 మాఫీ కావడంతో, ఆ మేరకు లబ్ది జరుగుతుందనేది ప్రభుత్వ వాదన.

వారితో పాటుగా సుమారు మరో 12 లక్షల మంది హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఏ విధమైన రుణం తీసుకోకుండా ఇళ్లు కట్టుకున్నారు. వాళ్లందరికీ రూ.10 నామమాత్రపు రుసుముతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు వాళ్ల పేరు మీదే, వాళ్ల ఇంటికి సంబంధించిన నివాసిత స్ధలానికి ఇస్తామని ప్రభుత్వం అంటోంది.

ఓటీఎస్‌కి మొత్తం 56,69,000 మంది అర్హులున్నారని ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చెబుతోంది. ఈ పథకంలో లబ్ధిదారుడికి ఇంటిపై సర్వహక్కులు కల్పిస్తామని అంటోంది. అమ్ముకోవడానికి, బహుమతిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదని, ప్రభుత్వమే వారి పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వడం వల్ల అనేక సమస్యలు తొలగుతాయని చెబుతోంది.

భవిష్యత్తులో కూడా ఏ విధమైన ఇతర లింకు డాక్యుమెంట్లు అవసరం లేకుండా, ప్రభుత్వం ఇచ్చిన రిజిస్టర్డ్‌ డాక్యుమెంటుతో అమ్ముకుని నేరుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చనేది ప్రభుత్వ వివరణ.

ఎన్టీఆర్ హయాంలో కట్టించిన గృహాలు

2. ఈ స్కీమ్ ఎప్పుడు వచ్చింది, ఏం జరిగింది?

వన్‌ టైంసెటిల్‌‌మెంట్ స్కీంను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2000లో ప్రారంభించారు. ఓటీఎస్‌ స్కీంలో నిర్ణయించిన మొత్తాన్ని కట్టిన వారికి, తాకట్టు పెట్టిన నివాసిత స్ధలపత్రం కానీ, డీఫామ్‌ పట్టా కానీ తిరిగి ఇచ్చేవారు. వడ్డీ మాఫీ చేస్తారు.

కానీ వాటిని అమ్ముకునే హక్కు కానీ, వారసులకు బహుమతిగా రిజిస్ట్రేషన్‌ చేసే హక్కు కానీ ఉండదు.

2013-14 ఆర్థిక సంవత్సరాంతానికి అంటే 14 సంవత్సరాలలో 2,31,284 మంది వన్‌టైం సెటిల్‌‌మెంట్‌ స్కీంను వినియోగించుకున్నారు.

2014 తర్వాత అంటే రాష్ట్ర విభజన తర్వాత ఈ పథకం అమలుకాలేదు. ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాత్రం 2016 నుంచి ఓటీఎస్ కోసం పలు దఫాలుగా ప్రభుత్వానికి నివేదించినట్టు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు.

ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా లబ్దిదారులను ఒత్తిడి చేసిన దాఖలాలు లేవు. రుణాలు చెల్లించాల్సిన వారు కూడా ఈ విషయాన్ని దాదాపుగా మర్చిపోయారు. మరికొన్ని చోట్ల వాస్తవ లబ్దిదారులు చనిపోవడంతో వారి వారసులకు ఈ విషయమే తెలియని పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వ రికార్డుల ప్రకారం రుణాల బకాయిలు మాత్రం కొనసాగుతున్నాయి. వాటన్నింటినీ ఇప్పుడు ఓటీఎస్ ద్వారా క్లియర్ చేయాలన్నది ప్రభుత్వ ప్రయత్నంగా కనిపిస్తోంది.

స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారికి మాత్రం ఓటీఎస్ వర్తిస్తుందని, ఎక్కడా బలవంతం చేయడం లేదని ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు.

ప్రభుత్వ గృహాలు

3. అభ్యంతరాలు ఏమిటి, అనుమానాలు ఎందుకు?

ఓటీఎస్ ద్వారా నిర్దిష్ట మొత్తం చెల్లిస్తే ఆయా లబ్దిదారులకు సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని ప్రభుత్వం చెబుతుంటే, సామాన్యుల నుంచి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అందులో స్వచ్ఛందం అని ప్రభుత్వం చెబుతున్న మాటలో వాస్తవం లేదని టీడీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటున్నారు.

"ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. స్వచ్చందం కాదని నిరూపిస్తాం. వాలంటీర్ల నుంచి వివిధ శాఖల సిబ్బంది వరకు లబ్దిదారుల మీద ఒత్తిడి తెస్తున్న విషయాన్ని కాదనగలరా? ప్రభుత్వం సుమారుగా రూ. 6వేల కోట్లను ప్రజల నుంచి సేకరించే ప్రయత్నం చేస్తోంది. ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాళా తీయించి ఇలా ప్రజలు ఎప్పుడో దశాబ్దాల నాడు కట్టుకున్న ఇళ్ల బకాయిలంటూ ఇప్పుడు వసూళ్లకు దిగడం చేతగానితనానికి నిదర్శనం" అని ఆయన బీబీసీతో అన్నారు.

టిడ్కో కాలనీ

అప్పట్లో స్థలం, ఇంటి లోన్ తీసుకున్న వారి పేర్లు కూడా ఇప్పుడు జాబితాలో ఉండడంతో వాటి ఆధారంగా వివిధ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది రంగంలో దిగారు. దాంతో లబ్దిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉన్నపళంగా పెద్ద మొత్తంలో చెల్లించాల్సి రావడంతో సామాన్యులు సతమతం అవుతున్నారు.

"మాకు రెండుసార్లు వచ్చి చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉండగా మాకు లోన్ ఇచ్చారు. అప్పట్లో లోన్ కూడా చాలా తక్కువ. మేమే ఎక్కువ డబ్బులు వేసుకుని ఇల్లు కట్టుకున్నాం. దశల వారీగా ఇంటిని పూర్తి చేసుకున్నాం.

కానీ మా లోన్‌లో ఇంకా రూ. 35వేల బకాయి ఉందంటున్నారు. వడ్డీతో కలిపి రూ. 48వేలు కట్టాలని చెప్పారు. ఇప్పుడు రూ. 10వేలు కడితే సరిపోతుదంటున్నారు. ఇదే ఇంట్లో 15 ఏళ్లుగా ఉంటుంటే, ఇప్పుడొచ్చి మీ ఇల్లు మీది కావాలంటే రూ. 10వేలు ఇవ్వాలని అడగడమేమిటో అర్థం కావడం లేదు. ఆర్థికంగా కష్టాల్లో ఉంటే ఇది మాకు భారమే" అని కృష్ణా జిల్లా పెనమలూరు సమీపంలోని పోరంకి గ్రామ వాసి కొణిదెల శ్రీవాణి బీబీసీతో అన్నారు.

"మాకు లోన్ ఇవ్వలేదు. ఇందిరమ్మ కాలనీలో ఇంటి స్థలం వచ్చింది. సిమెంట్‌తో చేసిన గుమ్మం ఒకటి, రెండు కిటికీలు ఇచ్చారు. మేమే మా డబ్బులు ఖర్చు చేసి ఇల్లు కట్టుకున్నాం.

కానీ ఇప్పుడు లిస్టులో మా పేరు ఉందంటూ వాలంటీర్ మా ఇంటికి వచ్చారు. రూ. 10వేలు కట్టకపోతే ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని కూడా అంటున్నారు. రేషన్ కార్డు కూడా ఉండదని ఊళ్లో చాలామంది చెబుతున్నారు.

మాకయితే ఆందోళనగా ఉంది. మా ఆయన పని కోసం హైదరాబాద్ వెళ్లిపోయారు. అక్కడే బిల్డింగ్ పనిచేస్తుంటారు. ఒకేసారి రూ. 10వేలంటే మాకు చాలా కష్టం" అని అంటూ తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం జడ్డంగి గ్రామానికి చెందిన ఎం కాంతమ్మ వాపోయారు.

4. ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటోంది?

ప్రతిపక్షాల విమర్శలు, ప్రజల ఆందోళనలను ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. గతం కన్నా మెరుగ్గా ప్రజలకు మేలు చేసేందుకే ఈ పథకం అని వాదిస్తోంది.

"గతంలో అమలయిన ఓటీఎస్‌ స్కీంలో నివాసిత పత్రంమీద కానీ, డీఫామ్‌ పట్టాల మీద గానీ బ్యాంకులు రుణసదుపాయం కల్పించేవి కావు. ఇప్పుడు ఇచ్చే రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ మీద భూమి, ఇంటి విలువ మీద 75 శాతం వరకు బ్యాంకు రుణం కూడా తీసుకోవచ్చు. ఒకప్పుడు శివార్లలో నిర్మించిన కాలనీలకు ఇప్పుడు విలువ పెరిగింది. కాబట్టి రుణాలు ఎక్కువే వస్తాయి"

"ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లను లబ్ధిదారుడికి ఇచ్చే సమయంలో యూజర్‌ ఛార్జీలు, రిజిస్ట్రేషన్‌ ఫీజు, స్టాంప్‌ డ్యూటీ వంటివి కూడా మాఫీ చేశారు. కార్పొరేషన్‌ పరిధిలో అయితే ఇలా మాఫీ అయిన మొత్తం విలువ సుమారు రూ.1 లక్ష ఉంటుంది. లబ్దిదారులకు మేలు చేసే ఈ విధానాన్ని ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయి. పేదలకు శాశ్వత భూమి హక్కు లభించడం వారికి ఇష్టం లేదు" అని ఏపీ గృహనిర్మాణ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు అన్నారు.

ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 2 నాటికి గడిచిన 12 రోజులలో 1 లక్షా 6 వేల మంది ఉపయోగించుకున్నట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించడం ప్రతిపక్షాలకు తగదు" అని ఆయన బీబీసీతో అన్నారు.

2019కి ముందు 43,776 మంది లబ్దిదారులు తమ మొత్తం రుణాలను ప్రభుత్వానికి చెల్లించి, నివాసిత పత్రాలు, డీఫామ్‌ పట్టాలు వెనక్కి తీసుకున్న విషయాన్ని చంద్రబాబు మరచిపోతున్నారంటూ ఆయన విమర్శించారు.

ఇళ్లు అప్పగించడానికి బ్యాంకుల ఆలస్యమే కారణమని అధికారులు చెబుతున్నారు.

5. సమస్యను తీవ్రం చేస్తున్నదెవరు?

ఓటీఎస్ విషయంలో విపక్షాలను తప్పుబడుతున్నప్పటికీ ప్రభుత్వ తీరు కారణంగానే సమస్యలు వస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కిందస్థాయిలో సిబ్బందికి టార్గెట్లు పెట్టి, ప్రజలను వేధించేందుకు ప్రయత్నించడం తగదని ఏపీ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ సీహెచ్ బాబూరావు అన్నారు.

"ప్రభుత్వం చెబుతున్న దానికి, ఆచరణకు పొంతన లేదు. అంతా స్వచ్ఛందం అంటోంది. మరి మహిళా పోలీసుల నుంచి డ్వాక్రా సంఘాల ప్రతినిధుల వరకు వివిధ రూపాల్లో ఒత్తిడి తెస్తున్నారు. అన్ని పట్టణాలలోనూ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి ఇంటి ప్లాన్లు ఉన్నాయా? లేదా? పరిశీలిస్తూ, ఇంటి ప్లాన్లు ఇవ్వాలని ప్రజలను ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు ప్లాన్లు ఎందుకు?" అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

"సచివాలయ సిబ్బంది నుండి తగిన సమాధానం రావడం లేదు. ఇంటి ప్లాన్లు సేకరించి ప్రజలపై భారాలు మోపడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే చెత్త పన్ను, ఆస్తి మూల విలువ ఆధారిత ఇంటి పన్ను, వన్ టైం సెటిల్మెంట్ పేరుతో పట్టాలు, రిజిస్ట్రేషన్ల కొరకు వసూళ్లు చేస్తుండడం, మళ్లీ ఇప్పుడు ప్లాన్లు సేకరించటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి" అని ఆయన బీబీసీతో అన్నారు.

అనేక రూపాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మూలంగానే ప్రజల్లో అపోహలు పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వమే ఇలాంటి భారాల నుంచి విముక్తి కల్పించాలని, అందుకు బాధ్యత తీసుకుని పాత రుణాల పేరుతో చేస్తున్న వసూళ్ల పర్వానికి ముగింపు పలకాలని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
OTS: What is the 'Jagananna sampoorna bhoo hakku pathakam? what is the government's answer
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X