కాంగ్రెస్ నిర్మాణం కుప్పకూలింది, 5 స్టార్ సంస్కృతి పోవాలి: గులాంనబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధిష్టానంపై ఆ పార్టీ సీనియర్ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే కపిల్ సిబల్ సొంత పార్టీపై విమర్శలు చేయగా.. ఇప్పుడు మరో సీనియర్ నేత అధిష్టానాన్ని ఇరుకునపెట్టే వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీతోపాటు ఉపఎన్నికల్లోనూ పేలవ ప్రదర్శన చూపడంపై కాంగ్రెస్ అధిష్టానానికి ఆ పార్టీ నేతలే హితబోధ చేస్తున్నారు.
తాజాగా, కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 72ఏళ్లలో ఎప్పుడూ లేనివిధంగా కాంగ్రెస్ పరిస్థితి దిగజారిందన్నారు. రెండు పర్యాయాలుగా లోక్సభలో పూర్తిస్థాయి ప్రతిపక్ష హోదాను కూడా పొందలేకపోయింనద్నారు. కానీ, అనూహ్యంగా లడఖ్ హిల్ కౌన్సిల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 9 సీట్లు వచ్చాయని తెలిపారు. ఇలాంటి సానుకూల ఫలితాలు తాము ఊహించలేదన్నారు.

గాంధీ కుటుంబానికి క్లీన్ ఇస్తున్నట్లు చెప్పిన గులాంనబీ ఆజాద్.. ఇంతకుముందటి డిమాండ్లలో ఎటువంటి మార్పు లేదన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తిరిగి ప్రత్యామ్నాయ అధికార శక్తి కావాలనుకుంటే వెంటనే సంస్థాగతఎన్నికలు జరిపించాల్సి ఉంటుందన్నారు.
అంతేగాక, కాంగ్రెస్ పార్టీ నిర్మాణం పూర్తిగా కుప్పకూలిందని, పార్టీని మళ్లీ పునర్నించాలన్నారు. ఆ తర్వాతే సరైన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. అప్పుడు పార్టీ బాగుపడుతుందని చెప్పారు. నాయకుడిని మారిస్తే సరిపోదని, వ్యవస్థను మార్చినప్పుడే అనుకున్నది సాధ్యమవుతుందని ఆజాద్ వ్యాఖ్యానించారు.
ఏ పార్టీలోనైనా వ్యక్తి పూజ తగదని ఆజాద్ సూచించారు. తమ పార్టీలో రెబల్స్ లేరని.. తిరుగుబాటే ఉందని చెప్పారు. నాయకత్వ స్థాయిలో సంస్కరణలు జరగాలన్నారు.
వరుస ఓటములతో కాంగ్రెస్ పార్టీలో ఆందోళన చెందుతోందనడం వాస్తవమేనని చెప్పారు. పార్టీ నాయకత్వం బాగానే ఉందని, తాను నాయకత్వాన్ని నిందించడం లేదని తెలిపారు.
పార్టీలో నేతలు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడుతున్నారని.. కార్యకర్తలు, ప్రజలకు దూరమవుతున్నారని ఆజాద్ స్పష్టం చేశారు. పార్టీలో 5 స్టార్ కల్చర్ పోతేనే పార్టీ నిలబడుతుందని ఆయన అన్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తేనే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉంటుందని గులాంనబీ ఆజాద్ స్పష్టం చేశారు.