సరి‘హద్దు’ దాటితే కాల్చిపారేస్తాం.. ఇక మీ ఆటవిక దాడులు సాగవు: చైనాకు భారత్ వార్నింగ్
న్యూఢిల్లీ: లడఖ్‌లోని సరిహద్దు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) బలగాల ఉపసంహరణకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో చైనా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని భారత్ స్పష్టం చేసింది. ఒక వేళ చైనా తన సరిహద్దులు దాటి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నిస్తే ఏకంగా కాల్పులే జరుపుతామని గట్టి హెచ్చరిక చేసింది.
చర్చలు జరుగుతున్నాయ్.. ఏకపక్ష మార్పులు వద్దు: చైనాకు భారత్ గట్టి హెచ్చరిక

భారత కీలక ప్రాంతంపై చైనా కన్ను..
ప్యాంగ్యాంగ్ సరసు వద్ద భారత్‌కు పట్టున్న దక్షిణ రేవు నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియను మొదలుపెడదామన్న డ్రాగన్ ప్రతిపాదనను భారత్ తిరస్కరించింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న అన్ని ప్రాంతాల్లో ఏక కాలంలో బలగాల ఉపసంహరణ జరగాల్సిందేనని స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన సైనిక కోర్ కమాండర్ల స్థాయి చర్చల్లో భారత తన వైఖరిని ఈ మేరకు స్పష్టం చేసింది.

ఆటవిక దాడులు కుదరదు.. కాల్చిపారేస్తాం..
భారత శిబిరాలను ఆక్రమించడానికి లేదా కర్రలు, ఇనుప చువ్వలు తదితర ఆయుధాలతో సమూహిక దాడులకు చైనా దిగితే మాత్రం.. తాము కాల్చి పారేస్తామని చైనాకు భారత్ తేల్చి చెప్పింది. ఇప్పటికే భారత సైన్యానికి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అందినట్లు వెల్లడించింది. సరిహద్దుల్లో ఇకపై బలగాల పరస్పర తోపులాటలను సహించబోమని, ఆటవిక ఆయుధాల వినియోగమూ కుదరదని చైనాకు తేల్చి చెప్పింది.

భారీ ఆయుధాలను ఇంకా వాడలేదు.. అమెరికా గన్స్ అలాగే ఉన్నాయి..
ప్యాంగ్యాంగ్ సరస్సు ఉత్రత, దక్షిణ రేవుల్లో ఇప్పటికే పలుమార్లు గాల్లోకి కాల్పులు జరుపుకొన్న ఘటనలు జరిగాయని గుర్తు చేసింది. ఇందులో చిన్నపాటి ఆయుధాలను మాత్రమే ఉపయోగించారని, భారీ ఆయుధాలను ఇంకా వాడలేదని తెలిపింది. అంతేగాక, ఉద్రిక్తలు నెలకొన్న ప్రాంతాల్లో భారత సైనికులకు అమెరికా నుంచి తాజాగా దిగుమతి చేసుకున్న అత్యాధునిక సిగ్ సావర్ గన్స్‌ను అందజేసినట్లు స్పష్టం చేసింది.

చైనాను నమ్మలేం..
జూన్ 15న గల్వాన్ లోయలో చైనా దుర్మార్గంగా దాడులకు పాల్పడిందని.. ఇలాంటి ఇక తాము సహించబోమని భారత్ స్పష్టం చేసింది. సరిహద్దులో బలగాలను పెంచరాదన్న తాజా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అయితే, తాము చైనాను గుడ్డిగా నమ్మలేమని, అప్రమత్తంగానే ఉంటామని స్పష్టం చేసింది. చైనా ఇప్పటికే పలుమార్లు శాంతి చర్చలు జరుపుతూనే కవ్వింపు చర్యలకు పాల్పడిన ఘటనలు చాలా ఉన్నాయని గుర్తు చేసింది. అందుకే ముందుగా పీఎల్ఏ బలగాలను ఉపసంహరించుకోవాలని చైనాకు స్పష్టం చేశామని చెప్పారు.

అక్కడి బలగాలను వెనక్కి తీసుకోం..
ప్యాంగ్యాంగ్ దక్షిణ ప్రాంతంలో భారత బలగాల ఆధీనంలో ఉన్న పర్వత ప్రాంతాలు తమ భూభాగం పరిధిలోకే వస్తాయని, అందుకే అక్కడ్నుంచి తమ బలగాలనే వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని భారత్ తేల్చి చెప్పింది. ఎందుకంటే, చైనా ఇప్పటికే సుమారు 50వేలకుపైగా బలగాలు, ట్యాంకులు, మిసైల్స్‌తో సరిహద్దుకు సమీపంలో మోహరించిందని భారత్ తెలిపింది. సరిహద్దులో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలమని స్పష్ట చేసింది. కాగా, పూర్తిస్థాయిలో బలగాల ఉపసంహరణకు చైనా తన అంగీకారం తెలియజేయకపోవడంతో మరికొన్ని సార్లు చర్చలు జరిగే అవకాశాలున్నాయి.