హర్యానాలో 90 మంది ఎమ్మెల్యేల్లో 84 మంది కోటీశ్వరులు: నివేదిక
న్యూఢిల్లీ: మహారాష్ట్ర హర్యానాల్లో కొత్త అసెంబ్లీ కొలువుదీరనుంది. మహారాష్ట్రలో బీజేపీ శివసేనలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండగా.. హర్యానాలో జేజేపీతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇక హర్యానాలో 90 మంది ఎమ్మెల్యేల్లో 12 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే 13శాతం మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అదే 2014లో 9 మంది ఎమ్మెల్యేలపై అంటే 10శాతం మంది ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి. ఈ విషయాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది.

ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
ఇక 7 మంది ఎమ్మెల్యేలపై సీరియస్ క్రిమినల్ ఛార్జ్‌లు ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది. 2014లో ఆరుమంది ఎమ్మెల్యేలపై సీరియస్ క్రిమనల్ ఛార్జ్‌లు నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. 31 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో నలుగురు, 40 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో ఇద్దరిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇక కింగ్‌మేకర్‌గా మారిన జననాయక్ జనతా పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో ఒకరిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఐఎన్ఎల్డీ నుంచి ఎన్నికైన ఒకరిపై క్రిమినల్ కేసులుండగా... ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ముగ్గురిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు నివేదిక తెలిపింది.

84 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు
ఇక ఆర్థికంగా ఎమ్మెల్యేలంతా చాలా బలంగా ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. 90 మంది ఎమ్మెల్యేల్లో 84 మంది ఎమ్మెల్యేలు అంటే 93శాతం మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులని తేల్చింది. ఇక 2014లో 75 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులుగా ఉన్నారని వెల్లడించింది.40 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో 37 మంది కోటీశ్వరులుగా ఉంటే... 31 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 29 మంది కోటీశ్వరులే అని నివేదిక పేర్కొంది. ఇక జేజేపీ నుంచి ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులుగా తేల్చింది నివేదిక. ఇక ఏడు మంది స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ఆరుమంది కోటీశర్వులు ఉండగా ఇక హర్యానా లోక్‌హిత్ పార్టీ, ఐఎన్ఎల్డీకి చెందిన ఎమ్మెల్యేలు తమ ఆస్తులను కోటికి పైగా అఫిడవిట్‌లో చూపించారని ఏడీఆర్ వెల్లడించింది.

ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తులు రూ.18.29 కోట్లు
ఇక హర్యానాలో తాజాగా గెలిచిన ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తులు రూ.18.29 కోట్లుగా ఉందని ఏడీఆర్ వెల్లడించింది. 2014లో 90 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తుల వివరాలు 12.97 కోట్లుగా ఉన్నిందని ఏడీఆర్ పేర్కొంది. ఇక ఒక్కో బీజేపీ ఎమ్మెల్యే సగటు ఆస్తులు రూ.12.04 కోట్లు ఉండగా.. కాంగ్రెస్‌కు చెందిన ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తుల విలువ రూ.16.32 కోట్లు ఉంది. ఇక జేజేపీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తుల విలువ రూ.25.26 కోట్లుగా తేల్చింది.

ఎమ్మెల్యేల వయస్సు
ఇక ఎమ్మెల్యేల వయస్సు విషయానికొస్తే 10 మంది ఎమ్మెల్యేలు 31 నుంచి 40 ఏళ్ల మధ్యలో తమ వయస్సును డిక్లేర్ చేయగా 17 మంది ఎమ్మెల్యేలు 41 నుంచి 50 ఏళ్ల మధ్యలో వయస్సును ప్రకటించారు.51 ఏళ్ల నుంచి 70 ఏళ్లలోపు వయసును డిక్లేర్ చేసినవారు 57 మంది ఎమ్మెల్యేలున్నారు.ఆరుగురు ఎమ్మెల్యేలు తమ వయస్సును 71 నుంచి 80 ఏళ్లు ప్రకటించారు. 90 ఎమ్మెల్యేల్లో 9 మంది మహిళా ఎమ్మెల్యేలుండగా, 2014లో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 13గా ఉన్నిందని ఏడీఆర్ సంస్థ వెల్లడించింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!