మోడీ దిగ్భ్రాంతి: 'ఆర్గనైజర్ కాంగ్రెస్, జనాలపై నుంచి రైలు వెళ్తుంటే సిద్ధూ భార్య ప్రసంగం', ఆమె ఖండన
న్యూఢిల్లీ/అమృత్సర్: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇది గుండెలు బద్దలయ్యే విషాదమన్నారు.

పంజాబ్‌లో ఘోర ప్రమాదం: ట్రాక్‌పై రావణ దహనం, జనాల పైనుంచి దూసుకెళ్లిన రైలు, 50మంది మృతి (వీడియో)
ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ప్రమాదంపై రాజ్‌నాథ్, అమరీందర్ సింగ్
ఈ ప్రమాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇది ఎంతో బాధాకరమన్నారు. మనసు కలచివేసిందన్నారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.
పంజాబ్ సీఎం అమరీందర్ మాట్లాడుతూ... ఈ సంఘటన షాక్‌కు గురి చేసిందని అన్నారు. గాయపడ్డ వారిని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ ప్రమాదం దిగ్భ్రాంతికరమని, నేను రేపు (శనివారం) అమృత్సర్ వెళ్తున్నానని చెప్పారు.
పీయూష్ గోయల్ దిగ్భ్రాంతి
ఈ ప్రమాదం వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలన దేవుడిని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే రైల్వే శాఖ ఆధ్వర్యంలో రిలీఫ్, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైందని చెప్పారు.
కాంగ్రెస్ వైపు వేలు, జనాలపై నుంచి దీసుకెళ్తున్నా సిద్ధూ భార్య స్పీచ్
ఇక్కడ జరిగిన దసరా వేడుకలపై ఓ ప్రత్యక్ష సాక్షి మాట్లాడారు. రైల్వే ట్రాక్ పైన ఎలాంటి అనుమతి లేకుండా కాంగ్రెస్ పార్టీ దసరా వేడుకలను నిర్వహించిందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సతీమణి ముఖ్య అతిథిగా వచ్చారని చెప్పారు. ఓ వైపు ప్రజల పై నుంచి రైలు దూసుకెళ్తుంటే సిద్ధూ భార్య మాత్రం అలాగే ప్రసంగం కొనసాగించారని మండిపడ్డారు. అంతేకాదు, ఈ ప్రమాదం జరిగిన తర్వాత బాధితులకు సహాయం చేయకుండా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతి లేకుండా అక్కడ నిర్వహించడం, జాగ్రత్తలు తీసుకోకపోవడం, సిద్ధూ భార్య ప్రమాదం జరిగాక పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అక్కడున్న వారంతా ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
స్పందించిన సిద్ధూ భార్య
ఈ ప్రమాదంపై నవజ్యోత్ సింగ్ సిద్ధూ సతీమణి నవజ్యోత్ కౌర్ సిద్ధ మాట్లాడారు. రావణ దహనం సందర్భంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించామన్నారు. అక్కడ ప్రతి ఏటా దసరా ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. ఓ ప్రత్యక్ష సాక్షి ఆమె అలాగే ప్రసంగించారని చెప్పారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. దీనిపై రాజకీయాలు సరికాదని వ్యాఖ్యానించారు. కాగా, 13 సెకండ్లలోనే ఈ విషాదం చోటు చేసుకుంది.