వామ్మో .. సిగరెట్ డబ్బులడిగితే పెట్రోల్ పోసి నిప్పంటించాడు, తీవ్రగాయాలతో షాపు ఓనర్ మృతి
గురుగ్రాం : సమాజంలో మంచికి చోటులేదని ఊరికనే పెద్దలు అనలేదు. ఏదైనా మనమంచికే అంటారు కానీ .. అందులో చెడు కూడా ఉంటుంది. గుర్రుగ్రాంలో అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. డబ్బులు తీసుకొని ఇవ్వాల్సిన సిగరెట్ అప్పుగా ఇచ్చి .. తీరా నగదు ఇవ్వమని అడిగితే చిర్రుమన్న కొనుగోలుదారుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
సిగరెట్ ఇస్తే నిప్పుపెట్టాడు ..
గురుగ్రామ్‌లోని సైబర్ సిటీ వద్ద అబ్దుల షాకూర్ కు పాన్ షాపు ఉంది. సాధారణంగా పాన్ షాపులో ఉద్దెర ఇవ్వడం మాములే. అలానే కన్నయ్య అనే వ్యక్తిని సిగరెట్లను ఇచ్చాడు. కానీ అతడు సిగరెట్లు తీసుకుంటున్నాడు కానీ డబ్బులివ్వడాన్ని మరచిపోతున్నాడు. దీంతో ఈ నెల 3న కూడా షాపు వద్దకొచ్చి 3 సిగరెట్లు తాగాడు కన్నయ్య. అయితే డబ్బులివ్వమని అడిగితే బుకాయించాడు. దీంతో అబ్దుల్ కు .. కన్నయ్యకు మధ్య పెద్ద గొడవే జరిగింది. తర్వాత వారికి స్థానికులు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

పెట్రోల్ అంటించాడు ..
వాస్తవానికి గొడవ అక్కడ ముగియలేదు. తననే డబ్బులు అడుగుతావా అని భావించిన కన్నయ్య రగిలిపోయాడు. ఆ మరునాడు కూడా షాపు వద్దకు వచ్చాడు. ఒక సిగరెట్ కొని దానికి అంటించుకొన్నాడు. అప్పటికే తనతో తీసుకొచ్చిన పెట్రోల్ అబ్దుల్ మీద పోసి .. సిగరెట్ పీక పడేసి వెళ్లిపోయాడు. అసలే పెట్రోల్ .. ఎండకాలం కావడంతో అబ్దుల్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను సఫ్తార్ జంగ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మృత్యువుతో పోరాడిన అబ్దుల్ ఓడిపోయాడు. నిన్న తుదిశ్వాస విడిచాడు. దీంతో అబ్దుల్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కన్నయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. లేదంటే గతంలో పాతకక్షలు ఉన్నాయా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నామన్నారు. అయితే ప్రాథమిక సమాచారం సిగరెట్ డబ్బుల విషయంలో తప్ప మరే గొడవ లేదని స్థానికులు తెలిపినట్టు .. పోలీసులు చెప్పారు. నిజనిజాలు విచారణలో తెలుస్తాయని పేర్కొన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!